పౌరసర..సఫా

ABN , First Publish Date - 2020-12-11T07:09:10+05:30 IST

రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలకు అన్నంపెట్టే పౌరసరఫరాల సంస్థ నిండా అప్పుల్లో మునిగిపోయింది. రాష్ర్టానికి అన్నపూర్ణలా ఉంటూ ఎలాంటి కష్టనష్టాల్లో అయినా ప్రజలకు ఆసరాగా ఉండే ఈ సంస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రుణాల ఊబిలోకి దింపింది.

పౌరసర..సఫా

నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ

ఏడాదిన్నరలో రూ.16 వేల కోట్ల రుణం..

మొత్తం అప్పుల భారం రూ.26 వేల కోట్లు

ఖరీఫ్‌ పంట కొంటే 30 వేల కోట్లకు చేరిక 

కార్పొరేషన్‌ చరిత్రలో ఇంత అప్పు తొలిసారి

మద్దతు ధర, చౌక సరుకుల చెల్లింపులకు 

ముందుగా అప్పులు చేసే కార్పొరేషన్‌

వాటిని ఆ తర్వాత తిరిగి చెల్లించే ప్రభుత్వం

వైసీపీ సర్కారు వచ్చాక ఎక్కడి రుణం అక్కడే

ఇలాగైతే మున్ముందు అప్పులిచ్చేదెవరు?

ఆందోళనలో పౌరసరఫరాల శాఖ వర్గాలు


ఏటా ధాన్యం కొనుగోళ్ల సమయంలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ రుణాలకు వెళ్తుంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులను కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులు తానే చెల్లిస్తుంది. ఇదంతా ఒక సర్దుబాటు! వైసీపీ ప్రభుత్వం వచ్చి దీన్నంతా రివర్స్‌ చేసేసింది. ఎంతసేపూ రుణాలు తెచ్చుకోవడానికి అనుమతులివ్వడం తప్ప, వాటిని తిరిగి చెల్లించడాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ పేదోడి సంస్థను అప్పుల ఊబిలోకి దించేసింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలకు అన్నంపెట్టే పౌరసరఫరాల సంస్థ నిండా అప్పుల్లో మునిగిపోయింది. రాష్ర్టానికి అన్నపూర్ణలా ఉంటూ ఎలాంటి కష్టనష్టాల్లో అయినా ప్రజలకు ఆసరాగా ఉండే ఈ సంస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రుణాల ఊబిలోకి దింపింది. సంస్థ పేరు చెప్పి అప్పులు తెచ్చుకోవడమే తప్ప తిరిగి చెల్లించే సంస్కృతికి మంగళం పాడింది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా రూ.16 వేల కోట్ల అప్పుల భారం పౌరసరఫరాల కార్పొరేషన్‌పై పడింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆ సంస్థకు రూ.10వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడు అది అక్షరాలా రూ.26వేల కోట్లకు చేరింది. పైగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు చెల్లింపుల కోసం మరోసారి ఈ సంస్థ అప్పులకు వెళ్లనుంది. దీంతో అతి త్వరలోనే అప్పులు రూ.30వేల కోట్ల మార్కు దాటతాయని అంచనా వేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ సంస్థ అప్పులు రూ.10 వేల కోట్లకు అటూఇటూగా ఉంటాయి.


అలాంటిది ఈ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోవడం పౌరసరఫరాల చరిత్రలో ఇదే తొలిసారి! ఏటా ధాన్యం కొనుగోళ్ల సమయంలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ రుణాలకు వెళ్తుంది. సేకరించిన ధాన్యానికి రైతులకు నగదు చెల్లించడం కోసం నిధులు సిద్ధంగా ఉంచుకుంటుంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులను కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులు చెల్లిస్తుంది. ఇలా ప్రతి ఏడాదీ అప్పులకు వెళ్లడం, తిరిగి చెల్లించడం ఈ సంస్థ నిధుల సర్దుబాటులో భాగంగా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎంతసేపూ రుణాలు తెచ్చుకోవడానికి అనుమతులివ్వడం తప్ప, వాటిని తిరిగి చెల్లించడాన్ని పూర్తిగా వదిలేసింది. పౌరసరఫరాల సంస్థ పేదలకు రాయితీపై రేషన్‌ సరుకులు ఇస్తుంది. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది. అందువల్ల ఈ సంస్థకు ఇతర ఆదాయ వనరులుండవు. దీంతో కార్పొరేషన్‌ అప్పుల బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది.


