అసెంబ్లీలో కరోనా
ABN , First Publish Date - 2020-12-03T08:47:40+05:30 IST
శాసనసభ సమావేశాల్లో కరోనా కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు పాజిటివ్‌గా

తణుకు ఎమ్మెల్యే కారుమూరికి పాజిటివ్
మరో ఏడుగురు మృతి.. కొత్తగా 663 కేసులు
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాల్లో కరోనా కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో తాడేపల్లిలోని నివాసంలోనే ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వారం రోజులుగా తనను కలిసినవారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. సోమవారం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. మంగళవారం మహిళా ఎమ్మెల్యేలకు పొందూరు ఖద్దరు చీరలు కూడా బహూకరించారు. ఇతర సభ్యులతో కలసిమెలసి తిరిగారు.
శాసనసభలో ప్రసంగించారు. తాజా పరిణామంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సభ్యుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 663 మందికి పాజిటివ్ నిర్ధారణైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కృష్ణా జిల్లాలో 117, చిత్తూరు 106, తూర్పుగోదావరిలో 60, కడప 29, విజయనగరం 17, శ్రీకాకుళం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏడుగురు కరోనాతో మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని.. 24 గంటల్లో 1,159 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది.