శ్రీకాళహస్తిలో కరోనా కేసుల జోరు
ABN , First Publish Date - 2020-06-19T01:57:08+05:30 IST
శ్రీకాళహస్తిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నా... జనం మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్టే ఉంటోంది. ఫలితంగా పట్టణంలోనే కరోనా కేసులు సెంచరీ దాటాయి.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నా... జనం మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్టే ఉంటోంది. ఫలితంగా పట్టణంలోనే కరోనా కేసులు సెంచరీ దాటాయి. 100కు పైగా మందికి ఈ వైరస్ సోకింది. వీరే కాకుండా శ్రీకాళహస్తి మూలాలతో 9మంది ఉద్యోగులకూ కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయినా పట్టణంలో లాక్‌డౌన్ ఛాయలే లేవు. సంపూర్ణ లాక్‌డౌన్ సమయంలో మాత్రమే కొన్ని రోజులు జనం ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రస్తుతం సడలింపులు ఇవ్వడంతో విచ్చలవిడిగా వీధుల్లోకి వచ్చేస్తున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం అసలు పాటించడం లేదు. కొంతమంది మాస్కులు ధరించకుండానే వీధుల్లోకి వస్తున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో కూడా నిబంధనలు పాటించడం లేదు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించమని చెప్పేవారే లేరు.