3 లక్షలకు చేరువలో..
ABN , First Publish Date - 2020-08-16T11:14:31+05:30 IST
కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,732మంది కొవిడ్ బారిన పడ్డారని..

- ఒక్కరోజే 8,732 కేసులు
- మరో 87 మంది మృత్యువాత
- మొత్తం పాజిటివ్‌లు 2,81,817
- 2,562కు చేరిన కరోనా మరణాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,732మంది కొవిడ్ బారిన పడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 2,81,817కు చేరాయి. ఇదే ఉధృతి కొనసాగితే మంగళవారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 3లక్షలు దాటే అవకాశం ఉంది.
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్‌లు నమోదైన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించనుంది. తాజాగా 10,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1.91,117 మంది డిశ్చార్జ్ అయ్యారు. శనివారం కరోనా కాటుకు మరో 87మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో పదిమంది, గుంటూరులో తొమ్మిది మంది, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది చొప్పున, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణాజిల్లాలో ముగ్గురు మృతిచెందారు.
దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 2,562కు పెరిగాయి. గుంటూరు(284), కర్నూలు(283), తూర్పుగోదావరి(266), అనంతపురం(216), విశాఖ (199)లో మరణాలు నమోదయ్యాయి. చిత్తూరులో మరో 513 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీకి చెందిన వీఆర్‌ఏ ఒకరు వైరస్ బారినపడి మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,126, విశాఖలో 894, అనంతపురంలో 851, కర్నూలులో 734, శ్రీకాకుళంలో 638, గుంటూరులో 609, నెల్లూరులో 572, విజయనగరంలో 561, కడపలో 389, కృష్ణాజిల్లాలో 298 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి.
పులిహోరలో ఇసుక!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ సమస్యలకు నిలయంగా మారింది. భోజనాలు సక్రమంగా ఉండటం లేదంటూ బాధితులు వాపోతున్నారు. శనివారం ఉదయం అల్పాహారం కోసం ఏర్పాటు చేసిన పులిహోరలో ఇసుక రావడంతో బాధితులు దాన్ని తినకుండా చెత్తుకుండీల్లో పారబోశారు. దీంతో స్పందించిన అధికారులు మరోసారి పులిహోర చేయించి బాధితులకు అందజేశారు. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేదని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.