-
-
Home » Andhra Pradesh » cotton farmers
-
పత్తి రైతుపై ‘కొత్త’ కత్తి
ABN , First Publish Date - 2020-11-21T08:52:28+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం రైతులపై కనిపించడం మొదలైంది. ‘ఒక దేశం-ఒకే మార్కెట్’ లక్ష్యంతో కేంద్రం తెచ్చిన మార్కెటింగ్ చట్టంతో రైతులు పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే

వ్యవసాయ చట్టాలను అడ్డుపెట్టుకుని కొనుగోళ్లపై సీసీఐ పితలాటకం
మార్కెట్ యార్డుల్లో కొనదట
మిల్లులకు పత్తి తరలింపుకయ్యే రవాణా ఖర్చులూ పెట్టుకోదట
కొత్త చట్టంతో రాష్ట్ర సెస్‌కు గండి
చార్జీలపై చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ
అంతిమంగా రైతుపైనే భారం
(కంచికచర్ల/అమరావతి-ఆంధ్రజ్యోతి):
నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం రైతులపై కనిపించడం మొదలైంది. ‘ఒక దేశం-ఒకే మార్కెట్’ లక్ష్యంతో కేంద్రం తెచ్చిన మార్కెటింగ్ చట్టంతో రైతులు పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కలిగినా, దానితోపాటు సమస్యలూ తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఆ దెబ్బ ఇప్పటికే పత్తి రైతులపై పడింది. యార్డుకు తీసుకెళితే రైతుల నుంచి పత్తిని సీసీఐ ఇప్పటిదాకా కొనుగోలు చేసేది. యార్డులో చేసిన కొనుగోళ్లకుగాను 1శాతం సెస్ మార్కెట్ కమిటీకి చెల్లించి, కొన్న పత్తిని సొంత రవాణా ఖర్చులతో జిన్నింగ్ మిల్లుకు సీసీఐ తరలించేది. కొత్త కేంద్ర విధానమూ, దానితోపాటు కొవిడ్ జాగ్రత్తలూ కలగలసి మొత్తం ప్రక్రియ యార్డు నుంచి జిన్నింగ్ మిల్లులకు మారింది. ఇప్పటిదాకా అన్ని ఖర్చులు భరిస్తున్న సీసీఐ దాన్ని పూర్తిగా వదిలించుకోగా, ఆ భారమంతా రైతుల నెత్తిన పడింది. జిన్మింగ్ మిల్లు వద్దకు తెస్తేనే కొంటామని రైతులకు తేల్చిచెప్పడం వల్ల..మార్కెట్ కమిటీలకు సీసీఐ కట్టాల్సిన సెస్ తప్పిపోతోంది. అంతిమంగా భారమంతా రైతులే మోయాల్సిన పరిస్థితి!
పత్తి రవాణాచార్జీల విషయంలో భారత కాటన్ కార్పొరేషన్ (సీసీఐ)కు, మార్కెటింగ్ శాఖకు మధ్య అంగీకారం కుదరకపోవటం వల్ల నెల రోజులుగా చాలా కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు సాగడం లేదు. రవాణా చార్జీలు భరించేందుకు సీసీఐ నిరాకరిస్తోంది. పత్తి కొనుగోళ్లకు సదుపాయాలు కల్పించే మార్కెటింగ్‌శాఖ కూడా ఇందుకు ముందుకు రావడం లేదు. కొత్త చట్టం కారణంగా అసలే మార్కెటింగ్‌శాఖ ఆదాయానికి గండి పడింది. కారణం ఏమిటంటే, కొత్త చట్టం ప్రకారం వ్యవసాయోత్పత్తులపై ఒకశాతం మార్కెటింగ్ సెస్‌ను యార్డు ప్రాంగణంలో జరిగే కొనుగోళ్లపై చెల్లించాల్సి ఉంటుంది. యార్డు బయట జరిపే క్రయవిక్రయాలకు సెస్ రద్దు చేశారు. సెస్ రాని కారణంగా మార్కెటింగ్‌శాఖ చెక్‌పోస్టులను ఎత్తేసింది. దీనివల్ల ఆదాయం కోల్పోయింది.
సగం చేతికొస్తే గొప్ప..
6.01లక్షల హెక్టార్లలో ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి సాగైంది. ఈ విస్తీర్ణాన్ని బట్టి 11.51లక్షల మెట్రిక్ టన్నుల పత్తి చేతికి వస్తుందని అంచనా వేశారు. అధిక వర్షాలతో ఈ అంచనాలు తలకిందులయ్యాయి. ఎకరానికి 16 క్వింటాళ్లదాకా రావాల్సిన పత్తి దిగుబడులు 40ు మేర తగొచ్చునని చెబుతున్నారు. ఎకరానికి 765 కిలోల పత్తి వస్తుందనేది సాధారణ అంచనా. ఈసారి అందులో సగం వస్తే గొప్ప అని రైతులు అంటున్నారు. పైగా, వానలకు నానడంతో తొలి విడత పత్తి నాణ్యత కోల్పోయింది.
ఎకరానికి రెండు నుంచి ఐదుక్వింటాళ్ల వరకు పాడైపోయింది. రెండో తీతలో వస్తున్న పత్తి కూడా నిమ్ముశాతం ఎక్కువై, నాణ్యత లేదని ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలు తగ్గించారు. ఈ ఏడాది క్వింటా పత్తికి తక్కువ పింజకు రూ.5,515, పొడవు పింజకు రూ.5,825గా ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినా,, బయట వ్యాపారులు రూ.3,800 మించి కొనడం లేదు. దీంతో పత్తి కొనుగోలుకు ప్రస్తుత సీజన్‌లో 43 సీసీఐ కేంద్రాలకు మార్కెటింగ్‌శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ చాలా చోట్ల కొనుగోళ్లు జరగడం లేదు.
ఎటుచూసినా తిప్పలు రైతులకే..
యార్డులో కొనుగోళ్లకు 1ుసెస్ కట్టడానికి అనుమతి లేదని, అలాగని బయట జిన్నింగ్ మిల్లుల్లో కొన్నా రవాణా చార్జీలు భరించబోమని బయ్యర్లు తెగేసి చెబుతున్నారు. మరోవైపు, నిర్దేశించిన జిన్నింగ్ మిల్లుల వద్దకు పత్తి తీసుకువస్తేనే కొనుగోలు చేస్తామని సీసీఐ చెపుతున్నది. అన్ని ఏఎంసీల పరిఽధిలో జిన్నింగు మిల్లులు లేవు. యార్డుకు తరలిస్తే అయ్యే రవాణా చార్జీల కంటే.. మిల్లులకు తీసుకెళ్లాలంటే ఖర్చు రెట్టింపు అవుతోందని రైతులు అంటున్నారు. గతంలో యార్డుకు తీసుకెళ్లే రైతుకు రవాణాఖర్చు తక్కువలో పోయేది. ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు అనడంతో తరలించడానికే తడిచి మోపెడవుతోంది.
ఇలాగైతే అప్పులపాలే..
అసలే ఈ ఏడాది వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గుతున్న పరిస్థితుల్లో రవాణా చార్జీలుకూడా రైతులు భరించాల్సి వస్తే... పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ పెట్టుబడులు తిరిగి చేతికి రావడం దేవుడెరుగు..బాగా అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా చార్జీల సమస్యను పరిష్కరించి, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రవాణా ఖర్చుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో స్పష్టతనిస్తూ జీవో తీసుకురానున్నట్టు సమాచారం.