కిలో బీర 100

ABN , First Publish Date - 2020-03-24T09:11:12+05:30 IST

కరోనా ప్రభావం మార్కెట్‌పై పడింది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనం ఎక్కువ రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు నిల్వ చేసుకునేందుకు

కిలో బీర 100

ధర 3 రెట్లు పెరిగిన అరటి, చిక్కుడు

రైతుబజార్లు కిటకిట.. కొద్దిసేపటికే దుకాణాలు ఖాళీ

ఇతర కూరగాయలదీ అదే దారి

లాక్‌డౌన్‌లో వ్యాపారుల మాయాజాలం 

ఎగబడుతున్న జనం..సిబ్బందికి కరోనా భయం

విజయవాడలో రైతుబజార్ల మార్పు

 బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తే అరెస్టే: కొడాలి 

అమరావతి, విజయవాడ, ఏలూరు, గుడివాడ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం మార్కెట్‌పై పడింది.  ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనం ఎక్కువ రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. దీంతో కూరగాయల ఽధరలకు రెక్కలు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో నిన్నమొన్నటి వరకు కిలో గరిష్ఠంగా రూ.30కు అమ్మిన బీర, ఇప్పుడు రూ.100కు చేరింది.   మార్కెట్‌లో ధరలను నియంత్రిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో ఎక్కడా కనిపించలేదు. చిక్కుడు, బీర, అరటికాయ ధరలు ఒక్కసారిగా మూడింతలు పెంచేశారు. ఉల్లి ఽ కిలో రూ.25 నుంచి రూ.50కు పెరిగింది. పప్పుల ధరలన్నీ 5-8 రూపాయల చొప్పున పెంచేశారు. మార్కెట్‌లో ఎక్కడ చూసినా కృత్రిమ కొరత కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ చేశారని, రేపటి నుంచి సరుకు అందుబాటులో ఉండదని వ్యాపారులు పెద్దఎత్తున ప్రచారం చేయడంతోపాటు ఉగాది సమీపిస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పల్లెల్లోనూ కూరగాయలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగి సోమవారం కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినా తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. రైతుబజార్లలోనూ సోమవారం మధ్యాహ్నం వరకు ఎడాపెడా ధరలు పెంచి అమ్మకాలు చేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం మార్కెట్లన్నింటిలోనూ ధరలు అదుపు తప్పాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలు నియంత్రిస్తామని పశ్చిమగోదావరి జేసీ వెంకటరమణారెడ్డి చెప్పారు.  రాష్ట్రవ్యాప్తంగానూ లాక్‌ డౌన్‌తో నిత్యావసర వస్తువులకు డిమాండ్‌ వచ్చింది. కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు సోమవారం కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. జనం గుంపులుగా ఎగబడటంతో కొందరు వ్యాపారులు దుకాణాలను మూసేశారు. కొన్ని చోట్ల పోలీసులే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరిస్తూ, దుకాణాలు మూయించారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ అమలు కానుండటంతో కిరాణా సరుకులు, కూరగాయల కోసం ప్రజలు దుకాణాల వద్ద ఎగబడుతున్నారు. రెండురోజులుగా ప్రజారవాణా నిలిచిపోవడంతో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా స్తంభించింది. దీంతో పట్టణాల్లోని రైతుబజార్లకు వినియోగదారులు పోటెత్తుతున్నారు. దాదాపు అన్ని రైతుబజార్లు కిటకిటలాడాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి తదితర నగరాల్లో రైతుబజార్లు రద్దీగా మారాయి. 


 రైతుబజార్లలోని కొన్ని స్టాల్స్‌లో ఉన్న కిరాణా సరుకులతో పాటు   కూరగాయలను వారానికి సరిపడా తీసుకెళ్తున్నారు. దీంతో కొన్ని రకాల కూరగాయలు పూర్తిగా అయిపోయాయి. అడుగుబొడుగు కూడా వదలకుండా కొనేస్తుండటంతో కొద్దిసేపటికే రైతుబజార్లు ఖాళీ అవుతున్నాయి. విజయవాడలో ఆరు రైతుబజార్లు ఉండగా, సోమవారం ఒక్కో రైతుబజారుకు సుమారు 30వేల మంది వరకు వచ్చారు. కొద్దిసేపటికే దుకాణాలు ఖాళీ అవడంతో జనం బయటి మార్కెట్లను ఆశ్రయించారు. బయటి మార్కెట్లలో కిలో టమాటా రూ.80కు, వంకాయలు రూ.60కు విక్రయించారు. వంట నూనెల ధరలూ పెంచేశారు. వేరుశనగ నూనె లీటర్‌ ప్యాకెట్‌ రూ.130 నుంచి రూ.150కి, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.91 నుంచి రూ.100కి, పామాయిల్‌ రూ.82 నుంచి రూ.88కి పెంచారు.   కాగా, రైతుబజార్లు మాత్రమే తమ పరిధిలో ఉంటాయని, ప్రైవేటు మార్కెట్లలో ధరలతో తమకు సంబంధం లేదని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.


ఈ నెల 29నే రేషన్‌: మంత్రి నాని

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు 1.29 కోట్ల కుటుంబాలకు ఈ నెల 29న రేషన్‌ పంపిణీ చేయనున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు. పనుల కోసం బయటకు వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఏప్రిల్‌ 4న కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున వలంటీర్ల ద్వారా అందజేస్తామన్నారు. దీనికోసం సీఎం జగన్‌ రూ.1500 కోట్లు కేటాయించారన్నారు.


కృష్ణాజిల్లా రైతుబజార్ల వేళలు మార్పు ..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం రైతుబజార్ల వేళలను మార్చింది. విజయవాడలోని రైతుబజార్లు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకు పనిచేస్తాయి. అలాగే, ఎక్కువమంది వచ్చినా మూడడుగుల దూరం పాటించేలా విశాలమైన ప్రాంగణాల్లోకి విజయవాడలోని రైతుబజార్లను తరలించారు. స్వరాజ్‌మైదానంలోని రైతుబజార్‌ను ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలోకి, పటమట రైతుబజార్‌ను పటమట హైస్కూల్‌లోకి, కేదారేశ్వరపేట రైతుబజార్‌ను వన్‌టౌన్‌ గాంధీ హైస్కూల్‌లోకి మార్పు చేశారు. మంగళవారం నుంచే అది అమల్లోకి వస్తుందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రకటించారు. కాగా, నిత్యావసర వస్తువులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడే వ్యాపారులను అరెస్ట్‌ చేస్తామన్నారు. ఈ నెల 31 వరకూ కృష్ణా జిల్లాలో 144 సెక్షన్‌ అమలవుతుందని చెప్పారు. 


Read more