కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-19T09:16:38+05:30 IST

కరోనా విజృంభిస్తోంది. పల్లెపల్లెకూ విస్తరించి ప్రాణాలు తీస్తోంది. ‘నన్ను తేలిగ్గా తీసుకోవద్దు’ అని హెచ్చరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో... 3963

కరోనా కలకలం

  • ఒక్కరోజే  3,963  కేసులు
  • 52 మంది మృత్యువాత 
  • పాత రికార్డులు తిరగరాసిన కరోనా 
  • 44,609కి చేరిన మొత్తం పాజిటివ్‌లు 
  • 586కు పెరిగిన కరోనా మరణాలు 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)  : కరోనా విజృంభిస్తోంది. పల్లెపల్లెకూ విస్తరించి ప్రాణాలు తీస్తోంది. ‘నన్ను తేలిగ్గా తీసుకోవద్దు’ అని హెచ్చరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో... 3963 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక... ఒక్కరోజులోనే ఏకంగా 52 మంది కరోనా కారణంగా చనిపోయారు. కేసులోనూ, మరణాల్లోనూ ఇప్పటిదాకా ఇదే రికార్డు. జూన్‌ చివరి నాటికి ఏపీలో మొత్తం కేసులు 12,202 మాత్రమే. శనివారం నాటికి వీటిసంఖ్య 44,609కి చేరింది. కేవలం 18 రోజుల్లోనే 32,407 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా మృతులు 192మంది కాగా ప్రస్తుతం వీరి సంఖ్య 586కు పెరిగింది. సగటున రోజుకు 22మంది చొప్పున కరోనాకు బలవుతున్నారు. తాజాగా శనివారం రికార్డు స్థాయిలో 3,963 కొత్త కేసులు నమోదవగా, ఒక్కరోజులో అత్యధికంగా 52మంది మృతిచెందారు. తూర్పుగోదావరిలో 12మంది, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో 8మంది చొప్పున, అనంతలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, చిత్తూరు, కడప, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్‌కు బలయ్యారు. కర్నూలు జిల్లాలో మరో 550 కేసులు నమోదయ్యాయి. నంద్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 335మందికి వైరస్‌ సోకింది. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఓ బ్యాంకులో 12మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో మరో 182 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం నగరంలో శనివారం నుంచి 14రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని కలెక్టర్‌ జె.నివాస్‌ ప్రకటించారు. పాలకొండ కోటదుర్గమ్మ ఆలయ అర్చకుడు కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారని ఈవో వాసుదేవరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వరకూ ఆలయాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో మరో 424మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 311, అనంతపురంలో 220, నెల్లూరులో 195, విశాఖలో 179, కడపలో 132, కృష్ణాజిల్లాలో 130, విజయనగరంలో 110 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-19T09:16:38+05:30 IST