డీఎడ్ కాలేజీలు మూత?
ABN , First Publish Date - 2020-08-16T08:18:28+05:30 IST
ప్రైవేట్ డీఎడ్ కాలేజీల కథ త్వరలోనే ముగియనుంది. కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదించిన నూతన జాతీయ విద్యావిధానంలో ఈ కోర్సు రద్దవుతుందని పేర్కొనడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు...

- దిక్కుతోచని స్థితిలో కాలేజీల మేనేజ్‌మెంట్లు
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ డీఎడ్ కాలేజీల కథ త్వరలోనే ముగియనుంది. కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదించిన నూతన జాతీయ విద్యావిధానంలో ఈ కోర్సు రద్దవుతుందని పేర్కొనడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. డీఎడ్ రద్దుతోపాటు ఇంటర్ అర్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కోర్సు పూర్తిచేసినవారిని టీచర్లుగా నియమించాలని ప్రతిపాదించింది. డిగ్రీ అర్హతతో ప్రస్తుతం ఉ న్న రెండేళ్ల బీఈడీ యథాతథంగా కొనసాగనుంది. కాగా, రాష్ట్రంలోని దాదాపు 750 ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో సుమారు 70వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలేజీల్లో 10వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 2008 నుంచి ప్రైవేట్ డీఎడ్ కాలేజీలు నడుస్తున్నాయి. ఇంటర్ విద్యార్హతతో డైట్‌సెట్ నిర్వహించి మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం కాలేజీకి మం జూరైన సీట్లలో 80ు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ కోర్సుకు ఆదరణ తగ్గుతుండటంతో కన్వీనర్ కోటాలో 10-20ు సీట్లు కూడా భర్తీ కావడం లేదు. వీటిని డైట్‌సెట్ రాయనివారికి ఇంటర్ అర్హతతో కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ జీవో.30 జారీ చేయడంతో అడ్మిషన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ ఉత్తర్వుల ప్రకారం డైట్‌సెట్‌లో అర్హత తప్పనిసరి. 2018-20 అడ్మిషన్లలో 188 డీఎడ్ కాలేజీలు నిబంధనను ఉల్లంఘించాయని, అఫిలియేషన్ రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ ఎన్‌సీటీఈకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా కాలేజీలకు ఎన్‌సీటీఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.