మాట వింటే మనకే మేలు
ABN , First Publish Date - 2020-04-05T08:43:17+05:30 IST
కృష్ణాజిల్లాలో తొలి పాజిటివ్ ఆ యువకుడిదే! విదేశాల నుంచి వచ్చిన ఈ యువకుడు...స్వీయ నిర్బంధంలో ఉండాలన్న వైద్యుల సూచనను సంతోషంగా పాటించారు. పాజిటివ్‌గా తేలినా వారు సూచించినట్టు 14
- ఈ మహమ్మారికి మందు లేదు
- వైద్యులకు సహకరించడమే దారి
- కరోనాను జయించి బయటపడిన
- విజయవాడ యువకుడి కథనం
విజయవాడ, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లాలో తొలి పాజిటివ్ ఆ యువకుడిదే! విదేశాల నుంచి వచ్చిన ఈ యువకుడు...స్వీయ నిర్బంధంలో ఉండాలన్న వైద్యుల సూచనను సంతోషంగా పాటించారు. పాజిటివ్‌గా తేలినా వారు సూచించినట్టు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి పూర్తి ఆరోగ్యంతో శనివారం డిశ్చార్జి అయ్యారు. తాను సాధించిన విజయాన్ని ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకొన్నారు. ‘నేను పారిస్ నుంచి గతనెల 16న ఢిల్లీకి చేరుకున్నాను. 17న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి క్యాబ్‌లో విజయవాడలో మా ఇంటికి వచ్చాను. జిల్లా అధికారులు..14 రోజులపాటు హోం ఐసొలేషన్‌లోనే ఉండాలని సూచించారు. ఇంట్లో ఉండగా జ్వరం రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. కుటుంబ సభ్యులకు నెగెటివ్ రావడంతో ఇంటికి పంపేశారు. నన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. చికిత్స కాలంలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ వైర్‌సను చాలా సులువుగా జయించవచ్చు. దీనికి మందు లేదు. నివారణే మార్గం. ధైర్యంగా ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుంటే నయమవుతుంది. అందుకు నేనే నిదర్శనం. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారు బాధ్యతగా వ్యవహరించాలి. పారిస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక్కరోజు కూడా బయటకు వెళ్లలేదు. అయితే సోషల్ మీడియాలో దానికి భిన్నంగా కథనాలు రావడం బాధించింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.