‘విచారణ’కు ఉలిక్కిపడి.. కోర్టులపై విరుచుకుపడి!

ABN , First Publish Date - 2020-10-12T08:57:23+05:30 IST

కోర్టులు చట్ట-నిబంధనల మేరకు తీర్పులు ఇవ్వాలా? లేక... అధికారంలో ఉన్న వైసీపీ పెద్దల మనసుకు నచ్చినట్లు

‘విచారణ’కు ఉలిక్కిపడి.. కోర్టులపై విరుచుకుపడి!

జస్టిస్‌ రమణపై ప్రభుత్వ పెద్దల అసహనం

నేర నేతలపై విచారణ ఆదేశాలతో ఆగ్రహం

2016లో దాఖలైన పిల్‌పై ఇప్పుడు కార్యాచరణ

దేశవ్యాప్తంగా 4,500 మందిపై ప్రభావం

కానీ తననే లక్ష్యంగా చేసుకున్నారనే ఆక్రోశం

జస్టిస్‌ రమణను టార్గెట్‌ చేయడం కొత్తకాదు

విద్యార్థిగా ఉన్నప్పుడు దాఖలైన కేసు దాచారని

గతంలో సుప్రీంకోర్టుకెళ్లిన ఒక లాయరు

కేసు కొట్టివేసి జరిమానా విధించిన ధర్మాసనం

సీజే కానున్న తరుణంలో మరోమారు కుట్రలు

తీసుకునేది చట్ట వ్యతిరేక నిర్ణయాలు

కోర్టులు సమర్థించడం లేదని బురదజల్లుడు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కోర్టులు చట్ట-నిబంధనల మేరకు తీర్పులు ఇవ్వాలా? లేక... అధికారంలో ఉన్న వైసీపీ పెద్దల మనసుకు నచ్చినట్లు తీర్పులివ్వాలా! ‘అదంతా మాకు తెలియదు! మాకు నచ్చని తీర్పులిస్తే... మీపై బురదజల్లుతాం’ అని ప్రభుత్వ పెద్దలు తేల్చేస్తున్నారు. వీరి లెక్క ప్రకారం... ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకునేందుకు హైకోర్టు అనుమతించాలి. విద్యా హక్కు చట్టానికి భిన్నంగా ఉన్న ఇంగ్లీషు మీడియానికి ఓకే చెప్పాలి.


రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవ్యక్తిని రాత్రికి రాత్రి తొలగించడాన్ని స్వాగతించాలి. తాము సొంతంగా కోర్టును ఆశ్రయించి, అనేకమార్లు మీడియాలో వార్తలు రాకుండా రక్షణ పొందినప్పటికీ... తాము లక్ష్యంగా ఎంచుకున్న వారికి మాత్రం అలాంటి ఉపశమనం లభించకూడదు! తాము అనుకున్నట్లు తీర్పులు రాకపోతే... కోర్టులు, జడ్జీలను దూషిస్తారు! తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తారు! జడ్జిలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం ఒక ఎత్తైతే... విలేకరుల సమావేశం పెట్టి రచ్చ చేయడం ప్రభుత్వ పెద్దల అసహనానికి పరాకాష్ఠ గా చెప్పవచ్చు. ఇంతకీ ఈ అసహనానికి కారణమేమిటన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.


వాస్తవానికి ఆర్థిక, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులపై కేసుల్లో విచారణ వేగిరం చేయాలని, నిర్దిష్ట కాలపరిమితి లోపు వాటిని పరిష్కరించాలని ఇటీవల సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఆ మేరకు దాదాపు అన్ని హైకోర్టులు కార్యాచరణ ప్రకటించాయి. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో సుమారు 4,500 మంది నేతలపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో రాష్ట్ర సీఎం జగన్‌ కూడా ఒకరు. అయితే, కేవలం జగన్‌ను టార్గెట్‌గా చేసుకునే జస్టిస్‌ రమణ ఈ ఉత్తర్వులు ఇచ్చారని వైసీపీ పెద్దలు కుతకుతలాడుతున్నట్లు తెలుస్తోంది. ‘‘మా కేసుల్లో రోజువారీ విచారణకు ఆదేశిస్తారా! అయితే, మిమ్మల్ని రోజువారీగా హిం సిస్తాం, వేధిస్తాం’ అన్నట్లుగా జస్టిస్‌ రమణను లక్ష్యంగా చేసుకున్నారు. విచారణకు ఉలిక్కిపడి... న్యాయ వ్యవస్థపైనే విరుచుకుపడుతున్నారు. 


జస్టిస్‌ రమణకు ఏమిటి సంబంధం?

నేర నేతలపై సత్వర విచారణకు ఆదేశించింది జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనమే. కానీ... ఈ కేసు ఈనాటిది కాదు. అది నేరుగా జస్టిస్‌ రమణ బెంచ్‌ ముందుకు రాలేదు. శిక్షలు పడిన నేతలు పదవుల నుంచి తప్పుకోక తప్పదు. అలాగే, వారు ఎన్నికల్లో పోటీచేయడంపైనా అనర్హత వేటు పడుతుంది. కానీ కేసులు పెండింగ్‌లో ఉన్న వారికి ఎలాంటి సమస్యా లేదు. ఏళ్లకు ఏళ్లు ‘విచారణ’ సాగుతూ ఉంటుంది. వారి పదవులూ భద్రంగా ఉంటాయి. ఈ పద్ధతి సరికాదని, ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులు సత్వరం పరిష్కరించాలని 2016 సెప్టెంబరులోనే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై సంబంధితులకు నోటీసులు జారీ చేసింది. 2017 డిసెంబరులోనే కేంద్రం నేర నేతలపై విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది.


