డెయిరీపై దొంగదెబ్బ!

ABN , First Publish Date - 2020-10-19T08:59:54+05:30 IST

డెయిరీ రంగంపై దొంగ దెబ్బ పడనుంది. ఇకపై పాల సేకరణలోనూ ప్రభుత్వ జోక్యానికి రంగం సిద్ధమైంది.

డెయిరీపై  దొంగదెబ్బ!

మన పాలు అమూల్‌కు ధారాదత్తం

‘ఆనంద్‌’కు అమ్మడానికి సన్నాహాలు 

సహకార, ప్రైవేటు డెయిరీలపై పడగ 

పాడిరైతులకు ఇస్తామన్న బోనస్‌ తుస్‌ 

హెరిటేజ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా

మొత్తం సహకార రంగానికి ఎసరు?

ఆర్బీకేల్లో కొత్తగా పాల సేకరణ కేంద్రాలు 

వాటిల్లో పాలు పోయకుంటే పథకాలు కట్‌? 

పాడిరైతులు, డెయిరీ వర్గాల్లో ఆందోళన 

సీమలో అమూల్‌ ప్రతినిధుల పరిశీలన 


చంద్రబాబు ఉంటున్న ఇంటిని ముంచేందుకు ప్రయత్నించి.. ప్రకాశం బ్యారేజీ వద్ద నీళ్లు నిల్వ చేసి.. లంక గ్రామాల్లో పొలాలను ముంచేశారు! ఇప్పుడు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ను దెబ్బ తీసేందుకు రాష్ట్రంలోని మొత్తం పాల సహకార సంఘాలను, ప్రైవేట్‌ డెయిరీలను ముంచేస్తున్నారా? మన రాష్ట్రానికి చెందిన ‘విజయ’ బ్రాండ్‌ను కాదని ఎక్కడో గుజరాత్‌కు చెందిన ‘అమూల్‌’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంలోని మతలబు ఏమిటి? అదీ వారికి ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? నిజంగా పాడిరైతులకు మేలు చేయాలనుకుంటే ఇక్కడి సహకార సంఘాల ద్వారానే చేయొచ్చు కదా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి) :డెయిరీ రంగంపై దొంగ దెబ్బ పడనుంది. ఇకపై పాల సేకరణలోనూ ప్రభుత్వ జోక్యానికి రంగం సిద్ధమైంది. ఇక్కడ ఉత్పత్తయ్యే పాలల్లో అధికశాతం ‘అమూల్‌’కు ధారాదత్తం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలు ఉండగా... ఇవేవీ కాదని గుజరాత్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో కొత్తగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ‘విజయ’ బ్రాండ్‌ పేరుతో వీటిలో సేకరించిన పాలను అమూల్‌కు ధారపోసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా సహకార రంగంలో నడుస్తున్న డెయిరీలు నిర్వీర్యం కావడంతో పాటు ప్రైవేటు డెయిరీల మనుగడకూ ప్రమాదం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


బోనస్‌ ఊసేదీ... 

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలో పాడిరైతులను ఆదుకుంటామని, లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని వాగ్దానం చేశారు. వైసీపీ నవరత్నాల్లో ఈ హామీ కూడా ఒకటి. కానీ అధికారం చేపట్టాక 2019-20 బడ్జెట్‌లో పాడిరైతుల బోన్‌సకు నిధులు కేటాయించలేదు. వచ్చే ఏడాది నుంచి బోనస్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు.


కానీ 2020-21 బడ్జెట్‌లో ఆ ఊసెత్తకుండా.. అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.. పాల సేకరణలో అమూల్‌ అడుగుపెట్టడం వల్ల పాడి రైతులకు మంచి(అదనపు) ధర వస్తుందని సీఎం జగన్‌ ప్రకటించారు. దీంతో పాలకేంద్రానికి పోస్తే లీటరుకు రూ.4 అదనంగా వస్తాయని ఆశించిన పాడి రైతులకు ప్రభుత్వ తత్వం ఆలస్యంగా బోధపడింది. పైగా ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లోనే పాలు పోయాలన్న సంకేతాలతో మోసపోయామని భావిస్తున్నారు. ఆర్బీకేల్లోని పాల కేంద్రాల్లోనే పాలు పోయాలన్న షరతు విధించే దిశగా పాడి రైతులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమ మాట వినని వారికి ప్రభుత్వ పథకాల లబ్ధిని కట్‌ చేసే ఆలోచన ఉందన్న చర్చ గ్రామాల్లో సాగుతోంది. పాల సేకరణ కోసం 11,600 గ్రామాల్లోని ఆర్బీకేల్లో పాల సేకరణ కేం ద్రాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 6వేలపై గ్రామాల్లో వీటిని తెరవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


