కుయ్‌...కుయ్‌.. కుయ్యో.. మొర్రో..!

ABN , First Publish Date - 2020-08-03T09:07:18+05:30 IST

కుయ్‌...కుయ్‌.. కుయ్యో.. మొర్రో..!

కుయ్‌...కుయ్‌.. కుయ్యో.. మొర్రో..!

108 దైవాధీనం సర్వీసు.. ఆపదలో అందని సేవలు

అంబులెన్స్‌ కోసం బాధితుల ఎదురుచూపులు

గంటలు గడిచినా జాడలేని వాహనాలు

పాజిటివ్‌ నిర్ధారణ జరిగిన వెంటనే అందని వైద్యం

ఐసొలేషన్‌కు వెళ్లేలోపే ఇతరులకు సోకుతున్న వైరస్‌

ఆస్పత్రికి తరలింపులో జాప్యంతో పోతున్న ప్రాణాలు 

ఉండీ ఉపయోగం లేని 108 వాహనాలు

ప్రైవేట్‌ అంబులెన్సుల బిల్లు బాదుడు


కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన జి.శ్రీనివాసరావు తన తల్లి శ్వాస సంబంధ వ్యాధితో బాధ పడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి 108కు ఫోన్‌ చేశారు. గంటసేపు వేచి ఉన్నా అంబులెన్స్‌ రాకపోవడంతో చివరికి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాగా ఆలస్యమవడంతో ఆమె గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వైసీపీ కార్యకర్తనయిన తనకే ఇలా జరిగితే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటని శ్రీనివాసరావు పోస్ట్‌ చేసిన సెల్ఫీ వీడియో వైరల్‌ అయింది.


అనంతపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంబులెన్స్‌ వస్తుంది... సిద్ధంగా ఉండాలని సమాచారమిచ్చారు. రెండు రోజులైనా అడ్రస్‌ లేదు. బాధితులు 108కు అనేకసార్లు ఫోన్‌ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ కుటుంబ సభ్యుడు ఒకరు తమ గోడును సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఆ తర్వాత అధికారులు స్పందించి వారిని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పిలిస్తే పలుకుతాయన్నారు. అత్యవసర వైద్యసేవల కల్పనలో సువర్ణాధ్యాయం అన్నారు. ఫోన్‌ చేసిన 15నిమిషాల్లోనే 108 అంబులెన్స్‌ అందుబాటులోకి వస్తుందని గొప్పలు పలికారు. మాది ప్రతి ప్రాణానికీ విలువనిచ్చే ప్రభుత్వం అంటూ ప్రకటనలు గుప్పించారు. అయితే ఇదంతా మాటలకే పరిమితమైంది. 108ను ఆధునికీకరించామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా క్షేత్రస్థాయిలో రోగులకు చేదు అనుభవాలు లెక్కకు మిక్కిలిగా ఎదురవువుతూనే ఉన్నాయి. కరోనా ఉధృతితో అంబులెన్స్‌లకు డిమాండ్‌ ఎక్కువైంది. అయితే చాలాచోట్ల ఫోన్‌ చేసిన ఐదారు గంటలకు కూడా 108లు రావడం లేదని ఆరోపణలొస్తున్నాయి. కొన్నిచోట్ల అసలు వస్తాయో, రావో కచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొంది. కోవిడ్‌ పేషెంట్లను ఆస్పత్రులకు తరలించడానికి కొన్ని అంబులెన్స్‌లు ప్రత్యేకించామని అధికారులు చెబుతున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. 


