మండలి రద్దు ఉత్తదే!

ABN , First Publish Date - 2020-11-21T08:37:33+05:30 IST

రాష్ట్ర శాసనమండలి రద్దు అటకెక్కినట్లే కనిపిస్తోంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన బిల్లును శాసనమండలిలో ..

మండలి రద్దు ఉత్తదే!

వెనక్కి తగ్గిన జగన్‌!?

రాజధాని బిల్లులకు మద్దతివ్వలేదన్న కోపంతో నాడు కౌన్సిల్‌ రద్దుకు తీర్మానం

ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీలు.. మండలి రద్దుకు పదే పదే వినతులు

అదంత తేలిక కాదని అటకెక్కించేశారు!.. ఇప్పుడు కొందరికి ‘ఎమ్మెల్సీ’ హామీలు


రాజధాని తరలింపుపై తన మాట చెల్లుబాటు కాలేదన్న ఆగ్రహంతో శాసనమండలిని రద్దు చేస్తూ నాడు అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రవిశంకర్‌ ప్రసాద్‌లను కలిసి.. పార్లమెంటులో దీనిని ఆమోదించాలని పదే పదే అభ్యర్థించారు. కానీ అదంత తేలిక కాదని గ్రహించి సీఎం జగన్‌  ఇప్పుడా ఊసే ఎత్తడం మానుకున్నారు. ఇప్పుడు రాజకీయావసరాల కోసం పార్టీకి చెందిన కొందరు నేతలకు ఎమ్మెల్సీలను చేస్తామని హామీలిస్తున్నారు.(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనమండలి రద్దు అటకెక్కినట్లే కనిపిస్తోంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన బిల్లును శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారన్న కోపంతో.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆగమేఘాలపై దానిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం ఆమోదింపజేశారు. అయుతే పార్లమెంటు ఆమోదిస్తే తప్ప ఇది జరిగే పని కాదు. అందుకే ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు మండలి రద్దు కోసం వినతిపత్రాలు సమర్పిస్తూ వచ్చారు. కానీ ఢిల్లీలో ఆ దిశగా అడుగులు పడలేదు.


కొన్ని రాష్ట్రాలు శాసనమండలి కావాలని.. మరికొన్ని రద్దు చేస్తూ పంపిన తీర్మానాలు కేంద్రం వద్ద ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ మండలిని రద్దు చేస్తూ పార్లమెంటులో మోదీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించకపోవడంతో.. ఇదంత తేలికగా అయ్యేది కాదని..జగన్‌ వెనక్కితగ్గినట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నేతలెవరూ ఇటీవల రద్దు ఊసే ఎత్తడంలేదు సరికదా.. జగన్‌ పార్టీపరంగా కొందరు నేతలకు మండలిలో సర్దుబాటు చేస్తానని హామీ ఇస్తుండడం గమనార్హం. తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు కల్యాణ్‌కు తాజాగా హామీ ఇచ్చారు. 


నాడు మొండికేశారు..

ప్రభుత్వ స్కూళ్లలో ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన తెచ్చే బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ (3 రాజధానులు) బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను జగన్‌ ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో శాసనసభలో ప్రవేశపెట్టింది. సభలో వైసీపీకి 151 మంది సభ్యుల బలం ఉండడంతో తేలిగ్గా ఆమోదముద్ర వేయించుకుంది. కానీ తీరా శాసనమండలిలో అధికార పక్షానికి సంఖ్యా బలం లేకపోవడంతో ఆమోదం పొందలేకపోయాయి. ముఖ్యంగా రాజధాని, సీఆర్‌డీఏ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి పెద్ద సంఖ్యలో మంత్రులు మోహరించినా.. టీడీపీకి మెజారిటీ ఉండడంతో దాని సూచన మేరకు మండలి చైర్మన్‌ షరీఫ్‌.. వాటిని సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. దీంతో జగన్‌ మండిపడ్డారు.


ఈ ఏడాది జనవరి 28న శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలివల్ల రూరూరూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు. నిజానికి 2021 మార్చికల్లా టీడీపీ సభ్యుల్లో చాలామంది పదవీవిరమణ చేస్తారని.. అవ న్నీ వైసీపీ ఖాతాలోనే పడతాయని.. ఆ తర్వాత మండలిలో మనకే తిరుగులేని మెజారిటీ ఉంటుందని కొందరు సన్నిహిత మం త్రులు చెప్పినా సీఎం వినలేదు. మొండిగా ముందుకెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం అదే మండలికి పంపుతామంటూ కొందరికి హామీ లు ఇస్తుండడంతో..కౌన్సిల్‌ రద్దు ఆలోచన లేనట్లేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


అసమ్మతి భయం?

ఎన్నికలకు ముందు జగన్‌ చేపట్టిన పాదయాత్రలో టికెట్లు రాని నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని అట్టహాసంగా ప్రకటించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు ఈ దిశగా ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ నెరవేరలేదు. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకరమణారావు రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. మంత్రి పదవులకు, మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కౌన్సిల్‌లో రెండు ఖాళీలు ఏర్పడినా రాజశేఖర్‌కు ఇవ్వలేదు.


తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుకు, కడప జిల్లాకు చెందిన జకియా ఖానమ్‌లకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. అదేవిధంగా.. టీడీపీ నుంచి వచ్చి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కూ మళ్లీ అదే పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి మహమ్మద్‌ ఇక్బాల్‌నూ కౌన్సిల్‌కు పంపారు. ఇటీవల మరికొందరికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నామినేటెడ్‌ పదవుల విషయంలో పార్టీ నేతల్లో  అసంతృప్తి చెలరేగుతోంది. ఈ తరుణంలో మండలిని రద్దు చేస్తే.. అసమ్మతి పెరగవచ్చన్న భయం జగన్‌లో కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పైగా ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌన్సిల్‌ రద్దుకు కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. దానిని కొనసాగించడమే ఉత్తమమన్న ఆలోచనలో సీఎం ఉన్నారని అంటున్నారు.

Read more