పప్పుల మంటతో మరింత కటకట

ఇటీవల కాలంలో పెరిగిన ధరలు, మద్దతు ధర పెంపు కూడా పౌరసరఫరాల సంస్థపై భారం పెంచుతోంది. కందిపప్పు ధర భారీగా పెరిగిపోవడంతో కిలో రూ.100 నుంచి రూ.125 పెట్టి పప్పు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మద్దతు ధర క్వింటా రూ.1868కి పెరిగింది. బియ్యం సార్టెక్స్‌ చేయడం లాంటి కొత్త విధానాలు సంస్థపై మరింత భారం మోపాయి. దీంతో సరుకుల పంపిణీకే నెలకు సుమారు రూ.రెండు వేల కోట్లు అవుతోంది. ఏటా సుమారు 60లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరిస్తుండటంతో దానికి రూ.13వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇందులో కేంద్రం వాటా కూడా సక్రమంగా అందడం లేదు. రాష్ర్టానికి రావాల్సిన సుమారు రూ.2వేల కోట్లు చాలాకాలంగా ఆగిపోయాయి.


దీంతో పౌరసరఫరాల సంస్థ అప్పులపై అప్పులు చేయాల్సి వస్తోంది. అది కూడా ఇటీవల నాబార్డు కేవలం 6.5శాతం వడ్డీరేటుతోనే రుణం ఇవ్వడం వల్ల భారం కొంతమేర తగ్గింది. లేనిపక్షంలో పాత అప్పులపై వడ్డీలకూ భారీగా నిధులు సమీకరించాల్సివచ్చేది. 


ఎలా చేస్తారు?

ఏ ప్రభుత్వ సంస్థకైనా అప్పులు పుట్టాలంటే భారీగా ఆస్తులుండాలి. కానీ పౌరసఫరాల సంస్థకు గోడౌన్లు తప్ప చెప్పుకోదగ్గ ఆస్తులు లేవు. ఆదాయ వనరులూ లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతోనే ఈ సంస్థ అప్పులు తెచ్చుకొంటున్నాయి. బ్యాంకులు, నాబార్డు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అధికారులు రుణాలు సమీకరిస్తుంటారు. కానీ ఇప్పుడు తెచ్చిన అప్పులు భారీగా ఉండటంతో వాటిని ప్రభుత్వం ఇప్పట్లో తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఎడాపెడా పెట్టిన పథకాలకు ఎక్కడికక్కడ ఆదాయ మార్గాలను ప్రభుత్వం ముడిపెట్టేసింది. ప్రతి రంగంపై వచ్చే ఆదాయానికి ముందస్తుగానే పథకాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చేసే అప్పులు తిరిగి చెల్లించే మార్గాలు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగి అప్పులు చెల్లించకపోతే భవిష్యత్తులో కొత్త అప్పులు ఎలా సమీకరిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


మరోవైపు భారీగా చేస్తున్న రుణాలపై అధికారవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ స్థాయిలో అప్పులు చేసి కట్టే పరిస్థితి లేకపోతే చివరికి ఉన్న చిన్నపాటి ఆస్తులు కూడా వేలానికి వెళ్లే ప్రమాదం వస్తుందేమోనని పౌరసరఫరాలశాఖ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా మితిమీరిన అప్పులు ఏదొక రోజు అసలుకే మోసం చేస్తాయేమోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-12-11T07:09:10+05:30 IST