కరోనా వారియర్‌కూ తప్పని కష్టం
ABN , First Publish Date - 2020-07-19T09:07:19+05:30 IST
‘‘ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దు.. మీకోసం మేము బయట రక్షణగా ఉంటాం’’ అని రేయింబవళ్లు ప్రజలకు కాపలాగా ఉన్న పోలీసుకు ఆపదొస్తే ఆసరా

- వైరస్ బారిన మహిళా కానిస్టేబుల్
- జిల్లా ఆస్పత్రిలో పట్టించుకోని సిబ్బంది
- అర్ధరాత్రి ఎస్పీకి ఫోన్.. మిమ్స్‌లో చికిత్స
విజయనగరం క్రైం, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘‘ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దు.. మీకోసం మేము బయట రక్షణగా ఉంటాం’’ అని రేయింబవళ్లు ప్రజలకు కాపలాగా ఉన్న పోలీసుకు ఆపదొస్తే ఆసరా కరువైంది. విధి నిర్వహణలో కరోనా సోకిన ఆమె మరణం అంచుల వరకూ వెళ్లింది. విజయనగరం టూటౌన్ పోలీస్టేషన్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ 100రోజులు నిర్విరామంగా కరోనా నియంత్రణ విధుల్లో ఉన్నారు. వైరస్ సోకడంతో హోం క్వారంటైన్‌లో ఉన్న ఆమెకు హఠాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవ్వడంతో శుక్రవారం రాత్రి 12.30గంటలకు జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లారు. తాను పోలీ్‌సనని, అత్యవసరంగా వైద్యం అందించాలని వేడుకున్నా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై ఎస్‌ఐ వాసుదేవ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే హెచ్‌సీ వేణునాయుడుని పంపి కొవిడ్ ఆస్పత్రి మిమ్స్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లాక అంబులెన్స్‌లో రానిదే లోపలికి ప్రవేశం లేదని.. గేటు వద్దే ఆపేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రాత్రి 1.30 సమయంలో ఎస్పీ రాజకుమారికి ఆమె ఫోన్ చేశారు. ఆఘమేఘాల మీద వైద్యాధికారులకు సమాచారం ఇచ్చిన ఎస్పీ... ఆమెను తక్షణం మిమ్స్‌లో చేర్పించి వైద్యం అందించాలని ఆదేశించారు. దీంతో దిగివచ్చిన సిబ్బంది ఆమెను విమ్స్‌లో చేర్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.