కోర్టులపై దూషణల కేసు సీబీఐకి

ABN , First Publish Date - 2020-10-13T07:59:04+05:30 IST

కోర్టులను దూషిస్తూ... జడ్జిలకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడంపై హైకోర్టు ..

కోర్టులపై దూషణల కేసు సీబీఐకి

కుట్ర ఉందో లేదో తేల్చండి.. కుట్ర జరిగితే ఎవ్వరినీ వదలొద్దు

స్థాయితో సంబంధం లేకుండా చర్యలు

అవసరాన్ని బట్టి మరిన్ని కేసులు

8 వారాల్లోపు నివేదిక అందించండి

సీబీఐకి హైకోర్టు ధర్మాసనం ఆదేశం

న్యాయ వ్యవస్థపై ఏ మూలనుంచో దాడి!

ఉన్నతస్థాయి వ్యక్తులే యుద్ధం చేస్తున్నారు

స్వీయ నియంత్రణ పాటించకుండా వ్యాఖ్యలు

ఏప్రిల్‌ నుంచే ఈ వైఖరి మొదలు: హైకోర్టు

తీర్పులో స్పీకర్‌, సాయిరెడ్డిల ప్రస్తావన


ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులే న్యాయ వ్యవస్థపై యుద్ధం చేస్తున్నారు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నందునే వారి అస్తిత్వం కూడా ఉందన్న వాస్తవాన్ని కూడా విస్మరించారు.


ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులే న్యాయవ్యవస్థపై యుద్ధం మొదలుపెడితే సాధారణ పౌరుడి మదిలో అనవసరమైన సందేహాన్ని రేకెత్తిస్తుంది, తద్వారా మొత్తం వ్యవస్థను ఇది నిర్వీర్యం చేస్తుంది.


న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉన్నవారు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినా, అవమానించినా కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవచ్చు. కానీ... న్యాయవ్యవస్థపైనా, న్యాయమూర్తుల పైనా ఆరోపణలు చేసి, అపవాదులు వేసే వారిని శిక్షించేందుకు కోర్టు ధిక్కార చట్టం సరిపోదు.

- హైకోర్టు ధర్మాసనం


అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కోర్టులను దూషిస్తూ... జడ్జిలకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని సీబీఐని ఆదేశించింది. ఒకవేళ కుట్ర ఉంటే స్థాయి, హోదాతో సంబంధం లేకుండా దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించి సీఐడీ సైబర్‌ క్రైం నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ డైరెక్టర్‌కు అప్పగించాలని ఆదేశించింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించి తక్షణం చర్యలు చేపట్టాలని సీబీఐకి సూచించింది. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యల వివరాలను సీబీఐ అడిగినప్పుడు అందించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వివరాలను పరిశీలించి... తీవ్ర నేరాలకు పాల్పడినట్లు తేలితే సీబీఐ మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, వాటిపై దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించే బాధ్యతా భారాన్ని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ మోస్తున్నారు.


అయితే... కొందరు తప్పుడు వ్యక్తుల పరోక్ష, ప్రత్యక్ష దాడి కారణంగా ఆయన ఆవేదనతో కోర్టును ఆశ్రయించారు. ఉన్నత స్థాయి, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండి కూడా కొందరు ఆ తప్పు చేయకుండా స్వీయ నియంత్రణ పాటించలేదు’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సామాజిక మాధ్యమాలలో, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో హైకోర్టును, హైకోర్టు న్యాయమూర్తులను దూషించే కొత్త ధోరణి రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మొదలైనట్లు గమనించామని తెలిపింది. ‘‘ఏదైనా కేసుకు సంబంధించి న్యాయమూర్తులు విమర్శలు ఎదుర్కొన్నా, అవమానాలకు గురైనా వారు తమ చిత్తశుద్ధి, సమగ్రత గురించి చెప్పుకునేందుకు ఎలాంటి వేదికా లేదు. ఈ విషయం అందరికీ తెలుసు’’ అని గుర్తు చేసింది.  ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు క్రమశిక్షణతో ఉంటారని, చట్టాన్ని పాటిస్తారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి వ్యవస్థపై విశ్వాసముంది. అయితే, కోర్టులను అప్రతిష్ఠపాల్జేసేందుకు ఓ మూల నుంచి దాడి జరిగినట్లు అనిపిస్తోంది’’ అని ధర్మాసనం పేర్కొంది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టులన్నింటినీ తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది.


న్యాయవ్యవస్థపై ధిక్కార వ్యాఖ్యలు చేసిన వారిని నిరోధించాలని కూడా తెలిపింది. ఈ ఉత్తర్వులను తక్షణం ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌కు తెలియజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న 8 వారాల్లోగా సీల్డ్‌ కవర్‌లో నివేదికను అందజేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ కోరితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే డిసెంబరు 14వ తేదీకి వాయిదా వేసింది. వివిధ అంశాలపై ఆదేశాలు జారీ చేసిన అనంతరం కోర్టులు, జడ్జీలపై సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఐడీ సైబర్‌క్రైంకు రెండుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, దర్యాప్తులో పురోగతి లేనందున, కేసును స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) మే 26వ తేదీన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తదితరులు చేసిన వ్యాఖ్యలను సైతం జత చేస్తూ ఇటీవల మరో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెల్లడించింది. 


అందుకే సీబీఐకి...:

రిజిస్ట్రార్‌ జనరల్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా సీఐడీ కొంతమందిపై మాత్రమే కేసు నమోదు చేసిందని, బడా నేతలపై చర్యలు తీసుకోలేదని హైకోర్టు తరఫు న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది. ఈ  వ్యవహారంపై పలు శాఖలున్న వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించేందుకు ఇరు వర్గాలు అంగీకరించినందున, ప్రాథమికంగా కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా సీబీఐకి కేసును అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అదే విధంగా న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర దాగివుందంటూ టీడీపీ నేత శివానందరెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా ప్రస్తావిస్తూ.. ఆ సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థకు ఇచ్చేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - 2020-10-13T07:59:04+05:30 IST