పంట నష్టాన్నీ లెక్కించలేదు
ABN , First Publish Date - 2020-10-24T08:38:52+05:30 IST
వరదలు, భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాలను కనీసం అంచనా వేయకుండా, కేంద్రానికి ఒక లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొన్నదని బీజేపీ ఎంపీలు విమర్శించారు.

లేఖతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రా రైతులను మీరే ఆదుకోవాలి
వెంటనే కేంద్ర బృందాలను పంపండి
కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రికి బీజేపీ ఎంపీల వినతి
న్యూఢిల్లీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వరదలు, భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాలను కనీసం అంచనా వేయకుండా, కేంద్రానికి ఒక లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొన్నదని బీజేపీ ఎంపీలు విమర్శించారు. తక్షణమే కేంద్ర పరిశీలనా బృందాలను రాష్ర్టానికి పంపి, పంట నష్టాలను అంచనా వేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, సుజనా చౌదరి శుక్రవారం కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
వరదలు, భారీ వర్షాల వల్ల రైతులకు కలిగిన అపార నష్టాలను ఆయనకు వివరించారు. మొత్తం 8.24లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తమ వినతిపై రూపాల సానుకూలంగా స్పందించారని సీఎం రమేశ్ తెలిపారు.
‘వరద’ క్లెయిమ్‌లు క్లియర్ చేయండి: ఐఆర్డీఏఐ
వరదల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీమా సెటిల్మెంట్లు, క్లెయిమ్‌లను త్వరగా చేపట్టాలంటూ అన్ని బీమా కంపెనీలకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను జారీ చేసింది. మరణాలకు సంబంధించిన క్లెయిములపై ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే డెత్ సర్టిఫికెట్ పొందడం సాధ్యం కాదు కాబట్టి జమ్మూకశ్మీర్ వరదల సమయంలో 2014లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.