‘నెగెటివ్‌’నూ నమ్మం!

ABN , First Publish Date - 2020-07-14T07:44:38+05:30 IST

కరోనా పరీక్షల్లో అసలేం జరుగుతోంది. ఫలితాల్లో తేడాలు అధిక సంఖ్యలో వస్తున్నాయా? పాజిటివ్‌ ఉన్న వాళ్లకు కూడా నెగెటివ్‌ వస్తుందా? లేకుంటే పరీక్ష చేయకుండానే

‘నెగెటివ్‌’నూ నమ్మం!

  • చెస్ట్‌ స్కాన్‌ చేసే నిర్ధారణ.. ప్రైవేటు ఆస్పత్రుల తీరిది
  • కరోనా లక్షణాలుంటే అంతే.. చికిత్సకు ససేమిరా
  • నెగెటివ్‌ ఉండి కొవిడ్‌ ఆస్పత్రులకు వెళ్తే అక్కడా నో 


అమరావతి - ఆంధ్రజ్యోతి: కరోనా పరీక్షల్లో అసలేం జరుగుతోంది. ఫలితాల్లో తేడాలు అధిక సంఖ్యలో వస్తున్నాయా? పాజిటివ్‌ ఉన్న వాళ్లకు కూడా నెగెటివ్‌ వస్తుందా? లేకుంటే పరీక్ష చేయకుండానే రిపోర్టులు నెగెటివ్‌ ఇస్తున్నారా? రిపోర్టులు నెగెటివ్‌ వస్తే ఎంత వరకూ నమ్మాలి? కరోనా సమయంలో ప్రజలతోపాటు వైద్య వర్గాలనూ వేధిస్తున్న సమస్య ఇది! సీజనల్‌గా వచ్చే జలుబు, జ్వరం, శ్వాస సంబంధ వ్యాధులు పెరుగుతున్న సమయంలో రోగులకు ఇదో పెద్ద పరీక్షగా మారింది. ‘కరోనా’ పరీక్ష చేయించుకుంటే తప్ప చికిత్స అందించబోమని ప్రైవేటు ఆస్పత్రులు తేల్చి చెబుతున్నాయి. అయితే, ‘నెగెటివ్‌’ వచ్చిందని రిపోర్టులు చూపిస్తున్నా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను చేర్చుకోవడం లేదు. మరోసారి కరోనా పరీక్షలు చేయించుకుని రావాలని సూచిస్తున్నాయి. మరికొన్ని ఆస్పత్రుల్లో చెస్ట్‌ ఎక్స్‌రే, సీటీ చెస్ట్‌ పరీక్షలు చేయించుకోవాలని స్పష్టంగా చెబుతున్నాయి. ఆ రిపోర్టులలో ఏమాత్రం తేడా ఉన్నా, కరోనా లక్షణాలు కనిపించినా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. వెంటనే ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలని సలహాలిస్తున్నారు.


ఇలా బాధితులను తిప్పి పంపిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  ఉదాహరణకు... విజయవాడ నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా లేదని శనివారం తేలింది. అయితే... ఆదివారం మధ్యాహ్నం నుంచి కొంచెం కొంచెంగా శ్వాస సంబంధిత సమస్య మొదలైంది. ఆయనను వెంటనే విజయవాడలోని ఒక ప్రముఖ హాస్పిటల్స్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు కరోనా లక్షణాలున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ‘నెగెటివ్‌’ వచ్చినట్లు రిపోర్ట్‌ చూపినా నమ్మలేదు. సీటీ చెస్ట్‌ స్కాన్‌ చేసి... ఊపిరితిత్తుల్లో కొంత సమస్య ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. బంధువులు ఇలానే మరో రెండు హాస్పిటల్స్‌కు తీసుకువెళ్లారు. ఆ రెండు చోట్లా ఇదే అనుభవం ఎదురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు గంటలు వేచిచూసిన తర్వాత... ‘కరోనా నెగెటివ్‌ వస్తే ఇక్కడ చేర్చుకోం’ అంటూ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులూ ఆయనను తిప్పి పంపేశారు. 

Updated Date - 2020-07-14T07:44:38+05:30 IST