వారికి కరోనా ముప్పు

ABN , First Publish Date - 2020-05-09T09:39:17+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విడుదలైన స్టైరిన్‌ విషవాయువు పీల్చడం వల్ల చాలామందికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని, అటువంటి వారికి ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్‌ సోకే ..

వారికి కరోనా ముప్పు

కట్టడికి తగిన చర్యలు చేపట్టాలి

10 కి.మీ. పరిధిలో బాఽధితులకు పరిహారం 

విశాఖ ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’తో

ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ


విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విడుదలైన స్టైరిన్‌ విషవాయువు పీల్చడం వల్ల చాలామందికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని, అటువంటి వారికి ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ఇంధన శాఖ మాజీ   కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ పేర్కొన్నారు. ఆయన విశాఖలో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... గాలి కలుషితం అయితే కరోనా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయని, పాలిమర్స్‌ పరిసరాల్లో ఐదు గ్రామాల్లోనూ వాతావరణం కలుషితం అయిందన్నారు.


అక్కడ కరోనా కట్టడికి తగిన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అదేవిధంగా బాధితులకు పరిహారం విషయంలో కచ్చితమైన లెక్కలు అవసరమని అభిప్రాయపడ్డారు. విషవాయువు ప్రభావం పది కిలోమీటర్ల వరకూ ఉన్నందున ఆ పరిధిలోని   ప్రజలకు జరిగిన ఆర్థిక, భౌతిక, జంతు నష్టం, దీర్ఘకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీ దృష్టిలో ఉంచుకొని నష్టపరిహారం లెక్కించాలని డిమాండ్‌ చేశారు. అనేక మంది జీవితాలు పోయాయని, వారికీ తగిన న్యాయం జరగాలన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. 


మేఘాద్రి నీరు నిలిపివేత

పాలిమర్స్‌కు సమీపంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి నగరానికి నీరు సరఫరా అవుతోందని, కంపెనీ కాలుష్య వ్యర్థాలు అందులో కలుస్తున్నందున... ఇప్పుడు ప్రమాదం వల్ల జలాలు కలుషితమైనందున సరఫరా నిలిపివేయాలని గ్రీన్‌ క్లైమేట్‌ రత్నం ఫిర్యాదు చేయగా, జీవీఎంసీ వెంటనే స్పందించిందని శర్మ వివరించారు. ఎప్పటి నుంచో తాము దీనిపై ఫిర్యాదు చేస్తున్నా స్పందించలేదని, ఇప్పుడు ఈ ఘటనతో నీటి సరఫరా ఆపారన్నారు. 

Updated Date - 2020-05-09T09:39:17+05:30 IST