మెడ్‌టెక్‌ జోన్‌కు కరోనా ఎఫెక్ట్‌!

ABN , First Publish Date - 2020-05-11T10:16:35+05:30 IST

విశాఖపట్నంలో వైద్య పరికరాలు తయారు చేసే మెడ్‌టెక్‌ జోన్‌కు కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. ఇక్కడ కరోనా పరీక్షలకు అవసరమైన పరికరాలు, కిట్లు

మెడ్‌టెక్‌ జోన్‌కు కరోనా ఎఫెక్ట్‌!

విశాఖపట్నం, మే 10(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో వైద్య పరికరాలు తయారు చేసే మెడ్‌టెక్‌ జోన్‌కు కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. ఇక్కడ కరోనా పరీక్షలకు అవసరమైన పరికరాలు, కిట్లు తయారవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు ఈ ప్రాంగణంలో పనిచేస్తున్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాజువాక సమీపంలోని వడ్లపూడికి చెందిన ఓ యువకుడు దుబాయ్‌ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి విశాఖపట్నానికి మార్చి 20న వచ్చాడు. ఏప్రిల్‌ 4న మెడ్‌టెక్‌ జోన్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడితో పాటు 100 మంది ఆ రోజు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. క్యాంటీన్‌లో 200 మందితో కలిసి భోజనం చేశాడు. ఏప్రిల్‌ 8న వివాహం చేసుకున్నాడు. ఈ నెల మొదటి వారంలో అనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేశారు.


ఈ నెల 5న వైరస్‌ సోకినట్టు నివేదిక వచ్చింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతడిని విచారించగా, ఏప్రిల్‌ 4న మెడ్‌టెక్‌ జోన్‌లో ఇంటర్వ్యూకి హాజరై, అక్కడి 3డీ ల్యాబ్‌కు వెళ్లానని, క్యాంటీన్‌లో భోజనం చేశానని వెల్లడించాడు. దీంతో పోలీసులు మెడ్‌టెక్‌ జోన్‌కు వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. అయితే, ఎక్కడెక్కడి నుంచో ఇంటర్వ్యూలకు వస్తారని, వారి వివరాలు తమ దగ్గర ఉండవని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ యువకుడు ఇంటర్వ్యూకి వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. దీంతో ఆ రోజు విధులకు హాజరైన సిబ్బంది, ఇంటర్వ్యూకు వచ్చిన వారు, క్యాంటీన్‌కు వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.  

Updated Date - 2020-05-11T10:16:35+05:30 IST