హీరోయిన్లు ఈ ఉచ్చులోనే చిక్కుకుంటున్నారా?

ABN , First Publish Date - 2020-10-09T01:44:36+05:30 IST

బెట్టింగ్‌ యాప్స్‌ కొత్తదారులు వెతుకుతున్నాయా? జూదం నుంచి హవాలా దాకా అడ్డాగా మారాయా? అన్ని రూట్లు మూసేశాక..

హీరోయిన్లు ఈ ఉచ్చులోనే చిక్కుకుంటున్నారా?

బెట్టింగ్‌ యాప్స్‌ కొత్తదారులు వెతుకుతున్నాయా? జూదం నుంచి హవాలా దాకా అడ్డాగా మారాయా? అన్ని రూట్లు మూసేశాక ఇదే షార్ట్‌కట్‌ అయ్యిందా? హీరోయిన్లు ఈ ఉచ్చులోనే చిక్కుకుంటున్నారా? అసలు గ్యాంబ్లింగ్‌ ఎలా జరుగుతోంది? జనం జేబుల్లోంచి లక్షలు ఎలా కొట్టేస్తున్నారు?


ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌ దందా హాట్‌ టాపిక్‌గా మారింది. జనం సొమ్మును కొల్లగొడుతున్న యాప్‌ల గురించిన ఆనవాళ్లు దొరుకుతున్నాయి. అంతేకాదు.. ఊహించని లింకులు కూడా బయటపడుతున్నాయి. భారత్‌ సొమ్ము దేశం ఎల్లలు దాటిపోతోంది. 


బెట్టింగ్‌.. ఒకప్పుడు నేరుగా, తర్వాత టెలిఫోన్‌ ద్వారా సాగిన దందా. ఇప్పుడు అంతా యాప్‌ మయం అయిపోయింది. సెల్‌ఫోన్‌లతోనే పని పూర్తవుతోంది. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు లక్షలు, కోట్లలో డబ్బులు చేతులు మారుతున్నాయి. కాదు.. కాదు.. అకౌంట్‌లు మారుతున్నాయి. దేశాల ఎల్లలు కూడా దాటిపోతున్నాయి. 


స్మార్ట్‌ఫోన్లు వచ్చాక, ప్లేస్టోర్‌ అందుబాటులో ఉన్నాక, ఇప్పుడంతా యాప్‌ల మయం అయిపోయింది. బెట్టింగ్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ గేమ్‌ యాప్స్‌ కుప్పలు తెప్పలుగా ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. జనాలను ఆకర్షిస్తున్నాయి. ముందుగా ఎరవేసి ఆకట్టుకుంటున్నాయి. అకౌంట్‌లో అడ్వాన్స్‌గా ఇంత డబ్బులు యాడ్‌ చేశామని, యాప్‌ ఓపెన్‌ చేసి ఆడుకోవచ్చని, లేదంటే బెట్టింగ్‌లు చేసుకోవచ్చని చెబుతున్నాయి. కానీ, ఒక్కసారి ఆ లోకంలోకి వెళ్లిపోయిన తర్వాత బయటపడటం కష్టమవుతోంది. చాలామందికి, ప్రధానంగా యువతకు ఇదో వ్యసనంలా మారుతోంది. 



ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లు రంజుగా సాగుతున్నాయి. అయితే, ఈ సీజన్‌ మొదలు కాకముందునుంచే  కొన్ని బెట్టింగ్‌ కంపెనీలు భారీగా ప్రచారం చేసుకున్నాయి. క్రికెట్‌మీద అభిమానం ఉన్న వాళ్లను ఆ ఉచ్చులోకి లాగాయి. అంతేకాదు.. ప్రధాన నగరాల్లో వీటికి ఏజెంట్లు, మీడియేటర్లు కూడా తయారయ్యారు. యాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా జేబులు గుల్ల చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.


ప్రధానంగా చైనా కంపెనీలు ఈ యాప్‌లను రూపొందిస్తున్నాయి. ఆ యాప్‌లు భారీగా భారతీయుల ఖాతాలు కొల్లగొడుతున్నాయి. ఈ బెట్టింగ్‌ల మాయలో చాలామంది పడిపోతున్నారు. కానీ, అందరూ డబ్బులు పోగొట్టుకునేవాళ్లే తప్ప ఈ దందాతో సంపాదించిన వాళ్లు లేరు. బడా కొర్పొరేట్‌ కంపెనీలు, చైనీస్‌ కంపెనీలు, యాప్‌లు, మీడియేటర్లు, ఏజెంట్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌ సొమ్మును పంచుకుంటున్నారు. ఆఖరికి క్రికెట్‌మీద అభిమానంతో, ఈజీగా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో ఈ ఉచ్చులో చిక్కుకున్న వాళ్లు అకౌంట్లు ఖాళీ చేసుకుంటున్నారు.


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బెట్టింగ్‌లు, పేకాట, మట్కా వంటి జూదాలను నిషేధించింది ప్రభుత్వం. అంతేకాదు.. పేకాట క్లబ్బులను సైతం  మూసేయించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ , యాప్స్‌ను కూడా నిషేధించింది. తెలంగాణ పరిధిలో అవి ఓపెన్‌ కాకుండా చర్యలు తీసుకుంది. కానీ, కొందరు వీటిని కూడా ఓవర్‌టేక్‌ చేసి ఆన్‌లైన్‌ దందా సాగించేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సెట్టింగ్‌లు, కంత్రీ ప్లాన్లతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు.



