ఏబీవీ పిటిషన్‌ కొట్టివేత

ABN , First Publish Date - 2020-10-01T07:14:37+05:30 IST

రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అంశంలో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది...

ఏబీవీ పిటిషన్‌ కొట్టివేత

  • సుప్రీం మార్గదర్శకాలు పాటించాలి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ‘కోర్టు ధిక్కరణ’ పిటిషన్‌ దాఖలు 
  • పిటిషనర్‌కు ధర్మాసనం సూచన


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అంశంలో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే ఏదేని చర్యలు చేపట్టాల్సి వస్తే ‘అర్నేశ్‌ కుమార్‌ వర్సెస్‌ బిహార్‌ ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులు వాటిని పాటించకుంటే సుప్రీం పేర్కొన్న మేరకు ‘కోర్టు ధిక్కరణ’ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్‌కు గుర్తు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి బుధవారం తీర్పు వెల్లడించారు. గతంలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనను అరెస్టు చేయకుండా నిలువరించాలని అభ్యర్థిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రక్షణ పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న వంకతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో పిటిషనర్‌ను సస్పెండ్‌ చేసిందని తెలిపారు. అయితే హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేసిందన్నారు. అదే వ్యవహారంలో తప్పుడు కేసు బనాయించి, అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ కేవలం ఆందోళనతోనే కోర్టుకు వచ్చారని, ఈ కేసులో ఇంకా నేర విచారణ ప్రక్రియే ప్రారంభం కాలేదన్నారు. ఒకవేళ నేర విచారణ ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తే నిబంధనల మేరకే వ్యవహరిస్తామని తెలిపారు. ఇరు వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సెప్టెంబరు 8న తీర్పును రిజర్వు చేశారు. ఆ తీర్పును బుధవారం వెల్లడించారు. 


అర్నేశ్‌ కుమార్‌ కేసులో ‘సుప్రీం’ చెప్పిందిదీ... 

నిందితుల అరెస్టుకు సంబంధించి అర్నేశ్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఏడేళ్ల లోపు గానీ, ఏడేళ్ల వరకు గానీ శిక్ష పడే నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల్ని పోలీసులు అనవసరంగా అరెస్టు చేయరాదని సుప్రీం తేల్చి చెప్పింది. అరెస్టును మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా ఆమోదించరాదని పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసు జారీ చేయాలని, సదరు వ్యక్తులు విచారణకు హాజరైనప్పుడు వారిని అరెస్టు చేయక తప్పదని విచారణాధికారి భావిస్తే అందుకు గల కారణాలను కచ్చితంగా నమోదు చేయాలని పేర్కొంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సదరు పోలీసు అధికారి శాఖాపరమైన చర్యలతో పాటు, కోర్టు ధిక్కరణ చర్యలకు బాధ్యత వహించాల్సిందేనని 2014 జూలైలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 


Updated Date - 2020-10-01T07:14:37+05:30 IST