క్యా..కరోనా?

ABN , First Publish Date - 2020-03-24T09:55:53+05:30 IST

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం వైద్యులు, నర్సులు రాత్రింబవళ్లు చేస్తున్న కృషిని చప్పట్లు కొట్టి దేశం అభినందిస్తోంది. సాక్షాత్తూ

క్యా..కరోనా?

మాస్కుల్లేవు.. రక్షిత పరికరాల్లేవు

వైర్‌సపై మేం ఎలా పోరాడాలి?

ప్రశ్నిస్తున్న ఐసోలేషన్‌ వైద్యులు

విశాఖలో కుట్టిన మాస్కులే గతి

చాలా ఆస్పత్రుల్లో ఒకరికి రెండే

వాటినే ఉతుక్కోవాలని సూచన

హెచ్‌ఐవీ వ్యాప్తినాటి పరికరాలే కరోనాపై యుద్ధంలోనూ వాడకం

వైద్యులకు సంకటంగా మారిన ఉన్నతాధికారుల అలసత్వం


అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం వైద్యులు, నర్సులు రాత్రింబవళ్లు చేస్తున్న కృషిని చప్పట్లు కొట్టి దేశం అభినందిస్తోంది. సాక్షాత్తూ ‘నారాయణుల’ంటూ భుజం తడుతోంది. కానీ, మన రాష్ట్రంలో మాత్రం వైద్యులు, వైద్య సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి! కనీసం తగినన్ని మాస్కులు, శానిటైజర్లు లేకుండానే వారు కరోనాతో తలపడుతున్నారు. దైవంపైనే భారం వేసి వారు ఆస్పత్రుల్లో అడుగుపెడుతున్నారు. కరోనా బాధితులను ఉంచే ఐసోలేషన్‌ వార్డుల్లో ఆరోగ్యశాఖ కనీస ప్రమాణాలు పాటించడం లేదు. చివరికి మాస్కుల కోసం కూడా వైద్యులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ‘‘మాస్కు లేకపోతే ఏమవుతుంది? మాస్కుల వల్ల ఎలాంటి రక్షణ ఉండదు’’ అంటూ ఉత్తరాంధ్రలోని ఒక ప్రధాన బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌  ఐసోలేషన్‌ వార్డులో పనిచేస్తున్న ఓ వైద్యుడికి షాక్‌ ఇచ్చారు. ‘మన దగ్గర వెయ్యి మాస్కులే ఉన్నాయి.  వాటిని ఆపరేషన్‌ థియేటర్లలో వాడతారా, లేక ఐసోలేషన్‌ వార్డులో ఉపయోగించుకుంటారా అనేది మీరు నిర్ణయించుకోండి’’ అని సెంట్రల్‌ ఆంధ్రాలోని ఒక ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ‘మీ అందరికి రెండు మాస్కులే ఇస్తాం. వాటినే ఉపయోగించుకోవాలి. అవసరమైతే వాటినే ఉతుక్కొని మళ్లీ మళ్లీ వాడుకోండి. రోజుకొకటి ఇవ్వాలంటే మా వల్ల కాదు.’’ అని కర్నూలు జిల్లాలోని సీహెచ్‌సీ సూపరింటిండెంట్‌ తన వైద్యులకు తేల్చిచెప్పారు.


బయటా కటకటే..

ఏపీఎ్‌సఎంఐడీసీ పరిధిలో ఉండే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో 1.40 లక్షల త్రీ లెయర్‌ మాస్కులు, 12 వేల పీపీటీలున్నాయిని ఉన్నతాధికారులు వారంరోజులు ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వకపోయినా ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేద్దామన్న మాస్కులు దొరకడం లేదు. వారం రోజుల క్రితం రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ షాపుల్లో 2.60 లక్షల మాస్కులు, అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు భారీగా ప్రకటనలు చేశారు. కానీ మాస్కుల కొరత అలాగే కొనసాగుతోంది. శానిటైజర్లు ఉన్నాయా అంటే.. ఆ పేరే ఎత్తొద్దు వెళ్లిపోండి అంటూ షాపుల యాజమానులు పంపించివేస్తున్నారు. వైద్యుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆరోగ్యశాఖ ఎప్పుడో కొనుగోలు చేసిన పీపీఈ (వ్యక్తిగత రక్షిత పరికరాలు)లను ఇస్తున్నారు. వీటిని గతంలో హెచ్‌ఐవీ రోగులకు చికిత్స సమయంలో, లెబర్‌ రూమ్‌లో డెలవరీలు చేసే, ఇతర సర్జరీలు చేసే సమయంలో ఉపయోగించేవారు. వాటినే ఇప్పుడు ఐసోలేషన్‌ వార్డులలో ఉపయోగిస్తున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో వైద్యులకు ఫుల్‌ ప్రొటెక్షన్‌ ఎక్యూట్‌మెంట్‌ ( శరీరం మొత్తం కవర్‌ చేస్తుంది) ఇస్తున్నారు. దీనివల్ల వైరస్‌ వల్ల వైద్యులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇటువంటివే తమకు ఇవ్వాలని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు, రోగులు, ఇతర వైద్య సిబ్బందికి సర్జకల్‌, త్రీలేయర్‌ మాస్కులను ఇస్తున్నారు. విశాఖలో మరీ ఘోరంగా క్లాత్‌తో తయారు చేసిన మాస్కులను సిబ్బందికి అందిస్తున్నారు. వీటితో లాభం లేదని.. ఎన్‌-95 మాస్కులు తెప్పించాలని వారు కోరుతున్నారు. ఏపీఎ్‌సఎంఐడీసీ అధికారులు పూర్తిస్థాయిలో మాస్కులు, పీపీఈలు అందించలేక.. స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చారు. అసలే మార్కెట్‌లో మాస్కులు దొరకడం లేదు.. ఈ సమయంలో  వచ్చిన ఆదేశాలు చూసి అవాక్కవుతున్నారు. భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తే, తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికే ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నారని పలువురు వైద్యులు మండిపడుతున్నారు.

Updated Date - 2020-03-24T09:55:53+05:30 IST