విపత్కర సమయంలోనూ జగన్‌కు అదే కసి!

ABN , First Publish Date - 2020-03-23T10:17:54+05:30 IST

ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది. అన్ని దేశాలు, భారత్‌లోని అత్యధిక రాష్ట్రాల సీఎంలు దీనిపై అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొలుత కరోనాను

విపత్కర సమయంలోనూ జగన్‌కు అదే కసి!

కరోనాపై మీడియాతో భేటీ అయిందే ఒక్కసారి

దానికీ కొందరు విలేకరులకే ఆహ్వానం

అనుకూల మీడియాకే పిలుపు

ప్రభుత్వ చర్యలు, జాగ్రత్తలు ప్రజలకు చేరాలన్న ఆలోచనే లేదు!


అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది. అన్ని దేశాలు, భారత్‌లోని అత్యధిక రాష్ట్రాల సీఎంలు దీనిపై అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొలుత కరోనాను పట్టించుకోనవసరం లేదని మాట్లాడినా.. ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గమనించి దృక్పథం మార్చుకొని అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఎప్పుడూ విలేకరుల సమావేశమే పెట్టని ఆయన.. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికి మూడుసార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించారు. తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ ఒకే ఒక్కసారి (ఈనెల 15న) విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో కూడా వివక్షే. కేవలం కొన్ని మీడియా సంస్థలనే ఆహ్వానించారు. సాధారణంగా ఇలాంటి విపత్కర సమయంలో మీడియాతో భేటీ అయినప్పుడు.. తీసుకున్న జాగ్రత్తలు, ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యలు, ప్రజలకు చేసే సూచనలు కీలకంగా ఉంటాయి. వాటిని ప్రజలకు చేరవేయాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొద్దిమంది మీడియా ప్రతినిధులనే ఆహ్వానించారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌తో పాటు పలు ఇతర మీడియా సంస్థల ప్రతినిధులను పిలువలేదు. కొన్ని మీడియా సంస్థల వారు వెళ్లినా బయటే ఉండిపోయారని సమాచారం. బహుశా అందరినీ అనుమతిస్తే ఇబ్బందికర ప్రశ్నలు వేస్తారనుకున్నారేమో! ఆ పెట్టిన విలేకరుల భేటీలోనూ.. స్థానిక ఎన్నికలను వాయిదావేసిన ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు కులం ఆపాదించి, స్థాయి దిగి మాట్లాడారు. వాస్తవానికి ఆ ఎన్నికలు వాయిదా పడకుండా ఉండి ఉంటే పరిస్థితి ఏంటన్నది అందరికీ అర్థమవుతోంది. కరోనా వైర్‌సను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో దాని తీవ్రత రాదన్నారు. పారసిటమల్‌ వేసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఓపక్క సాక్షాత్తూ ప్రధాని మోదీ తరచూ అధికారులతో సమీక్షలు జరుపుతూ.. మహమ్మారిని ఎలా నివారించాలో ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపిచ్చారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించారు. కృష్ణా, ప్రకాశం, విశాఖ సహా దేశంలోని 75 జిల్లాల్లో కేంద్రం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో దీనినిబట్టే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. మీడియా సంస్థల్లో తమకు అనుకూలమైన వాటికే కబురంపారు. ఆంధ్రజ్యోతి, ఏబీన్‌ సహా చాలా సంస్థల ప్రతినిధులకు పిలుపందలేదు. అందరినీ ఆహ్వానిస్తే.. ఇబ్బందిపడే ప్రశ్నలు వేస్తారని భావించినట్లు కనబడుతోంది. ‘ఎన్నికల కమిషనర్‌ మీ ఒత్తిడికి తలొగ్గి స్థానిక ఎన్నికలు వాయిదా వేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది’.. ‘స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు రావన్నారు. నిధులు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. మరి ఎన్నికలు వాయిదా పడినా ఆ నిధులు వచ్చేశాయి కదా.. దీనికేమంటారు’ వంటి ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పలేక ఇబ్బందిపడతామని భావించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఇంత విపత్కర పరిస్థితుల్లో, సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అనివార్య పరిస్థితుల్లో కూడా విలేకరుల సమావేశానికి ఎలాంటి ప్రశ్నలు అడగని, సొంత మీడియాకు సంబంధించిన వారినే ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే పిలవకపోయినా.. సామాజిక బాధ్యతగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ఆ అంశాల్ని ఇతర మార్గాల్లో సేకరించి ప్రజలకు అందించాయి.

Updated Date - 2020-03-23T10:17:54+05:30 IST