బిల్లులపై గవర్నర్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-07-19T13:20:34+05:30 IST

నవ్యాంధ్ర రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ వద్దకు చేరిన విషయం తెలిసిందే.

బిల్లులపై గవర్నర్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ వద్దకు చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను ఆయన ఆమోదిస్తారా..? లేదా సందేహాల నివృతి కోసం వెనక్కి పంపుతారా..? లేదా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటారా..? అనేదానిపై రాజకీయ నేతలు, రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆ బిల్లులను ఆమోదించొద్దని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఇందులో పలు కీలక విషయాలను ఆయన వివరిస్తూ.. ఆ బిల్లులను వెంటనే తిరస్కరించాలని కోరారు.


ఆ బిల్లులను తిరస్కరించండి..

రాష్ట్ర ప్రభుత్వం మీ ఆమోదానికి పంపిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తిరస్కరించండి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చింది. ఆనాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ప్రకటించగానే వైసీపీతో సహా అన్ని పార్టీలూ హర్షం వ్యక్తం చేశాయి. ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు రాజధానికై 33 వేల ఎకరాలు అవసరమని చెప్పారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. అమరావతికై కేంద్రం రూ.1550 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికీ రూ.9600 కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగులకు క్వార్టర్లు, గృహ నిర్మాణాల వంటి అభివృద్ధి ఇప్పటికే జరిగింది. రాజధాని తరలింపు వల్ల రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుంది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఈ బిల్లులు ఆమోదయోగ్యం కాదు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తిరస్కరించని పక్షంలో రాష్ట్రపతికి వద్దకు పంపండిఅని లేఖలో గవర్నర్‌కు రామకృష్ణ వివరించారు.

Updated Date - 2020-07-19T13:20:34+05:30 IST