కాదంటారా? ఇవి లేవంటారా?
ABN , First Publish Date - 2020-08-11T08:22:26+05:30 IST
మాయా లేదు... మంత్రం లేదు! గ్రాఫిక్స్ కానే కాదు... కనికట్టు అసలే కాదు! ఆంధ్రుల కలల రాజధానిగా తెరపైకి వచ్చిన అమరావతిలో జరిగిన పనుల పురోగతి స్వయంగా, ససాక్ష్యంగా జగన్ సర్కారే చాటి చెబుతోంది.

- సీఆర్డీయే వెబ్సైట్లో అమరావతి అభివృద్ధి చిత్రాలు
- అది ‘భ్రమరావతి’ కానే కాదు
- సర్కారు వెబ్‌సైటే సాక్ష్యం
- నిలువెత్తునా దర్శనమిచ్చే టవర్లు,
- సువిశాల రహదారుల ఫొటోలు
- ఈ చిత్రాలన్నీ 15 నెలల కిందటివే
- ఆపకపోతే ఈపాటికి పూర్తయ్యేవే
- నిర్మాణాలపై ఎప్పుడో జగన్‌కు నివేదిక
- అయినా... శ్మశానమనే వ్యాఖ్యలు
- అక్కడేమీ కట్టలేదంటూ విమర్శలు
ఇవి... అఖిల భారత సర్వీసు అధికారులు (ఏఐఎస్), ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీల కోసం నిర్మించిన టవర్లు. ఏఐఎస్‌ల కోసం 144 అపార్ట్మెంట్లతో 6 టవర్లను నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 12 టవర్లలో 288 అపార్ట్మెంట్లను మొదలుపెట్టారు. 2019 ఏప్రిల్ కల్లా వీటి పనులు 67 శాతం పూర్తయ్యాయి. అనుకున్న ప్రకారం పనులు జరిగినట్లయితే గతేడాది నవంబరు 12వ తేదీకల్లా సిద్ధమై ఉండేవి!
అది అమరావతా... లేక భ్రమరావతా?
కనువిందైన గ్రాఫిక్స్ తప్ప కట్టడాలేవీ లేనే లేవా?
అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదా?
వైసీపీ నేతలు ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక పదేపదే చెబుతున్నట్లుగా అమరావతిలో నిజంగానే ఏమీ లేదా?
ఈ ప్రశ్నలకు వాళ్లూ వీళ్లు చెప్పే సమాధానాలు నమ్మవద్దు! నేరుగా... రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ వెబ్సైట్ crda.gov.ap.in ఓపెన్ చేయండి. వెంటనే... ముఖ్యమంత్రి జగన్ ఒకవైపు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోవైపు కనిపిస్తారు. ఆ తర్వాత కూడా మరేమీ కష్టపడక్కర్లేదు! అమరావతిలో జరిగిన పనుల తాలూకు ఫొటోలు ఒకదాని తర్వాత ఒకటి తెరమీద కనిపిస్తాయి! అమరావతిని శ్మశానంతో, ఎడారితో పోల్చిన మంత్రి బొత్స సత్యనారాయణ సాక్షిగా అక్కడ జరిగిన పనుల పురోగతి దర్శనమిస్తుంది. ఏపీసీఆర్డీయేలోని వెబ్‌సైట్‌లోని ఫొటోలే సాక్ష్యంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సచిత్ర కథనమిది...
