వైరస్‌ వ్యాప్తిని పసిగట్టే ట్రాకర్‌!

ABN , First Publish Date - 2020-06-04T08:49:41+05:30 IST

రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎలా ఉండబోతోంది?.. సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు వినియోగిస్తే ఎలా ఉంటుంది?.. నిబంధనలను గాలికొదిలేస్తే ఎలా ఉంటుంది?.. వంటి అనేక అంశాలను

వైరస్‌ వ్యాప్తిని పసిగట్టే ట్రాకర్‌!

  • విశాఖ ఐఐఎం ప్రొఫెసర్ల డాష్‌బోర్డు రెడీ
  • రాష్ట్రంలో ఆగస్టు 23 నాటికి పీక్‌ స్టేజ్‌!

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) : రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎలా ఉండబోతోంది?.. సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు వినియోగిస్తే ఎలా ఉంటుంది?.. నిబంధనలను గాలికొదిలేస్తే ఎలా ఉంటుంది?.. వంటి అనేక అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా డాష్‌బోర్డును డిజైన్‌ చేశారు విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ప్రొఫెసర్లు. ‘కొవిడ్‌-19 ట్రాకర్‌’ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ డాష్‌బోర్డులో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, జిల్లాల్లో కరోనా వైరస్‌ వాప్తి ఎలా ఉండబోతోందన్న వివరాలు (అంచనా) ఉంటాయి. డిజైన్‌ చేసిన బృందంలో ఐఐఎం ప్రొఫెసర్లు అనిర్బన్‌ ఘటక్‌, శివ శంకర్‌సింగ్‌, కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు సుబ్రజ్యోతారాయ్‌, సోహమ్‌ బెనర్జీ ఉన్నారు. దీనిని 3 వారాల్లో డిజైన్‌ చేశారు. మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈఎ్‌సఐఆర్‌ ఎపిడమాల్‌ మోడల్‌ ఆధారంగా ఈ డాష్‌బోర్డును డిజైన్‌ చేశారు. మ్యాథమెటికల్‌ మోడల్‌గా చెప్పే ఈ విధానంలో ప్రస్తుత పరిస్థితిని, రానున్న రోజుల్లో పరిస్థితిని అంచనా వేస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశముంది. రోజువారీ నమోదయ్యే కేసులు ఆధారంగానే కొవిడ్‌-19 ట్రాకర్‌ అప్‌డేట్‌ అవుతుంటుంది. విశాఖపట్నంలో మే 28 నుంచి ఆగస్టు 29 మధ్య కాలంలో కేసుల పెరుగుదల పీక్‌ స్టేజ్‌కు వెళుతుందని డాష్‌బోర్డు అంచనా వేసింది. రాష్ట్రంలో అయితే మే 27 నుంచి ఆగస్టు 23 మధ్య పీక్‌ స్థాయికి వెళుతుందని డాష్‌బోర్డు అంచనా వేసింది. ఈ తరహా డాష్‌బోర్డును ఢిల్లీకి చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ బృందం ఇప్పటికే డిజైన్‌ చేసింది. అయితే ఆ డాష్‌బోర్డుతో పోలిస్తే తాము డిజైన్‌ చేసిన డాష్‌బోర్డులో మెరుగైన సమాచారం ఉంటుందని ప్రొఫెసర్‌ అనిర్బన్‌ ఘటక్‌ తెలిపారు.

Updated Date - 2020-06-04T08:49:41+05:30 IST