పిల్లలపైనా పంజా
ABN , First Publish Date - 2020-04-05T08:52:43+05:30 IST
కరోనా భూతం రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ 200కు చేరువైంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే ఏకంగా 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి

- రాష్ట్రంలో కరోనా విస్తరణ..
- 196 పాజిటివ్ కేసులు
- తొలిసారి ముగ్గురు పిల్లలకు..
- ఒకేరోజు 32 మందికి వైరస్
- తాజా పాజిటివ్ కేసుల్లో
- 11ఏళ్ల బాలుడు, 14, 17 ఏళ్ల బాలికలు
- 32లో ముగ్గురు తప్ప అందరికీ ఢిల్లీ లింక్
- గుంటూరులో 10మందికి పాజిటివ్
- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి
- కృష్ణాలో 9, కడప, ప్రకాశంలో 4 చొప్పున
- కర్నూలులో ముగ్గురు, అనంతలో ఒకరికి
- తెలంగాణ నుంచి వచ్చిన ఓ మహిళకూ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : కరోనా భూతం రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ 200కు చేరువైంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే ఏకంగా 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం బాధితుల సంఖ్య 196కు పెరిగింది. తాజాగా గుంటూరులో పదిమందికి, కృష్ణాజిల్లాలో 9మందికి, కడప, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున, కర్నూలులో ముగ్గురికి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకరికి చొప్పున వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో శనివారం ఐదుగురు మహిళలు సహా పదిమంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన కుటుంబీకుల ద్వారా ఈ మహిళలకు వ్యాధి సోకింది. పదిమందిలో గుంటూరు నగరానికి చెందినవారు ఏడుగురు ఉన్నారు. అందులో ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుగురు. వీరంతా 35ఏళ్ల లోపువారే. 11ఏళ్ల బాలుడు, 14, 17ఏళ్ల బాలికలకు కూడా కరోనా సోకింది. ఇంత చిన్నపిల్లలకు ఈ వైరస్ సోకడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యుడి నుంచి వీరందరికీ వైరస్ సంక్రమించింది.
మర్కజ్ నుంచి వస్తున్న ప్రయాణికులతో కలిసి ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించిన గుంటూరు వ్యాపారి కీ వైరస్ సోకింది. మరో బాధితుడు ఢిల్లీ వెళ్లనప్పటికీ పక్కింట్లో నివసిస్తున్న వ్యక్తి కారణంగా కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు మాచర్లకు చెందిన మహిళకు, మంగళగిరికి చెందిన మరో మహిళకు, చేబ్రోలు మండలంలో ఒకరికి వ్యాధి సోకింది. కృష్ణాజిల్లాకు చెందిన 9మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది. తాజాగా పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరు తప్ప అందరూ ఢిల్లీ సమావేశాలతో సంబంధం ఉన్నవారేనని తేలింది. కడపలో ఇద్దరు, బద్వేలులో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లాలో ఇప్పటివరకూ 23 కేసులు నమోదయ్యాయి. వీరిలో 17 మందికి ‘ఢిల్లీ కనెక్షన్’ ఉందని గుర్తించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 2, చీరాలలో ఒకటి, కారంచేడు మండలం కుంకలమర్రులో మరొకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీరందరూ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారితో సన్నిహితంగా ఉన్నవారే. ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ముగ్గురికి కరోనా సోకింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మహిళ(39)కు కరోనా నిర్ధారణ అయింది. ఓ వామపక్ష నాయకుడి కుటుంబానికి చెందిన ఈమె మార్చి 16న తిరుపతి నుంచి రైల్లో హైదరాబాద్ వెళ్లి అక్కడినుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో సన్నిహితుల ఇంట వేడుకలకు కుటుంబంతో సహా హాజరయ్యారు. 19న ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రె్‌సలో బయల్దేరి తిరుపతి చేరుకున్నారు. ఈ నెల 1న వైద్యసిబ్బంది వారందరి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఆ మహిళను రుయా ఆస్పత్రికి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు వారిని కలిసిన 28మందిని క్వారంటైన్‌కు తరలించారు. బాధిత మహిళ ప్రయాణించిన బోగీలో జమాత్ సభ్యులెవరూ ప్రయాణించలేదని చెబుతున్నారు.
200కు చేరువలో...
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు 200 దాటాయి. ఏపీలో వీటి సంఖ్య 196కు చేరింది. మార్చి 30వరకూ రాష్ట్రంలో పాజిటివ్‌లు 23 మాత్రమే. 31నాటికి ఆ సంఖ్య 44కు, ఏప్రిల్ 1కి 111కు చేరింది. అంటే కేవలం 24 గంటల వ్యవధిలో 88 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2 నాటికి 149, ఏప్రిల్ 3 నాటికి 164, ఏప్రిల్ 4 సాయంత్రానికి 196 కేసులకు చేరాయి. దీని ప్రకారం మార్చి 31నుంచి ఏప్రిల్ 4లోపు 173 పాజిటివ్‌లు నమోదయ్యాయి. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో రోజూ 5 నుంచి 10 వరకూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాయి. ఇక కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఐదుకు చేరింది.
మార్చి 30నుంచి బీమా
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రధాని గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ బీమా కింద రూ. 50లక్షల బీమా సౌకర్యం మార్చి 30 నుంచి అమలులో కి వస్తుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. 90రోజుల కాలానికి ఈ బీమా వర్తిస్తుందని తెలిపింది. కాగా, వీరికి భవిష్యత్తు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు...
గుంటూరు - 30
కడప - 23
ప్రకాశం - 21
కృష్ణా - 32
పశ్చిమ గోదావరి - 15
విశాఖపట్నం - 15
తూర్పు గోదావరి - 11
చిత్తూరు - 10
నెల్లూరు - 32
అనంతపురం - 3
కర్నూలు - 4
మొత్తం - 196