అవినీతిమయంగా.. ఇళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-28T09:18:16+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఓ అవినీతి భాగోతం.

అవినీతిమయంగా.. ఇళ్ల పంపిణీ

ప్రోత్సహించిన అధికారులే ఇంటికి పోతారు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శ


కోటబొమ్మాళి, డిసెంబరు 27: ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఓ అవినీతి భాగోతం. పట్టాల పంపిణీలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగింది’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ.. ఒక పెద్ద దగా కార్యక్రమమని పేర్కొన్నారు. ‘‘ఈ ఇళ్ల పట్టాల కోసం వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎకరా రూ.10 లక్షలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు వరకు విక్రయించారు. ఈ క్రమంలో రూ.6.500 కోట్లు అవినీతి చేశారు. సేకరించిన భూములను చదును చేయటానికి మట్టికప్పి ఉపాధిహామీ నిధుల నుంచి అదనంగా మరో రూ.2 వేల కోట్లు దోచేశారు. ఒక్కో పట్టా కోసం లబ్ధిదారుల నుంచి సుమారుగా రూ.60 వేల వరకు వసూలు చేశారు. మొత్తంగా మరో రూ.600 కోట్లు మేర అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో వారు ఇంటికి వెళ్లడం ఖాయం’’ అని అచ్చెన్న అన్నారు. ప్రొటోకాల్‌ పాటించడం లేదని అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తే.. టెక్కలి సబ్‌ కలెక్టర్‌కు నోటీసులు వచ్చినా, కోర్టు నుంచి చీవాట్లు పెట్టినా మార్పు రాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విచారణ చేసి అర్హులకు పట్టాలు ఇవ్వకపోతే.. చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - 2020-12-28T09:18:16+05:30 IST