ఆసక్తి చూపని అమూల్‌ 

ఏపీ డెయిరీ రంగంలో అడుగుపెట్టడానికి అమూల్‌ సంస్థ పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆనంద్‌ డెయిరీ సాంకేతికతను ఏపీకి తీసుకొచ్చి, పాల వ్యాపారం చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ఉద్దేశంతో అమూల్‌ పెద్దలు వెనుకాడగా, రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్‌ ఉన్నతాధికారులు వారితో చర్చించి మరీ ఒప్పించినట్లు సమాచారం. దీంతో చెన్నై బ్రాంచ్‌ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. విజయ డెయిరీ ద్వారా ప్రభుత్వమే పాల సేకరణ చేసి, అమూల్‌కు అప్పగించేలా ఒప్పందం కుదిరినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా ఈ విధానంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెద్దగా పెరిగే అవకాశాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


లీటరు పాలకు రూ.55 

రాష్ట్రంలో ఏ డెయిరీ అయినా పాలల్లో వెన్న శాతాన్ని బట్టి ధర చెల్లిస్తున్నాయి. వెన్న శాతం తక్కువగా ఉన్న పాలకు రూ.45-50 వరకూ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు పాల సేకరణ ఉత్పత్తుల్లో పేరున్న అమూల్‌తో ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఒప్పందం చేసుకుందంటున్నారు. రాష్ట్రంలో సేకరించే పాలను అమూల్‌ తీసుకొని లీటరుకు రూ.55 చొప్పున ఇస్తుందంటున్నారు. ప్రైవేట్‌ డెయిరీలు పాలు కల్తీ చేస్తున్నాయని, అమూల్‌ నాణ్యమైన పాలను ఇస్తుందని పేర్కొంటున్నారు. కాగా, అమూల్‌తో చేసుకొన్న ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు 13 జిల్లాల్లోని సహకార శాఖ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 


రంగంలోకి దిగని ఒప్పంద సంస్థ 

అమూల్‌తో ఒప్పందం జరిగి నెలలు గడుస్తున్నా, ఇంత వరకు ఆ సంస్థ పాల సేకరణలోకి రాలేదు. అయితే అమూల్‌ అగ్రశ్రేణి సంస్థ అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న డెయిరీలను కాదని వారితో ఒప్పందం చేసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. అమూల్‌ స్థాయి ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం భావిస్తే ఆ సంస్థ నిపుణులతో ఇక్కడి సహకార డెయిరీలకు శిక్షణ ఇప్పిస్తే సరిపోతుందని పలువురు సూచిస్తున్నారు. 


టార్గెట్‌.. హెరిటేజ్‌! 

రాష్ట్రంలో ఏటా సగటున 150 లక్షల టన్నులకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రైవేటు డెయిరీలు 50ు, సహకార డెయిరీలు 40ు సేకరిస్తుండగా, స్థానికంగా పశుపోషకుల క్రయవిక్రయాలు 10ు ఉంటున్నాయి. పాల సేకరణ, విక్రయాల్లో సహకార డెయిరీలతో పాటు ప్రైవేటు రంగంలోని ప్రాబల్యాన్ని నిలువరించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది. పాల ఉత్పత్తిదారులకు మంచి ధర ఇప్పిస్తామంటూ ‘అమూల్‌’తో ఒప్పందం చేసుకుంది. కానీ ఈ ఒప్పందం వెనుక వేరే కోణం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్నహెరిటేజ్‌ను దెబ్బతీసేందుకు మొ త్తం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు సంకల్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


చంద్రబాబు ఆర్థిక మూలాలను దెబ్బతీసే క్రమంలో డెయిరీ రంగాన్నే దెబ్బకొట్టేలా ప్రభుత్వం వేరే రాష్ట్రానికి చెందిన సంస్థతో ఒప్పందం చేసుకుందని డెయిరీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అమూల్‌ ప్రతినిధులు ఇప్పటికే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. తాజాగా మదనపల్లిలో రైతులు, అధికారులతో చిత్తూరు జిల్లాలో పాల సేకరణ తీరుపై చర్చించారు. ఈ జిల్లా నుంచి ఎక్కువగా హెరిటేజ్‌ డెయిరీకి వెళ్తున్న పాల సరఫరాను దెబ్బతీసేందుకు అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందం చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-10-19T08:59:54+05:30 IST