ఢిల్లీ, కోయంబేడు తర్వాత మరో ముప్పు..
ABN , First Publish Date - 2020-05-24T07:16:04+05:30 IST
రాష్ట్రంపై కరోనా ముప్పేట దాడి చేస్తోంది. తొలుత విదేశీయుల నుంచి ఆ తర్వాత ఢిల్లీ కనెక్షన్‌తో వైరస్ వ్యాప్తి కొనసాగింది. నిన్నా మొన్నటి వరకూ తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ లింకులు హడలెత్తించాయి.

- వయా కువైత్..!
- కరోనాను మోసుకొస్తున్న ప్రవాసులు
- కడపలో 12 మందికి పాజిటివ్
- నూజివీడులో 10 మందికి నిర్ధారణ?
- రాష్ట్రంలో మరో 47 కొత్త కేసులు
- మొత్తం 2561కి చేరిన పాజిటివ్‌లు
- వైరస్‌తో కృష్ణాలో మరొకరి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రంపై కరోనా ముప్పేట దాడి చేస్తోంది. తొలుత విదేశీయుల నుంచి ఆ తర్వాత ఢిల్లీ కనెక్షన్‌తో వైరస్ వ్యాప్తి కొనసాగింది. నిన్నా మొన్నటి వరకూ తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ లింకులు హడలెత్తించాయి. పొరుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వలస కూలీలు కరోనాను మోసుకురాగా ఇప్పుడు కువైత్ నుంచి తిరిగొస్తున్న ప్రవాసుల వంతు వచ్చింది. ఇలా రాష్ట్రానికి వచ్చిన దాదాపు 20మందికి పైగా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక్క కడప జిల్లాలోనే 12మంది వరకూ ఉన్నారు. కృష్ణాజిల్లా నూజివీడులోనూ మరో 10మందికి పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సినవారు చాలామందే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా కువైత్ నుంచి విమానం గురువారం తెల్లవారుజామున తిరుపతికి చేరుకుంది. దీనిలో వచ్చిన 149మంది ప్రవాసాంధ్రుల్లో ఇప్పటి వరకు కడప జిల్లాకు చెందిన 12మందికి కరోనా సోకినట్టు కలెక్టర్ హరికిరణ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఏడుగురితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు, చెన్నై, కర్నూలుకు చెందిన ఒక్కొక్కరు తిరుపతిలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. తక్కినవారు అధికారులు ఏర్పాటుచేసిన బస్సుల్లో సొంత జిల్లాలకు చేరుకున్నారు. తిరుపతిలో ఉన్నవారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
నూజివీడులో కలకలం
కువైత్ నుంచి రెండ్రోజుల క్రితం వచ్చిన 147మందిని నూజివీడు ట్రిపుల్‌ఐటీ క్వారంటైన్‌కు తరలించారు. వారిలో 20మందికి ట్రూనాట్ టెస్ట్ నిర్వహించగా 10మందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. మిగిలినవారి నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపారు. వారిలో కూడా 40శాతం మందికి వైరస్ సోకిందని తేలినట్టు విశ్వసనీయ సమాచారం. వీరికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది 30మంది భయాందోళనలో ఉన్నారు.
1,778మంది డిశ్చార్జి
రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 47మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,561కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 47మంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,778 డిశ్చార్జి కాగా, మరో 727మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కృష్ణాజిల్లాలో మరొకరు కరోనా చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఈ జిల్లాలో మరణాలు 16కు చేరగా, రాష్ట్రంలో 56కు పెరిగాయి. కాగా, ఉంగుటూరు మడల పెద అవుటపల్లికి చెందిన హైటెక్ కంపెనీ(హెచ్‌పీఎ్‌సఎల్) ఉద్యోగి(54) విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో వృద్ధురాలు(63) కరోనాతో మృతి చెందిందని మున్సిపల్ కమిషనర్ టి.రాజగోపాలరావు ప్రకటించారు. ఈ మరణాలను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. తాజాగా కర్నూలు జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 6, కావలి, గూడూరుల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. గుంటూరు జిల్లాలో మరో నలుగురికి కరోనా సోకింది. చిత్తూరు జిల్లా పలమనేరు, నాగలాపురం పట్టణాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నం జిల్లాలో కొద్దిరోజుల కిందట వైరస్ బారినపడిన వైద్యుడి భార్య(60)కు పాజిటివ్ వచ్చింది. అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలో తండ్రి (29), కుమారుడికి(5) పాజిటివ్ వచ్చిందని ఆర్‌ఐ రమణ తెలిపారు. అయితే ఈ రెండు కేసులను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.
ఒక్కడి నుంచి 28మందికి
తూర్పుగోదావరి జిల్లాలో శనివారం 20 కేసులు నిర్ధారణ అయ్యాయి. పెదపూడి మండలానికి చెందిన కరోనా మృతుడి ద్వారా వీరందరికీ వ్యాధి సంక్రమించినట్లు గుర్తించారు. ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేసే ఆయనకు సొంత ఫొటోస్టూడియో ఉంది. ఈనెల రెండోవారంలో రామచంద్రపురం వెళ్లి వైరస్ బారినపడ్డాడు. ఆ తర్వాత సొంతూరుకు వచ్చి హోటల్‌లో పనికి వెళ్లాడు. 18న జ్వరం రావడంతో స్థానిక వైద్యుడికి చూపించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించింది. జీజీహెచ్‌కు తరలించగా 20నిమిషాల వ్యవధిలోనే మృతిచెందాడు. వైద్యపరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయన మరణానంతరం సదరు వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్ కింద శుక్రవారం 8మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, శనివారం మరో 20 మందికి సోకినట్లు తేలింది. దీంతో రెండురోజుల వ్యవధిలో 28మందికి వైరస్ వ్యాపించినట్లయింది. పాజిటివ్ వచ్చిన వారిలో మృతుడి భార్య, కొడుకు ఉన్నారు.
ఊరిదాకా వచ్చి... ఊళ్లోకి వెళ్లలేక
విజయనగరం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన 12మంది గిరిజనులు ఉపాధి వెదుక్కుంటూ రాజమహేంద్రవరం వెళ్లారు. లాక్‌డౌన్ తో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరకు పోలీసుల సహకారంతో స్వగ్రామాలకు చేరుకున్నారు. గ్రామాల్లోకి స్థానికులు రానివ్వకపోవడం, క్వారంటైన్ కేంద్రంలో చేర్చుకోవడానికి అధికారులు నిరాకరించడంతో కొత్త మంత్రజోల గ్రామ సమీపంలోని జీడితోటలో పాకలు నిర్మించుకున్నారు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న అధికారులు శనివారం వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
- కురుపాం రూరల్
