ఏడాదిలో ప్రచారం ఎక్కువ.. పనులు తక్కువ: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-24T16:58:13+05:30 IST

ఏడాదిలో ప్రచారం ఎక్కువ.. పనులు తక్కువ: రామకృష్ణ

ఏడాదిలో ప్రచారం ఎక్కువ.. పనులు తక్కువ: రామకృష్ణ

అమరావతి: జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలనలో ప్రచారం ఎక్కువ.. చేసిన పనులు తక్కువ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అన్నారు.. ఈ ఏడాదిలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరిగాయా అని ప్రశ్నించారు. మంత్రులు చెప్పినట్లు పనులు చూపించాలని సవాల్ విసిరారు. ‘‘ఆరు నెలలు అవకాశం కావాలి  అన్నారు... యేడాది తర్వాత మీ లోపాలను మేము చెబుతున్నాం. మీ లోపాలను ఎత్తి చూపితే.. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టావు’’ అని మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చడం ద్వారా జగన్ ఆలోచన ఏమిటో అందరికీ అర్ధం అయ్యిందన్నారు. 


చంద్రబాబు ఏమైనా సొంత డబ్బుతో కట్టారా.. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే అధికారం ఎవరిచ్చారని రామకృష్ణ నిలదీశారు. మద్యం నిషేధం అన్న జగన్.. లాక్‌డౌన్ సమయంలో కూడా మద్యం షాపులు తెరిచారన్నారు. తమ కమిషన్ల కోసం ప్రజలు చనిపోయినా పరవాలేదని భావిస్తున్నారని ఆరోపించారు. తమరు చెప్పిన బ్రాండ్ లే తాగాలని.. ధరలు పెంచి కూలీల జీవితాలతో ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అదేమంటే.. ధరలు పెంపుతో మద్యం‌ మానేస్తారని సిగ్గు లేకుండా వాదిస్తున్నారని మండిపడ్డారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్.. అన్నీ మార్చేశారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి.. ఎదురుదాడి చేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని మారుస్తానని ఆరోజు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 


ఇప్పుడు మూడు రాజధానులు అని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. టీటీడీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. యేడాదికి టీటీడీ ఆదాయం మూడు వేల  కోట్లని.. మూడు నెలల్లోనే కష్టాలు వచ్చాయా అని నిలదీశారు. ఇప్పుడు కొనేందుకు పోటీ ఉండదు కాబట్టి.. తక్కువకు కొట్టేయడానికి వైసీపీ నేతల ప్లాన్ ఇది అని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని సిపిఐ తప్పుబడుతుందని రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-05-24T16:58:13+05:30 IST