12కు చేరిన కరోనా అనుమానితులు!

ABN , First Publish Date - 2020-03-08T11:38:58+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య 12కు చేరింది.

12కు చేరిన కరోనా అనుమానితులు!

శనివారం వచ్చిన 3 రిపోర్టులూ నెగెటివ్‌ 

తిరుపతి, విశాఖ, నెల్లూరు, పశ్చిమలో అనుమానితులు

స్విమ్స్‌లో ప్రారంభమైన ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు


అమరావతి, తిరుపతి (వైద్యం), విశాఖపట్నం, మార్చి 7: రాష్ట్రంలో కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య 12కు చేరింది. మొన్నటి వరకు ఉన్న 13 మంది అనుమానితుల్లో 12 మందికి నెగెటివ్‌ వచ్చింది. మిగిలిన ఒక కేసుకు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే శనివారం విశాఖ, తిరుపతిలో రెండేసి అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు నెల్లూరులో నాలుగు, గోదావరి జిల్లాల్లో రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 12 మంది అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు భీమవరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే విదేశాల నుంచి ఏపీకి వచ్చారు. తీవ్ర అనాగర్యోంతో ఉండగా, విజయవాడలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా,  తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శనివారం తొలిరోజు ఇద్దరు అనుమానితులకు నిర్వహించిన పరీక్షలు నెగెటివ్‌ వచ్చాయి. మూడు రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన కడప వాసి, నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన తిరుపతి వాసి కరోనా వైరస్‌ లక్షణాలతో శుక్రవారం రాత్రి స్వచ్ఛందంగా రుయా ఆస్పత్రికి వచ్చారు. ఆ ఇద్దరినీ పరీక్షించిన వైద్యులు, వెంటనే ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. బ్లడ్‌ శాంపిల్స్‌ తీసి స్విమ్స్‌ వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌కు పంపగా రిపోర్టు నెగెటివ్‌ వచ్చింది. కాగా, శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మరో రెండు అనుమానిత కేసులు రావడంతో వైద్యులు మరోసారి అప్రమత్తమయ్యారు. సింగపూర్‌ నుంచి వచ్చిన 45 సంవత్సరాల మహిళ, జర్మనీ నుంచి వచ్చిన 34 సంవత్సరాల వ్యక్తి.. ఇద్దరూ రుయాకు వచ్చారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. అలాగే, విశాఖ నగరానికి చెందిన వైద్య దంపతులు ఈనెల ఒకటో తేదీన సింగపూర్‌ వెళ్లి శనివారం ఉదయం  విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వైద్యుని భార్య దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టులో స్ర్కీనింగ్‌ బృందానికి తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ఇరువురినీ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం ఇద్దరి నుంచి నమానాలను సేకరించి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. విశాఖలో మొత్తం ఏడు అనుమానిత కేసులు కాగా, ఐదు కేసుల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా స్విమ్స్‌లోని వైరల్‌ రీసెర్చ్‌ డయాగ్నొస్టిక్‌ లేబరేటరీని కరోనా నిర్ధారణ పరీక్షలకు నోడల్‌ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో పుణెలోని వైరాలజీ ల్యాబ్‌నుంచి కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ శనివారమే ఇక్కడికి అందాయి.  


Updated Date - 2020-03-08T11:38:58+05:30 IST