సీఎం జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదు: గఫూర్‌

ABN , First Publish Date - 2020-11-06T16:42:12+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు , చేతలకు పొంతన లేదని..

సీఎం జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదు: గఫూర్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ.గఫూర్‌ విమర్శించారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పాదయాత్రల కల్చర్ అధికారం కోసం అన్నట్లుగా మారిందన్నారు. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏం నేర్చుకున్నారో అర్థం కాలేదన్నారు. నవరత్నాలు పేరుతో కొన్ని వాగ్ధానాలు చేశారని, అవి తప్ప ఇంకేమీ ఆలోచించడంలేదని విమర్శించారు. జగన్ పాదయాత్ర సందర్భంగా చాలా మంది ప్రజలు తమ కష్టాలు, సమస్యలను తెలుపుకున్నారని, అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారని, అధికారంలోకి రాగానే మరిచిపోయారని విమర్శించారు.


అలాగే సమాన పనికి.. సమాన వేతనం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఓల్డ్ పెన్షన్ స్కీం తెస్తామన్నారని.. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని గఫూర్ ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై కూడా ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చిన సహాయం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఆరోపించారు. వరదలు వచ్చి సర్వం కోల్పోతే ప్రభుత్వం రూ. 2వేలు సహాయం చేసిందని.. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, స్థానికుల సమస్యలేమి ప్రభుత్వానికి పట్టడంలేదని గఫూర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2020-11-06T16:42:12+05:30 IST