అధికారికంగా తెలంగాణలో బెట్టింగ్‌లు, జూదాలను నిషేధించినా.. కొన్ని యాప్‌లలో తప్పుడు చిరునామాలు, వివరాలు ఇచ్చి, పక్క రాష్ట్రాల నుంచి నమోదు చేసుకున్నట్లుగా యాప్‌లలోకి ఎంటర్‌ అవుతున్నారు. మరికొందరైతే మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులతో యూజర్‌ ఐడీలు, చిరునామాలు క్రియేట్‌ చేసుకొని ఇక్కడ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌ సీజన్‌లో కొన్ని యాప్‌లు జోరుగా ఈ దందా సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో కొనసాగుతున్న తంతు ఇది. 


ఆన్‌లైన్‌ యాప్‌లు ఎంతగా జనాలను చిత్తుచేస్తున్నాయో, మత్తుగా ఉచ్చులోకి దించుతున్నాయో ఆలోచిస్తేనే షాకయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంగా కొన్ని సందర్భాల్లో బయటపడుతున్న వివరాలు వాటికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌, డ్రగ్స్‌ ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకులున్న దందాలుగా బట్టబయలవుతున్నాయి. ఇవన్నీ కూడా సామాన్యులు, అమాయకులు, యువతే లక్ష్యంగా సాగుతున్న ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి.


బాలీవుడ్‌ డ్రగ్స్‌ దందాలో లింకులు బయటపడ్డ శాండల్‌వుడ్‌ వ్యవహారం దక్షిణాదిలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కన్నడ నటి సంజనా గల్రానిని డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంజనాతో పాటు మరికొందరు కూడా అక్కడ అరెస్టయ్యారు. అయితే.. సంజనా దర్యాప్తులో  పోలీసులు దిమ్మదిరిగే విషయాలు తెలుసుకున్నారు. 



చైనాకు చెందిన బింగో, హకూనా యాప్‌ల ద్వారా నటి సంజనా భారీగా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించారు. ఖరీదైన పార్టీలు ఏర్పాటు చేసి, మిలియనీర్లు, బడా వ్యాపారులు, సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తూ..  ఈ చైనా యాప్‌ల ద్వారా ఆర్థిక వ్యవహారాలు సాగించిందని తెలుసుకున్నారు. అంటే.. డ్రగ్స్‌  వ్యవహారంతో ఈ యాప్‌ల లావాదేవీలకు మధ్య సంబంధాన్ని పసిగట్టారు.


బింగో యాప్‌ ఆన్‌లైన్‌ జూదానికి సంబంధించింది. ఈ యాప్‌ను ఇంటర్నెట్‌ క్యాసినోగా అభివర్ణిస్తారు. గేమింగ్‌, బెట్టింగ్‌ల ద్వారా ఈ యాప్‌ సహాయంతో సంజన భారీగా వెనకేసినట్లు ఆధారాలు దొరికాయి. అలాగే, హకూనా యాప్‌ మెస్సెంజర్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఈ యాప్‌ చాటింగ్‌ ద్వారా బెట్టింగ్‌లు నిరంతరాయం సాగించవచ్చు. ఈ రెండు యాప్‌ల సాయంతో సంజనా.. నగదు బదిలీలు పెద్ద ఎత్తున చేసినట్లు దర్యాప్తులో తేలింది. 


సంజన కేసును విచారిస్తున్న మంగళూరు సీసీబీ అధికారులు ఆమె బ్యాంక్‌ అకౌంట్లు చూసి విస్తుపోయారు. యాప్‌ల ద్వారా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించగా, ఆమెకు ఉన్న 11 బ్యాంకు ఖాతాల్లో కేవలం 40 లక్షల రూపాయల బ్యాలెన్స్‌మాత్రమే ఉండటం చూసి అనుమానిస్తున్నారు. అంటే, డ్రగ్స్‌ దందా బయట పడగానే.. ఇవే యాప్‌ల సాయంతో భారీగా డబ్బులను తన ఖాతాలోంచి బదిలీ చేసిందని పసిగట్టారు. అరెస్ట్‌ కావడానికి నాలుగు వారాల ముందు నుంచి వరదలా డబ్బులను తన అకౌంట్‌నుంచి ఇతర అకౌంట్లకు బదిలీ చేసిందని గుర్తించారు.  దాదాపు 3కోట్ల రూపాయలు అరెస్ట్‌ అయ్యే ముందే తన ఖాతాల్లోంచి వేరే ఖాతాలకు బదిలీ చేసిందని తేల్చారు. డ్రగ్స్‌  దందా మీదుగా బెట్టింగ్‌ వ్యవహారం బట్టబయలు కావడంతో, ఈ స్థాయిలో బెట్టింగ్‌ కోరలు చాచిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 



- సప్తగిరి గోపగాని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-10-09T01:44:36+05:30 IST