ఉత్పత్తికి బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-03-24T09:44:26+05:30 IST

కరోనా వైరస్‌ రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఉత్పత్తిపై తీవ్రప్రభావం చూపింది. కొవిడ్‌-19 నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ప్రధాన కంపెనీలన్నీ ఈ నెలాఖరు

ఉత్పత్తికి బ్రేక్‌!

విశాఖలో కంపెనీలన్నీ షట్‌డౌన్‌.. ఇంకా నిర్ణయించని స్టీల్‌ప్లాంట్‌

కియ కార్ల పరిశ్రమ లాక్‌డౌన్‌ ..శ్రీసిటీలో కంపెనీల మూసివేత

31 వరకూ షార్‌కు సెలవులు.. చైనా బొమ్మల తయారీ నిలిపివేత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కరోనా వైరస్‌ రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఉత్పత్తిపై తీవ్రప్రభావం చూపింది. కొవిడ్‌-19 నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ప్రధాన కంపెనీలన్నీ ఈ నెలాఖరు వరకూ మూసివేస్తున్నట్టు వెల్లడించాయి. విశాఖ నగరంలో హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ షిప్‌యార్డు, షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌, నేవల్‌ డాక్‌యార్డు, బీహెచ్‌పీవీలకు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించేశారు. వీటిలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సుమారు 40 వేల మంది ఉంటారు. విశాఖపట్నం స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లో 63 పరిశ్రమలు ఉండగా వాటిలో మందులు తయారు చేసే నాలుగు ఫార్మా కంపెనీలు తప్ప మిగిలిన 59 పరిశ్రమలను సోమవారం నుంచే షట్‌డౌన్‌ చేశామని డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. మందుల తయారీ అత్యవసర సర్వీసు అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది కంపెనీలకు వచ్చే అవకాశం లేనందున అనధికారికంగా ఉత్పత్తులు తగ్గించుకుంటున్నట్టు రాంకీ ఫార్మాసిటీలో కంపెనీలు తెలిపాయి.  


రాష్ట్రమంతా అదే పరిస్థితి

అనంతపురంలోని కియ పరిశ్రమ, శ్రీసిటీలోని కంపెనీలతోపాటు శ్రీహరికోటలోని షార్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కూడా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కియ యాజమాన్యం సోమవారం నుంచి ఈనెల 31 వరకు కార్ల ఉత్పత్తితో పాటు వాటి అనుబంధ సంస్థలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కియ లాక్‌డౌన్‌తో 13వేల మంది ఉద్యోగులకు సెలవులు ఇచ్చారు. కియలో రోజుకు 400 కార్లు ఉత్పత్తి అవుతాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అవన్నీ ఆగిపోనున్నాయి. కాగా.. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 31వరకు పరిశ్రమలను మూసివేస్తున్నట్లు శ్రీసిటీ యాజమాన్యం సోమవారం తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తమూలపేటలోని పాల్స్‌ఫ్లష్‌ చైనా బొమ్మల పరిశ్రమను ఈ నెల 31 వరకు మూసివేయాలని కొత్తపల్లి ఎస్‌ఐ పార్థసారధి యాజమాన్యానికి సోమవారం నోటీసులు జారీచేశారు. రొయ్యల ఫీడింగ్‌ కేంద్రానికి కూడా నోటీసులు ఇచ్చారు. షార్‌ను ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రం పనిచేస్తారని వెల్లడించారు. 

Read more