‘వర్క్‌’ ఎక్కడి నుంచి?

ABN , First Publish Date - 2020-03-28T08:59:18+05:30 IST

ఆఫీసుకు వెళ్లాలా... వద్దా? ‘ఇంటి నుంచి పని’ మనకు వర్తిస్తుందా? లేదా? ‘లాక్‌డౌన్‌’ అమలులోకి వచ్చి రోజులు గడిచిపోతున్నా... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం ఇప్పటికీ ఇదే అస్పష్టత, గందరగోళం! కేంద్ర, రాష్ట్ర

‘వర్క్‌’  ఎక్కడి నుంచి?

  • ఉద్యోగుల్లో ఇప్పటికీ అయోమయమే.. 
  • స్పష్టమైన ఆదేశాలు లేక గందరగోళం
  • ఇంటి నుంచే చేయాలన్న కేంద్రం.. 
  • సీఎస్‌ తాజా ఆదేశాలున్నా అస్పష్టతే

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆఫీసుకు వెళ్లాలా... వద్దా? ‘ఇంటి నుంచి పని’ మనకు వర్తిస్తుందా? లేదా? ‘లాక్‌డౌన్‌’ అమలులోకి వచ్చి రోజులు గడిచిపోతున్నా... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం ఇప్పటికీ ఇదే అస్పష్టత, గందరగోళం! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని ఆఫీసులను, స్వయం ప్రత్తిపత్తి సంస్థల కార్యాలయాలను మూసి వేయాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది. పోలీసులు, సాయుధ బలగాలు, ట్రెజరీ, వంటగ్యాస్‌, పెట్రోలియం, విద్యుత్తు, పోస్టాఫీస్‌, ఎన్‌ఐసీ, జిల్లా యంత్రాంగం, మునిసిపాలిటీలలో పారిశుధ్య విభాగం, నీటి సరఫరా విభాగాలకు సంబంధించిన అత్యవసర సేవల ఆఫీసులను మాత్రం తెరిచి ఉంచాలని పేర్కొంది. అందులోనూ... ఆయా కార్యాలయాలను ‘కనీస సిబ్బంది’తో నడపాలని తెలిపింది. కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మెమో జారీ చేశారు. కానీ... ఇవి ఇప్పటికీ అమలులోకి రాలేదు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమ్ను ఒక కార్యాలయాన్ని శుక్రవారం మూసివేయగా... ఉన్నతాధికారులు ఫోన్‌ చేశారు. ‘సెలవు ఇవ్వాలని మీకు ఎవరు చెప్పారు? అలాగని ఎక్కడ ఆదేశాలున్నాయి?’ అని ఆగ్రహించి మరీ తిరిగి తెరిపించారు.


సచివాలయంలోనూ అంతే...

జిల్లాలు, మండల కేంద్రాల సంగతి వదిలేస్తే... పాలనా కేంద్రమైన సచివాలయంలోనూ ఇంటి నుంచి పనిపై గందరగోళం కొనసాగుతోంది. అత్యవసర సర్వీసుల జాబితాలో సచివాలయంలోని అన్ని విభాగాలు రావు. ఇలాంటి విభాగాల వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలి. కానీ... గతంలో సిబ్బందిని రెండు బృందాలుగా విభజించి, వారం విడిచి వారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలన్న ఆదేశాలే అమలవుతున్నాయి. సీఎస్‌ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై కూడా సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి సమాచారం లేదు. ‘వచ్చిన వారు వస్తారు. రానివారు రారు’ అన్నట్లుగా నడిపించేస్తున్నారు. సచివాలయంలో 32 విభాగాలు ఉండగా, సీఎస్‌ ఆదేశాల మేరకు... మునిసిపల్‌ శాఖ కార్యదర్శి మాత్రం సచివాలయంలోని తమ విభాగం సిబ్బందిని ఇంటి వద్ద నుంచే పని చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. నిజానికి... వర్క్‌ ఫ్రం హోమ్‌పై స్పష్టత లేకున్నా, ఉద్యోగులు సచివాలయానికి రాలేకపోతున్నారు. శుక్రవారం ఉద్యోగుల హాజరు 10 శాతానికి పడిపోయింది.  ఒకవైపు కరోనా ఉద్ధృతి కలకలం సృష్టిస్తోంది. మరోవైపు... ‘లాక్‌డౌన్‌’ పకడ్బందీగా అమలవుతోంది. రోడ్లమీదికి వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సచివాలయ ‘పుర’ఉద్యోగులకు వెసులుబాటు

లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని సచివాలయంలోని పురపాలక శాఖ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకొనే అవకాశాన్నిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిరక్షణ, తాగునీటి సరఫరా తదితర వ్యవస్థలను నిత్యావసర సర్వీసులుగా వర్గీకరించినందున అధికారులు, ఉద్యోగులు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆదేశాలు 25 నుంచి లాక్‌ డౌన్‌ కొనసాగనున్న 21 రోజులపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ అమలవుతాయన్నారు. ఉద్యోగులందరి నెలవారీ వేతనాలు నిర్దేశిత సమయానికే చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-28T08:59:18+05:30 IST