కరోనా.. అనుమానం
ABN , First Publish Date - 2020-03-16T09:32:44+05:30 IST
రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు ఎక్కువవుతున్నాయి. ఇంటింటి సర్వేలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న వైద్యాధికారులు జ్వరం, దగ్గుతో బాధపడుతున్న వారిని వెంటనే
- రాష్ట్రంలో కొత్తగా మరో 10 అనుమానిత కేసులు
- విశాఖలో ఇద్దరికి కరోనా నెగిటివ్
- గుంటూరులో పెరిగిన గృహనిర్బంధాలు
- ఐసోలేషన్‌లోనే నెల్లూరు వాసి... కుటుంబ సభ్యులకు విముక్తి
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు ఎక్కువవుతున్నాయి. ఇంటింటి సర్వేలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న వైద్యాధికారులు జ్వరం, దగ్గుతో బాధపడుతున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో పది అనుమానిత కేసులు నమోద య్యాయి. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన నెల్లూరు యువకుడు ఐసోలేషన్ వార్డులోనే ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులను మాత్రం ఆదివారం డిశ్చార్జి చేశారు. అలాగే ఐసోలేషన్‌లో ఉన్న మరో మహిళకు కరోనా నెగటివ్ రిపోర్ట్ రావడం, ఆమెకు క్షయ ఉన్నట్లు తేలడంతో టీబీ వార్డుకు తరలించారు. ఇదిలా ఉండగా కరోనా వ్యాధి సోకిన యువకుడికి షేవింగ్ చేసిన వ్యక్తి కూడా జ్వరంతో బాధపడుతుండడంతో వైద్యాధికారులు శనివారం రాత్రి అతన్ని బలవంతంగా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కొడవలూరు ప్రాంతంలోని ఓ పరిశ్రమ నుంచి ఒక వ్యక్తిని కరోనా అనుమానంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఇద్దరి శాంపిల్స్‌ను తిరుపతి స్విమ్స్‌కు పంపించారు. కరోనా భయంతో విదేశాల నుంచి స్వగ్రామాలకు వచ్చేస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.
వివిధ దేశాల నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన వారి సంఖ్య శనివారం వరకు 400 ఉండగా.. ఆదివారం ఒక్క రోజే ఈ సంఖ్య మరో 300 పెరిగింది. దీంతో జిల్లావ్యాప్తంగా 700 మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. వారిని 14 రోజులపాటు బయటకు రావొద్దని ఆదేశిస్తున్నారు. మరో పక్క వియత్నాం నుంచి వచ్చిన ఇద్దరు జిల్లావాసుల్లో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్నట్లు వైద్య సిబ్బంది గుర్తించడంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరోనా వైరస్ లక్షణాలతో గతవారం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో చేరిన ఇద్దరికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్ చెప్పారు. గల్ఫ్ నుంచి ఇటీవల స్వగ్రామానికి చేరిన ఇద్దరికి చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా వైద్యశాలలో ఆదివారం రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోనా అనుమానంతో ఆ ఇద్దరినీ తిరుపతి రుయా ఆస్పత్రికి సిఫారసు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో నలుగురు కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో కరోనా వైరస్ నిర్ధారణ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యశాఖాధికారి బి.సత్యసుశీల తెలిపారు. అయితే పరీక్షల నిర్వహణకు ఒక మిషన్, పలు కిట్లు అవసరం ఉన్నాయన్నారు.