ఈ విషయంలో సుప్రీంకోర్టుకు సహాయకారిగా ఉండేందుకు జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియాను అమికస్‌ క్యూరీగా నియమించింది. ఆ తర్వాత దీనిపై చాలా కసరత్తు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బాబ్డే ఈ అంశాన్ని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు. నేర నేతలపై కేసుల సత్వర విచారణకు విజయ హన్సారియా సవివరమైన నివేదికను సమర్పించారు. వీటిని కేంద్రం కూడా స్వాగతించింది. కేసుల సత్వర పరిష్కారానికి పూర్తిగా సహకరిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఆ తర్వాత... ఈ కేసుల విచారణకు తగిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా అన్ని రాష్ట్రాల హైకోర్టులను జస్టిస్‌ రమణ ధర్మాసనం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల వెనుక ఇంత తతంగం ఉండగా... ఇదంతా తమ అధినేతను టార్గెట్‌ చేసుకునే జరుగుతోందని వైసీపీ పెద్దలు భావించి...  జస్టిస్‌ రమణపై బురదజల్లడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


ఇదే మొదటిసారి కాదు...

వైసీపీ పెద్దలకు జస్టిస్‌ రమణపై మొదటి నుం చీ కసి ఉంది. ఆయనపై ఆరోపణలు చేయడం, వివాదాల్లోకి లాగడం కొత్తేమీ కాదు. జస్టిస్‌ బాబ్డే పదవీ విరమణ అనంతరం సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అది జరగకుండా అడ్డుకోవడమే వైసీపీ పెద్దల లక్ష్యమని తెలుస్తోంది. జస్టిస్‌ రమణ 2000 లో ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జి అయ్యారు. 2013లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2013లోనే ఢిల్లీ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. అంతకుముందే మనోహర్‌రెడ్డి అనే అడ్వకేట్‌ ఆయనపై కేసు వేశారు. జస్టిస్‌ రమణ తనపై ఉన్న క్రిమినల్‌ కేసులను దాచిపెట్టారని ఆరోపించారు. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే... జస్టిస్‌ రమణ నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు జరిగిన విద్యార్థి ఉద్యమాలపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన అనేకమందిలో రమణ కూడా ఒకరు. ఈ కేసులో పోలీసులు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోలేదు. ఎలాంటి నోటీసులుకానీ, సమన్లు కానీ వచ్చినట్లు రికార్డుల్లేవు. దీంతో తమపై కేసు ఉన్నట్లు అందులో ఉన్నవారెవరికీ తెలియదు.


అయినప్పటికీ... జస్టిస్‌ రమణ తనపై ఉన్న క్రిమినల్‌ కేసును దాచిపెట్టారంటూ మనోహర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం... కేసును కొట్టివేయడంతోపాటు, పిటిషనర్‌కు రూ.50వేలు జరిమానా విధించింది. అప్పట్లోనే జస్టిస్‌ రమణ హైకోర్టు సీజే కాకుండా వైసీపీ పెద్దలు ప్రయత్నించారనే  వాదన ఉంది. ఇప్పుడు ఆయన అత్యున్నత న్యాయపీఠం అధిష్ఠించే ముందు కూడా ఇదే తరహా ప్రయత్నాలు మొదలుపెట్టడం గమనార్హం.


అర్థంలేని ఆరోపణలు

జస్టిస్‌ రమణ అప్పుడెప్పుడో 15ఏళ్ల కిందట హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు దమ్మాలపాటి శ్రీనివా స్‌(మాజీ అడ్వొకేట్‌ జనరల్‌) వకాల్తా పుచ్చుకున్న కేసుల్లో అనుకూల తీర్పులు చెప్పారన్నది వైసీపీ పెద్దలు చేసిన మరో ఆరోపణ. ఏయే కేసుల్లో తీర్పులు వచ్చాయో కూడా జాబితా రూపొందించారు. వీటిని లోతుగా పరిశీలిస్తే అందులోని డొల్లతనం బయటపడుతుంది. ఇక నేరనేతలపై జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గతనెల 10న విచారణ జరిపి, 16న తదుపరి ఆదేశాలు జారీ చే స్తామని ప్రకటించింది. సరిగ్గా ఒక్కరోజు ముందు.. అంటే, గతనెల 15న అమరావతిలో భూముల కుంభకోణానికి పాల్పడ్డారంటూ దమ్మాలపాటి శ్రీనివా్‌సతో పాటు జస్టిస్‌ రమణ కుమార్తెలపై ప్రభుత్వం కేసు నమోదు చేయడం గమనార్హం.



ఇక... రాజ్యాంగాన్ని, చట్టాన్ని, నిబంధనలను పట్టించుకోకుండా వైసీపీ సర్కారు తీసుకున్న పదులకొద్దీ నిర్ణయాలను హైకోర్టు కొట్టివేసింది. వాటిపై సుప్రీంకు వెళ్లినా ఊరట లభించలేదు. నిర్ణయాలు పునఃసమీక్షించి, తప్పు సరిదిద్దుకోవాల్సిన పెద్దలు... దీనిని న్యాయవ్యవస్థపై దాడికి అస్త్రంగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. రాజకీయ రంగు పులిమి రచ్చచేయసాగారు. ఈనెల 6నే ఈ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తగిన స్పందన రాకపోవడంతో... ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి వీధికెక్కారు.

Updated Date - 2020-10-12T08:57:23+05:30 IST