పడగవిప్పిన ప్రేమోన్మాదం

ABN , First Publish Date - 2020-12-03T09:04:21+05:30 IST

విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో బ్లేడుతో ఆమె గొంతుకోశాడు.

పడగవిప్పిన ప్రేమోన్మాదం

బ్లేడుతో యువతి గొంతు కోసి హత్యాయత్నం 

వేరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో దాడి?

గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు 

ఇద్దరికీ తప్పిన ప్రాణాపాయం.. బాధితురాలు వార్డు వలంటీర్‌ 


విశాఖపట్నం/మహారాణిపేట, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో బ్లేడుతో ఆమె గొంతుకోశాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇద్దరినీ కేజీహెచ్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు... కన్వేయర్‌ బెల్ట్‌ ప్రాంతం(థామ్సన్‌ వీధి)లో మాకిన ప్రియాంక(20) కుటుంబం నివాసం ఉంటోంది. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఆమె 6నెలల కిందట అదే ప్రాంతంలో వార్డు వలంటీర్‌గా చేరింది. అక్కడికి సమీపంలోనే అద్దేపల్లి శ్రీకాంత్‌(23) కుటుంబం ఉంటోంది. ఐటీఐ చదివిన శ్రీకాంత్‌ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 8.30గంటల సమయంలో కొళాయిలు వదలడంతో ప్రియాంక తల్లిదండ్రులు నీళ్లు పట్టుకునేందుకు కిందకు వెళ్లారు.


ఆ సమయంలో శ్రీకాంత్‌ వారింట్లో చొరబడి తనతో పాటు తీసుకువెళ్లిన బ్లేడ్‌తో ప్రియాంక గొంతు కోసేశాడు. అనంతరం తనూ గొంతు కోసుకుని బయటకొచ్చి నీళ్లు పట్టుకుని మెట్లెక్కేందుకు సిద్ధపడుతున్న యువతి తల్లి రమణమ్మపై తూలి పడిపోయాడు. ‘మీ అమ్మాయి గొంతు కోసి చంపేశాను. వెళ్లి చూసుకోండి’ అని చెప్పడంతో ఆమె కేకలు వేసుకుంటూ పైకి వెళ్లేసరికి ప్రియాంక రక్తపు మడుగులో పడి ఉంది. స్థానికులు వారిద్దరినీ హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. శ్రీకాంత్‌ కొంతకాలంగా తమ కుమార్తెను ప్రేమించాలంటూ వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. శ్రీకాంత్‌ను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. డీసీపీ ఐశ్వర్య రస్తోగి, దిశ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌, ఇతర పోలీస్‌ అధికారులు కేజీహెచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య 20ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయని, ఒకరికొకరు బాగా తెలుసన్నారు. ఏదో అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నామన్నారు.


నిందితుడు కోలుకుతున్న తర్వాత కస్టడీకి తీసుకుంటామన్నారు. ప్రియాంక, శ్రీకాంత్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, గతంలో పెళ్లి విషయమై ఇరు కుటుంబాలు చర్చించుకోగా యువతి తరఫువారు అంగీకరించలేదని స్థానికులు చెబుతున్నారు. వలంటీర్‌గా చేరిన తర్వాత శ్రీకాంత్‌ను ప్రియాంక దూరం పెట్టిందని, దీంతో ఆమె వేరొకరికి దగ్గరై ఉంటుందని అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-12-03T09:04:21+05:30 IST