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మాయా లేదు... మంత్రం లేదు! గ్రాఫిక్స్ కానే కాదు... కనికట్టు అసలే కాదు! ఆంధ్రుల కలల రాజధానిగా తెరపైకి వచ్చిన అమరావతిలో జరిగిన పనుల పురోగతి స్వయంగా, ససాక్ష్యంగా జగన్ సర్కారే చాటి చెబుతోంది. అది ఎడారి, శ్మశానం, భ్రమరావతి అంటూ ఎన్నికల ముందు, ఆ తర్వాతా వైసీపీ పెద్దలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ, ‘ఏఎంఆర్డీయే’గా మారిన సీఆర్డీయే వెబ్సైట్ తెరిస్తే అసలు విషయం తెలుస్తోంది. వైసీపీ సర్కారు అధికారంలోకి రాకమునుపు... అంటే తెలుగుదేశం హయాంలో అమరావతిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతి ఈ వెబ్సైట్లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇవన్నీ... దాదాపు ఏడాదిన్నర కిందటి చిత్రాలు. అప్పటికే అఖిల భారత సర్వీసు అధికారుల గృహ సముదాయ నిర్మాణం 90 శాతానికిపైగా పూర్తయింది. గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, గ్రూప్-డీ ఉద్యోగుల నివాసాల నిలువెత్తు టవర్ల ఫొటోలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల టవర్ల ఫొటోలూ దర్శనమిస్తాయి. సీఆర్డీయే వెబ్సైట్లోనే... సుమారు 60కిపైగా భారీ టవర్ల (నివాస సముదాయాల) చిత్రాలున్నాయి. ఇక... జడ్జిల బంగ్లాలు, సీనియర్ ఐఏఎ్‌సలకు సంబంధించిన విల్లాలకు ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్‌లు కూడా పడినట్లు ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. సీఆర్డీయే ప్రాజెక్టు నిర్మాణం స్ట్రక్చర్ మొత్తం పూర్తయింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన జీఏడీ టవర్ల ‘రాఫ్ట్ ఫౌండేషన్’ పూర్తయి, నిర్మాణాలు పురోగతిలో ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి. పూర్తిస్థాయి హైకోర్టు నిర్మాణానికి కూడా ఫౌండేషన్ పూర్తయింది. ఇవే కాదు... దాదాపు పూర్తి కావచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డు, వందల కిలోమీటర్ల ఇంటర్నల్ రహదారుల ఫొటోలూ సీఆర్డీయే వెబ్సైట్లో దర్శనమిస్తాయి.
పనులు కొనసాగి ఉంటే...
వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సీఆర్డీయే వెబ్సైట్లో ఉన్న ఫొటోలన్నీ చంద్రబాబు హయాంలో జరిగిన పనులకు సంబంధించినవే. ప్రణాళిక ప్రకారం పనులు సాగి ఉంటే... వాటిలో చాలావరకు గత ఏడాదే పూర్తయ్యేవి. హౌసింగ్ టవర్లలో, విల్లాలలో గృహప్రవేశాలు జరిగి... కళకళలాడుతుండేవి. మరికొన్ని ప్రాజెక్టులు ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తి చేసుకునేవి. 90 శాతానికి పైగా పూర్తయిన ప్రాజెక్టులూ ఆపివేసి... ‘అమరావతిలో ఏముంది? ఎడారి, శ్మశానం’ అని మంత్రులు వ్యాఖ్యానించడం విశేషం. నిజానికి... గత ఏడాది మే నాటికి అమరావతిలో ఏ ప్రాజెక్టు ఎంత వరకు పూర్తయింది, అనుకున్నట్లుగా పనులు సాగితే ఎప్పటికి పూర్తవుతుందన్న పూర్తి వివరాలతో సీఆర్డీయే అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కూ సమగ్ర నివేదికను అందించారు. అయినా సరే... అక్కడేమీ లేదని, పనులేవీ జరగలేదనే ప్రచారాన్ని మాత్రం ఆపలేదు.
ఒక్కోసారి ఒక్కో సాకు
అమరావతిని మూలన పడేయడానికి ప్రభుత్వ పెద్దలు ఒక్కోసారి ఒక్కోసాకు చెబుతూ వచ్చారు. అవేవీ ఫలించకపోవడంతో... చివరికి ‘పరిపాలన వికేంద్రీకరణ’ పేరిట మూడు రాజధానుల ముచ్చట బయటపెట్టారు. అమరావతిలో నిర్మాణ వ్యయం అధికమని, పునాదులు తీసేందుకే చాలా ఖర్చవుతుందని మొదట్లో చెప్పారు. కానీ... వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వం నిర్మించాల్సిన అనేక ముఖ్య భవనాలకు పునాదులే పడటమే కాదు, శ్లాబులు, పిల్లర్లూ పైకి లేచాయి కూడా! అమరావతి ప్రాజెక్టుల్లో జీఏడీ టవర్లే అత్యంత ఎత్తైనవి. 50 అంతస్తులతో ప్రతిపాదించిన ఈ ఆకాశ హర్మ్యాల ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా టీడీపీ హయాంలోనే పూర్తయింది. అయినా సరే... నిర్మాణ వ్యయం అధికమంటూ సాకులు చెప్పారు.
