3-4 నెలల్లో కరోనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-12-05T10:04:19+05:30 IST

కరోనా నియంత్రణకు రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్రానికి రాబోతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

3-4 నెలల్లో కరోనా వ్యాక్సిన్‌

తొలి దశలో కోటి మందికి...సీఎం జగన్‌ ప్రకటన


అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్రానికి రాబోతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తొలి దశలో కోటి మందికి సరిపడా ఇస్తామని కేంద్రం తెలియజేసిందన్నారు. కొవిడ్‌-19 నియంత్రణలో నిరంతర యుద్ధం చేస్తున్న ఫ్రంట్‌ వారియర్స్‌, 50 ఏళ్లు పైబడిన వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలో కరోనా నియంత్రణ-ఆరోగ్యశ్రీ అంశంపై స్వల్పవ్యవధి చర్చ జరిగింది. వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఈ అంశంపై ప్రకటన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఏఎన్‌ఎమ్‌, ఆశావర్కర్లు, పురపాలక సిబ్బంది, పోలీసు యంత్రాంగం కష్టపడి పనిచేశారని, వారిని మనసారా అభినందిస్తున్నట్లు చెప్పారు. ‘దేవుడి దయతో కరోనా కట్టడిలో చివరిదశకొచ్చాం. ఇప్పుడే జాగ్రత్తగాఉండాలి. వ్యాక్సిన్‌ 3-4 నెలల్లో వస్తుందని కేంద్రం సమాచారమిచ్చింది. రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ఉంటే.. కోటి డోసులు వస్తాయి. తొలి దశలో ఆరోగ్య సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో  వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్‌ స్టాఫ్‌, వైద్య విద్యార్ధులు, ఆస్పత్రుల అన్ని రకాల సిబ్బంది, ఏఎన్‌ఎమ్‌, ఆశావర్కర్లు) 3.60 లక్షలు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ (శానిటేషన్‌ సిబ్బంది, పోలీసులు, కరోనా కట్టడి విధుల్లో పనిచేసే ఇతర విభాగాల వారు) 7 లక్షలు, 50 ఏళ్లుపైబడిన వారు 90 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తాం. ఆ త ర్వాత కేంద్రం ఇచ్చే దాన్ని బట్టి మిగతా వారికి అందిస్తాం. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఫ్రీజర్‌ కంటైనర్లు సిద్ధం చేస్తున్నాం. వాటిని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత్తల్లో నిల్వ చేయడానికి 4,065 ఫ్రీజర్లు రెడీచేస్తున్నాం. ఏఎన్‌ఎమ్‌లు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తాం. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి స్థాయిలో మరొకటి, జిల్లా, డివిజన్‌, మండల స్థాయుల్లోనూ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటవుతాయి’ అని చెప్పారు. కరోనా రెండో దశ ప్రారంభమైందని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ఆరోగ్యశ్రీ అమలులో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా తాను నాలుగు అడుగులు ముందుకు వేశానని జగన్‌ చెప్పారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపును గ్రీన్‌చానల్‌లోకి తీసుకొచ్చామని, 2,045 రోగాల చికిత్సను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 


శాసనసభ నిరవధిక వాయిదా

శాసనసభ నిరవధికంగా వాయుదాపడింది. నవంబరు 30 నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం మూడు స్వల్పవ్యవధి చర్చలు ప్రతిపాదించారు. కోవిడ్‌- ఆరోగ్యశ్రీపై చర్చ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటూ సభ తీర్మానించింది. అజెండాలో ప్రతిపాదించినట్లుగా నాడు-నేడుపై చర్చ జరగాల్సి ఉంది. అయితే ‘స్థానిక’ తీర్మానం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

Updated Date - 2020-12-05T10:04:19+05:30 IST