కరోనా ఉధృతి నేపఽథ్యంలో సాధారణ జబ్బులు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. దీంతో 108 వాహనాలకు పెద్దగా పనిలేకుండా పోయింది. అయినప్పటికీ వాటి సేవలను అధికారులు వినియోగించుకోవడం లేదు. ప్రకాశం జిల్లా చీరాల, మార్కాపురం ప్రాంతాల నుంచి ఒకే వాహనంలో ఐదారుగురు బాధితులను ఒంగోలుకు తరలిస్తున్నారు. దీంతో వైరస్‌ ప్రాథమిక దశలో ఉన్న వారు పరిస్థితి సీరియ్‌సగా ఉన్నవారితో కలసి ప్రయాణించేందుకు భయపడుతున్నారు. విశాఖలో కరోనా బాధితులకు కేటాయించిన 108 అంబులెన్స్‌లు సరైన సమయానికి సేవలు అందించడం లేదు. పాజిటివ్‌ కేసుల సమాచారం ఇస్తున్న వార్డు వలంటీర్లకు పది నిమిషాల్లో వస్తామని చెబుతూ... మూడు నాలుగు గంటల తరువాత వస్తున్నారు. వలంటీర్లు ఇతర పనులన్నీ మానుకొని అంబులెన్స్‌ వచ్చేవరకు బాధితుల ఇళ్ల వద్ద రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించేవరకు స్థానిక వలంటీరు బాధ్యత తీసుకోవాలని అధికారులు గతంలోనే చెప్పారు. అయితే గురువారం నుంచి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వరకు బాధితులతోపాటు అంబులెన్స్‌లో రావాలని చెబుతున్నారు. దీనిని వలంటీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో నాలుగు 108 అంబులెన్స్‌లు ఉండాలి. కానీ అక్కడ కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. 2లక్షలకు పైగా జనాభా అవసరాలను ఇది ఒక్కటే తీరుస్తోంది. గుడివాడ ఏరియా ఆస్పత్రికి ఉన్న ఏకైక ప్రభుత్వ అంబులెన్స్‌ మూలనపడి మూడేళ్లు కావస్తున్నా దాని గురించి పట్టించుకునే వారు లేరు. గుంటూరు జిల్లాలో కనీసం సగం ఫిర్యాదులకు కూడా అంబులెన్స్‌లు పంపలేకపోతున్నారు. వాటిని అత్యవసరాలకు కాకుండా మిగిలిన వాటికి వినియోగిస్తున్నారు. దీంతో గతం కన్నా వాహనాల సంఖ్య పెరిగినా సేవలు తగ్గాయి. అనంతపురం జిల్లాలో వాహనాలు ఎక్కువగానే ఉన్నా సేవలందించడంలో విఫలమవుతున్నారు. దీంతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో 108వాహనాలు 69 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా బాధితుల తరలింపునకు 20 అంబులెన్స్‌లు వినియోగిస్తున్నారు. రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో కొందరు గంటల తరబడి... మరికొందరు రోజుల తరబడి అంబులెన్స్‌ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్త అంబులెన్స్‌లు 25 వచ్చాయి. పాత అంబులెన్స్‌లు 23 ఉన్నాయి. మరమ్మతుల నిమిత్తం 8 పక్కన పెట్టేశారు. కొవిడ్‌ సెంటర్లకు, కరోనా బాధితులను తరలించడానికి మరో 22 కేటాయించారు. ఐదు మండలాల్లో అయితే అసలు 108ల జాడే లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు అంబులెన్స్‌లపైనే ఆధారపడుతున్నారు. 


ప్రైవేట్‌ దోపిడీ

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తే వారిని ప్రభుత్వ అంబులెన్స్‌లో తరలించడం లేదు. దీంతో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు మాఫియాగా ఏర్పడి వేలకు వేలు అద్దె రూపంలో దండుకుంటున్నారు. అనంతపురం ఆస్పత్రిలో శింగనమలకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. ఆ మృతదేహం తరలించేందుకు ప్రైవేట్‌ అంబులెన్స్‌దారుడు రూ.60వేలు డిమాండ్‌ చేశాడు. చివరికి రూ.30వేలకు ఒప్పందం కుదిరింది. అనంతపురం నుంచి శింగనమలకు కేవలం 20కి.మీ. దూరమే ఉన్నా పెద్దమొత్తం దండుకున్నారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌ల దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 


స్పందించని 108.. ఆగిన రైతు గుండె

కడప జిల్లా గాలివీడు మండలం నూలివీడు పంచాయతీ శ్రీనివాసపురానికి చెందిన రైతు రాజారెడ్డి(55) ఇటీవల తనకు కొంచెం ఆయాసంగా ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పాడు. కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో వలంటీర్‌, స్థానికులు 108కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదు. సొంతంగా వాహనం పెట్టుకుని వెళ్లేంత స్థోమత లేదు. అంబులెన్స్‌ రాకపోకవడంతో రోజంతా నరకయాతన అనుభవించి చనిపోయాడు. 


అప్పుడు పాజిటివ్‌..  మేం రాం 

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఓ గర్భిణికి గతంలో పాజిటివ్‌ వచ్చింది. వైద్యసేవలతో నెగెటివ్‌ రావడంతో  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ప్రసవ సమయం సమీపించడంతో 108కు ఫోన్‌ చేశారు. గతంలో ఆమెకు పాజిటివ్‌ వచ్చినందున ఇప్పుడు రాలేమని సమాధానం వచ్చింది. 

Updated Date - 2020-08-03T09:07:18+05:30 IST