విల్లాలతో కళ వచ్చేది
మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ముఖ్య కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారుల కోసం మొత్తం 186 జీ+1 బంగ్లాల నిర్మాణం చేపట్టారు. ఉన్నతాధికారుల విల్లాల పనులు ఇప్పటికి సగటున 28 శాతం జరిగాయి. పనులు కొనసాగించి ఉంటే.. ఈ ఏడాది మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తయ్యేది. మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాల పనులు 26 శాతం పూర్తయ్యాయి. గత నెల 18వ తేదీ నాటికి వీటి నిర్మాణం కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది... ఏపీసీఆర్డీయే వెబ్సైట్. ఇప్పుడు ‘ఎంఆర్డీయేగా’గా మారింది. ఇందులో... ముఖ్యమంత్రి జగన్, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఫొటోలను చూడవచ్చు.
గోడలు లేకుండా...
సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి 3.62 ఎకరాల్లో, జీ ప్లస్-7 అంతస్థులతో నిర్మించదలచిన ఏపీసీఆర్డీయే ప్రాజెక్ట్ ఆఫీసు ఇది. ఇందులో సీఆర్డీయే, ఏడీసీ, ఏపీ రెరా తదితర కీలక సంస్థల ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావించారు. 143.30 కోట్ల వ్యయంతో, పూర్తిగా అధునాతన ప్రీకాస్ట్ విధానంలో నిర్మిస్తున్న ఈ భవనం పనులు ఆగిపోయే సమయానికి 52 శాతం పూర్తయ్యాయి. ఇది గతేడాది ఆగస్టు 31వ తేదీకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైకోర్టు... పునాదులతో ఆగి!
అమరావతిలోని ప్రతిష్ఠాత్మక (ఐకానిక్) కట్టడాల్లో హైకోర్టు ఒకటి. ఈ బౌద్ధ స్థూపాకారపు ఉత్కృష్ట నిర్మాణాన్ని జీ ప్లస్-7 అంతస్థులతో నిర్మించదలిచారు. 42 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 18 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో రూపుదిద్దుకోవాల్సిన దీని అంచనా వ్యయం రూ.1322 కోట్లు. అప్పటికి 8 శాతం పనులు జరిగాయి. పనులు నిరంతరాయంగా కొనసాగిస్తే ఈ సంవత్సరం డిసెంబరు 7వ తేదీకల్లా పూర్తయ్యేది.
రహదారులు రయ్య్...
ఈ చిత్రంలో ఉన్నది... ల్యాండ్ పూలింగ్ సిస్టమ్‌లో భాగంగా రైతులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ప్లాట్లు. పక్కన ఉన్నది... సీడ్ యాక్సిస్ రోడ్డు. అమరావతి ప్రభుత్వ నగరం(ఏజీసీ)లో రూ.1556 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించదలిచారు. ఈ పనులను ఈ ఏడాది డిసెంబరు 3 కల్లా పూర్తి చేయాలని భావించారు.
మళ్లీ ఎంఆర్డీయే!
సీఆర్డీయే రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించగానే... వెబ్సైట్లో సీఆర్డీయే పేరు తీసేశారు. దానిని ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్‌పమెంట్ అథారిటీ’గా మార్చారు. అయితే... కార్యాలయ తరలింపుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో, దానిని మళ్లీ సీఆర్డీయేగా మార్చారు. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. ఇప్పుడు... సీఆర్డీయే వెబ్సైట్ తెరవగానే... ఎంఆర్డీయే కనిపిస్తోంది. మిగిలిందంతా సేమ్ టు సేమ్!
సెక్రటేరియట్.. హెచ్‌వోడీ టవర్లు..
అమరావతిలో సచివాలయం, హెచ్‌వోడీల కోసం ఐదు ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని ప్రతిపాదించారు. 1, 2 టవర్ల పనులు 13 శాతం పూర్తయ్యాయి. పనులు ఆగకుండా కొనసాగితే గత నెల 18వ తేదీకల్లా ఈ టవర్లు పూర్తయి ఉండేవి. 3, 4 టవర్లను 21.76 ఎకరాల్లో, 23.64 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో నిర్మించాలనుకున్నారు. ఈ టవర్ల పనులు 12 శాతం జరిగాయి. ఇవి గతనెల 18వ తేదీనాటికి సిద్ధం కావాల్సి ఉంది. అలాగే, అమరావతి ప్రధానాకర్షణల్లో ఒకటిగా నిలవాల్సిన జీఏడీ టవర్(5)ను 50 అంతస్తుల్లో నిర్మించాలని భావించారు. దీని పనులు 12 శాతం జరిగాయి. ఆగకుండా కొనసాగించి ఉంటే... గత నెలకే నిర్మాణం పూర్తయ్యేది.