ఆగని మరణాలు

ABN , First Publish Date - 2020-05-18T09:11:28+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కొవిడ్‌-19 ఇప్పటికి 50 మందిని బలి తీసుకుంది. ఈ నెలలో సగటున రోజుకొకరు చొప్పున వైరస్‌ బారినపడి

ఆగని మరణాలు

  • రాష్ట్రంలో 50కి చేరిన కరోనా మృతులు
  • అత్యధికంగా కర్నూలులో 19 మంది మృతి
  • 15 మందితో తర్వాత స్థానంలో కృష్ణా జిల్లా
  • తాజాగా మరో 25 మందికి వైరస్‌ నిర్ధారణ 
  • మొత్తం 2,230కి చేరిన పాజిటివ్‌ కేసులు 
  • కేంద్ర బులెటిన్‌ ప్రకారం ఈ సంఖ్య 2,380 
  • వలస కార్మికులను విడిగా చూపడంతో తేడా 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కొవిడ్‌-19 ఇప్పటికి 50 మందిని బలి తీసుకుంది. ఈ నెలలో సగటున రోజుకొకరు చొప్పున వైరస్‌ బారినపడి మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణాజిల్లాలో మరొకరు కరోనాతో మృతి చెందినట్లు ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆరోగ్యశాఖ ప్రకటించింది. మే 1న రాష్ట్రంలో 33 కరోనా మరణాలు నమోదవగా, 17నాటికి వీటి సంఖ్య 50కి చేరింది. అత్యధికంగా కర్నూలు జిల్లాల్లో 19మంది, కృష్ణాలో 15, గుంటూరులో 8, అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఒకరు వైరస్‌ కారణంగా మరణించారు. కాగా, రాష్ట్రంలో ఆదివారం 25 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,230కి చేరింది. ఇవికాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 150మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిని కూడా కలిపితే రాష్ట్రంలో 2,380 పాజిటివ్‌ కేసులున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మరో ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11న చెన్నై నుంచి బస్సుల్లో జిల్లాకు చేరుకున్న వలస మత్స్యకారుల్లో  ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది.


చిత్తూరు జిల్లా నాగలాపురం 8, సత్యవేడు 2, వి.కోట, పిచ్చాటూరు, రామకుప్పం, తిరుపతి రూరల్‌ మండలాల్లో ఒక్కొక్కరికి చొప్పున వైరస్‌ సోకింది. వీటిలో తిరుపతి రూరల్‌ మినహా మిగిలిన కేసులన్నీ కోయంబేడు మూలాలతో నమోదైనవిగా గుర్తించారు. వీటికి అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో మరో 4 కరోనా కేసులు వెలుగు చూశాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మరొకరికి, కర్నూలు జిల్లాలో మరో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. కాగా, కోయంబేడు లింకులతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఇద్దరికి, ఒంగోలులో ఒకరికి కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు కేసులను మాత్రమే బులెటిన్‌లో ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మరో నలుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీరిలో ఒక యువతి వార్డు వలంటీర్‌.  


103మంది డిశ్చార్జి 

కరోనా చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం కృష్ణాజిల్లాలో 42మంది, గుంటూరులో 18మంది, నెల్లూరులో 13మంది, విశాఖపట్నంలో ఏడుగురు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 103మంది డిశ్చార్జి అయ్యారు. 


అంకెల్లో తికమకలు..

కరోనాపై రెండు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఆరోగ్యశాఖ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆ శాఖ విడుదల చేసే బులెటిన్‌లో ఇప్పటికీ తేడాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదువుతున్న కేసులను, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి సంబంధించిన కేసులను వేరుగా చూపిస్తున్నారు. దీనివల్ల లెక్కల్లో తేడాలు వస్తున్నాయి. రాష్ట్రంలో 2,230 కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ చూపించగా, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటిసంఖ్య 2,380గా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన 150మందికి పాజిటివ్‌ వచ్చింది. 


కరోనా కేసులు పెరుగుతాయి: డీఎంఈ

కర్నూలు(హాస్పిటల్‌), మే 17: మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల వలస కార్మికుల రాక, కోయంబేడు కాంటాక్ట్‌ కేసుల కారణంగా జూన్‌, జూలైలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ జీఎస్‌ రాంప్రసాద్‌ తెలిపారు. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కర్నూలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 5- 8వేల పడకలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, అనుమానితులను గుర్తించి చికిత్స అందించామని పేర్కొన్నారు.



Updated Date - 2020-05-18T09:11:28+05:30 IST