ఫలితాలు ఆలస్యమైతే అనర్థం

ABN , First Publish Date - 2020-04-24T08:06:37+05:30 IST

కరోనా వైర్‌సకు సంబంధించి 16 వేల మంది శాంపిల్స్‌ ఫలితాలు పెండింగ్‌లో ఉండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత భారీ సంఖ్యలో నమూనాల ఫలితాలు పెండింగ్‌లో...

ఫలితాలు ఆలస్యమైతే అనర్థం

  • పెండింగ్‌లో 16 వేల శాంపిల్స్‌ ఫలితాలు
  • కరోనా ప్రబలడానికి ఇదే కారణం
  • రాష్ట్రంలో ఉన్నది ఎనిమిది ల్యాబ్‌లే
  • ప్రైవేటువారినీ భాగస్వాముల్ని చేయండి
  • వైరస్‌ నిర్ధారణకు ట్రూనాట్‌ కిట్లు ఉత్తమం
  • వైద్య సిబ్బందికి నాణ్యమైన రక్షణ సామగ్రి ఏదీ?
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సకు సంబంధించి 16 వేల మంది శాంపిల్స్‌ ఫలితాలు పెండింగ్‌లో ఉండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత భారీ సంఖ్యలో నమూనాల ఫలితాలు పెండింగ్‌లో ఉండడం వైరస్‌ వ్యాప్తి మరింత ప్రబలడానికి కారణమవుతోందని తెలిపారు. పరీక్షల వసతులు పెంచుకోవడం ద్వారా తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కోరారు. ఈ మేరకు గురువారం ఆమెకు లేఖ రాశారు. ‘రాష్ట్రంలో వైరస్‌ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. పరీక్షలు ఎక్కువ చేయడం.. తీసుకుంటున్న నమూనాల ఫలితాలు త్వరగా తెప్పిస్తేనే నివారణ చర్యలు వేగంగా తీసుకోగలం.


రాష్ట్రంలో ల్యాబ్‌లు తక్కువగా ఉన్నాయి. కేవలం ఎనిమిదే ఉన్నందువల్ల ఫలితాలు రావడంలో బాగా ఆలస్యమవుతోంది. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల భాగస్వామ్యంతో పరీక్ష లు చేస్తే ఈ సమస్య కొంతవరకూ పరిష్కారమవుతుంది. దానితోపాటు ఈ రంగంలో మౌలిక వసతులు పెరుగుతాయి’ అని ఆయన సూచించారు. గత ప్రభుత్వం 250 కేంద్రాల్లో ట్రూనాట్‌ కిట్లను అందుబాటులో ఉంచిందని, క్షయ నిర్ధారణకు వినియోగించే ఈ కిట్లు.. కరోనా నిర్ధారణలో కూడా బాగా ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌ కూడా ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ట్రూనాట్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు పంపి తుది ఫలితం నిర్ధారించుకోవచ్చని, నెగెటివ్‌ వచ్చిన వారి నమూనాలు పంపనక్కరలేదని... దీనివల్ల సమయం బాగా కలిసి వస్తుందని తెలిపారు.


కరోనా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి పీసీఆర్‌ పరీక్ష అంతిమమని, దానికి అందరి శాంపిల్స్‌ పంపకుండా ట్రూనాట్‌లో పాజిటివ్‌ వచ్చిన వారివి మాత్రమే పంపితే పీసీఆర్‌ టెస్టులపై భారం తగ్గుతుందని సూచించారు. గత ప్రభుత్వం ట్రూనాట్‌ పరీక్షా కేంద్రాలను రియల్‌టైం గవర్నెన్స్‌తో అనుసంధానించి వెంటనే చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేసిందని.. ఇప్పుడు కూడా ఆర్‌టీపీసీఆర్‌ ఫలితాలతోపాటు అన్ని ల్యాబ్‌ల నుంచి వచ్చే ఫలితాలను ల్యాబ్‌ స్థాయిలోనే ఆన్‌లైన్‌లోకి వచ్చే ఏర్పాటుచేసి వాటి ఆధారంగా జిల్లా, రాష్ట్ర స్ధాయి అధికారులు సత్వరం కదిలేలా చూడాలని కోరారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఒక వినూత్న ప్రక్రియ, విధానం, ప్రొటోకాల్‌ రూపొందించుకోవాలని, దీనివల్ల ప్రజలకు రక్షణ లభిస్తుందని తెలిపారు. కరోనా నియంత్రణలో మొదటి వరుసలో ఉండి పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ, ఇతర ఉద్యోగులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన వ్యక్తిగత భద్రత సామగ్రి, శానిటైజర్లు లభించడం లేదని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. నాసిరకం సామగ్రి, శానిటైజర్ల వల్ల రోగులకు దగ్గరగా ఉండి పనిచేసే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, వైరస్‌ వారికి సోకే ముప్పుందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం వ్యక్తిగత భద్రత మాస్కులు, పూర్తి శరీరం తొడుగులు, శానిటైజర్లకు నాణ్యత ప్రమాణాలను ఖరారు చేసి దానికి అనుగుణంగా సరఫరాలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. అప్పుడే రోగులకు దగ్గరగా ఉండే పని చేసే వారిని కాపాడుకోగలమని లేఖలో తెలిపారు.


Updated Date - 2020-04-24T08:06:37+05:30 IST