జల్సా కరోనా!

ABN , First Publish Date - 2020-07-20T07:46:15+05:30 IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. భౌతిక దూరం పాటించకపోయినా.. మాస్కులు ధరించకపోయినా పెనుప్రమాదం.

జల్సా కరోనా!

మందుబాబులకు పట్టని కరోనా జాగ్రత్తలు

ఆదివారం వస్తే చాలు కరువొచ్చినట్టు ఆరాటం

మాస్కులు లేకుండానే చుక్క కోసం బారులు

గొడుగులున్నా ఒకరి మీద ఒకరు 

మందుబాబులకు పట్టని కరోనా జాగ్రత్తలు


రాకాసి కరోనా స్వైర విహారం చేస్తోంది. నలుగురు ఒకచోట చేరితే చాలు పంజా విసురుతోంది.  మహమ్మారి దెబ్బకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. ప్రజలు భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కానీ.. మందుబాబులకు ఇవేమీ పట్టడం లేదు. మాస్కుల్లేకుండానే.. భౌతికదూరం పాటించకుండానే వైన్‌ షాపుల ముందు లైన్‌ కడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. జల్సా ‘కరోనా’ అంటూ కిక్కు కోసం ఎగబడుతున్నారు. ఇలాంటి అవకాశాల కోసమే ఎదురుచూస్తున్న వైర్‌సకు తలుపులు బార్లా తెరుస్తున్నారు!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. భౌతిక దూరం పాటించకపోయినా.. మాస్కులు ధరించకపోయినా పెనుప్రమాదం. కానీ.. మందుబాబులు మాత్రం కిక్కు కోసం కరోనాను సైతం లెక్కచేయడం లేదు. కంటైన్మెంట్‌ జోన్లలో మద్యం షాపులు మూతపడితే ఇతర ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఆదివారం అయితే పరిస్థితిని అదుపుచేయడం అధికారుల వల్ల కావడం లేదు. అనంతపురంలో కేసుల సంఖ్య 5వేలకు చేరుకున్నా.. వడియంపేట, బుక్కరాయసముద్రంలోని మద్యం దుకాణాల వద్ద ఆదివారం మందుబాబులు భౌతికదూరం పాటించకుండా ఎగబడ్డారు. ఏలూరులో ఇప్పటికే వెయ్యి కేసులు పైగానే నమోదైనా రద్దీ మాత్రం తగ్గడంలేదు.. తెల్లారితే చాలు వైన్‌ షాపుల వద్ద చాంతాడంత బారులు కనిపిస్తున్నాయి. ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్‌.. చికెన్‌ షాపుల ముందు బారులు తీరుతున్నారు. మందుబాబులు వైన్‌ షాపుల మందు లైన్‌ కడుతున్నారు. ప్రకాశం జిల్లాలోనూ మాస్క్‌, భౌతిక దూరం నిబంధనను పట్టించుకోవడం లేదు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, సత్తెనపల్లిలోని మద్యం దుకాణాల వద్ద ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదు. విశాఖ, విజయనగరంలో మద్యంషాపులు తెరవరకముందే మందుబాబులు క్యూ కడుతున్నారు.


కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో వైన్‌షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదు. కరోనా కేసులు పెరగడం వలన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికారులు నిత్యావసరాలు, పాలు, కూరగాయల దుకాణాలకు మఽధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ.. మద్యం షాపులు మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచే ఉంటున్నాయి. నిబంధనల ప్రకారం మాస్కు లేనివారికి, భౌతిక దూరం పాటించని వారికి మందు అమ్మకూడదు. కానీ.. చాలాచోట్ల ఇవేమీ పట్టించుకోవడం లేదు. కట్టడి చేయాల్సిన అధికారులు, పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొడుగు నిబంధన కొందరికి ఉపాధి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. వైన్‌షాపుల ఎదుట కొంతమంది మహిళలు, పిల్లలు ఒక్కొక్కరు ఐదారు గొడుగులు చేతబట్టుకుని ప్రత్యక్షమవుతున్నారు. లైన్‌లో వారికి గంటకు రూ.40 చొప్పున అద్దెకు ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. 

విశాఖలో..

అనంతపురంలో..

ప్రకాశం జిల్లా పర్చూరులో..


Updated Date - 2020-07-20T07:46:15+05:30 IST