లోన్లు ఇవ్వట్లేదని.. ‘చెత్త' పని!

ABN , First Publish Date - 2020-12-25T09:12:09+05:30 IST

ఇదేంటీ... ఎక్కడో డంపింగ్‌ యార్డులో ఉండాల్సిన చెత్త బ్యాంకుల ముందు కుప్పలుగా పోగుపడింది అనుకుంటున్నారా? బ్యాంకర్ల మీద కోపంతో వినియోగదారులో, ఆకతాయిలో

లోన్లు ఇవ్వట్లేదని.. ‘చెత్త' పని!

బ్యాంకుల ముందు ‘డంపింగ్‌’ 

పురపాలక సంఘాల అధికారుల అతి 

విజయవాడ, ఉయ్యూరుల్లో నిర్వాకం 


విజయవాడ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఇదేంటీ... ఎక్కడో డంపింగ్‌ యార్డులో ఉండాల్సిన చెత్త బ్యాంకుల ముందు కుప్పలుగా పోగుపడింది అనుకుంటున్నారా? బ్యాంకర్ల మీద కోపంతో వినియోగదారులో, ఆకతాయిలో చేసిన పని అనుకుంటే పొరపాటే. నగరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన పురపాకల సంఘాల అధికారులే స్వయంగా ఈ ‘చెత్త’ పనికి పాల్పడ్డారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ కార్యాలయాల ముందు ఎక్కడెక్కడి చెత్తను తెచ్చి డంప్‌ చేశారు. వివిధ ప్రాంతాల్లో ఎత్తిన చెత్త డంపింగ్‌ వాహనాలను పంపి బ్యాంకు గేట్ల ముందు పోయించారు.


కృష్ణాజిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు ఈ విధంగా చెత్త వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలివ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడంలేదు. దీనికి నిరసనగా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు కమిషనర్‌ ఒక అడుగు ముందుకేసి పీఎం స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత పథకాలను రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈ విధంగా చెత్తను వేసినట్టుగా బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా తన పేరుతో బోర్డులు పెట్టించారు. 


బ్యాంకుల ముందు చెత్త పోస్తారా?: ఎమ్మెల్సీ మాధవ్‌ 

రాష్ట్రాన్ని జగన్‌ ప్రభుత్వం అప్పుల మయం చేయడంతోనే బ్యాంకర్లు లోన్లు ఇచ్చేందుకు భయపడుతున్నారని ఎమ్మెల్సీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి మాధవ్‌ అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో బ్యాంకర్ల సహకారం అవసరమైతే నోడల్‌ అధికారులతో ప్రభుత్వ పెద్దలు సమావేశమై చర్చించాలని అభిప్రాయపడ్డారు. అలాకాకుండా జగన్‌ పేరుతో పెట్టిన పథకాలకు అప్పులివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త పోయడం సరికాదన్నారు. బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వలేదో ఆలోచించకుండా ప్రభుత్వమే కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ఏమిటన్నారు. ఇటువంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం పాలవుతోందని మాధవ్‌ వ్యాఖ్యానించారు. 


సమాచారం రాగానే తొలగించాం 

నాలుగు బ్యాంకుల ముందు మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు చెత్తను డంపింగ్‌ చేశారని తెలియగానే వెంటనే స్పందించి, దాన్ని తొలగించాం. అక్కడ బ్లీచింగ్‌ చల్లించడంతో పాటు శానిటైజ్‌ చేశాం.

ఎన్‌.ప్రకాశరావు, నగర పంచాయతీ కమిషనర్‌, ఉయ్యూరు


పునరావృతం కానివ్వం

బ్యాంకుల ముందు పారిశుద్ధ్య కార్మికులు చెత్తను డంపింగ్‌ చేసిన ఘటనలు చెదురుమదురుగా జరిగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం. వైఎస్సార్‌ బీమా, జగనన్న తోడు, పీఎం స్వానిధి, వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాలు అధికారులు, బ్యాంకర్ల సహకారంతో అమలవుతున్నాయి. ఈ విషయంలో బ్యాంకర్ల సేవలు అభినందనీయం. వారికి కృతజ్ఞతలు. 

ఇంతియాజ్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌


ఇదో చెత్త ఆలోచన: బ్యాంకర్లు

సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వనందుకు నిరసనగా బ్యాంకుల ముందు చెత్త వేసి నిరసన తెలపాలన్నది ఒక చెత్త ఆలోచన. ఇది బ్యాంకర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే. అన్ని ప్రభుత్వ పథకాలకు రుణ షెడ్యూల్‌ అమలు చేస్తున్నాం. సంక్షేమ పథకాల్లో ఒక్క రూపాయి పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లదే. కొన్ని బ్యాంకులు చేస్తున్న జాప్యాన్ని మిగిలిన బ్యాంకులకు ఆపాదిస్తూ వేధించడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 

Updated Date - 2020-12-25T09:12:09+05:30 IST