40 వేలు దాటేశాయి

ABN , First Publish Date - 2020-07-18T08:42:43+05:30 IST

రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 2,602 కేసులు నమోదయ్యాయి.

40 వేలు దాటేశాయి

  • ఒక్కరోజే 2602 మందికి కరోనా 
  • నిత్యం రికార్డు స్థాయిలో కేసులు 
  • రాష్ట్రంలో 40,646 పాజిటివ్‌లు 
  • కర్నూలులో మరో ఎమ్మెల్యేకి కొవిడ్‌ 
  • ‘తూర్పు’లో ఎమ్మెల్యే పీఏకి నిర్ధారణ 
  • 12 జిల్లాల్లో 42మంది మృత్యువాత  
  • 534కు పెరిగిన కరోనా మరణాలు 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 2,602 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,592మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్‌ సోకింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 40,646కు చేరాయి. ఇప్పటివరకూ మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే 40వేలకు పైగా కేసులునమోదయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఏపీ కూడా చేరింది. శుక్రవారం అనంతపురంలో ఆరుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, విశాఖల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణాజిల్లాలో ఒక్కరు కలిపి మొత్తం 42మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 534కు చేరాయి. తిరుపతిలోని కొవిడ్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ కడప జిల్లాకు చెందిన ఇద్దరు విలేకరులు మృతిచెందారు. వీరి మృతిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


హోం ఐసొలేషన్‌లో ఎమ్మెల్యే 

కర్నూలు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. కొద్దిరోజులు అస్వస్థతకు గురైన ఆయన 13న పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో సహా నియోజకవర్గంలోని తన స్వగృహంలోనే హోం ఐసొలేషన్‌లోకి వెళ్లారు. గురువారం రాత్రి ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


5వేలు దాటేసిన కర్నూలు 

కర్నూలు జిల్లాలో మరో 315మంది కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 5,131కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 608 కేసులు నమోదయ్యాయి. జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పీఏకు వైరస్‌ సోకింది. చిత్తూరు జిల్లాలో మరో 496 కేసులను యంత్రాంగం గుర్తించింది. అనంతపురంలో 297, గుంటూరులో 226, నెల్లూరులో 205, శ్రీకాకుళంలో 166, కడపలో 51, కృష్ణాజిల్లాలో 37 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. 


అసెంబ్లీలో మరో ఏడుగురికి పాజిటివ్‌ 

అసెంబ్లీ రిపోర్టింగ్‌ విభాగంలో విధులు నిర్వర్తించే ఆరుగురికి, మార్షల్‌ విధులు నిర్వర్తించే పోలీస్‌ కానిస్టేబుల్‌కు శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ(10), సచివాలయం(41)లో కలిపి మొత్తం కేసుల సంఖ్య 51కి చేరింది. 


కొవిడ్‌కు సీఆర్డీయే ఉద్యోగి బలి

ఏపీసీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఓ అటెండర్‌ కరోనాతో మృతి చెందారు. విజయవాడలోని కొవిడ్‌ చికిత్సా కేంద్రంలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, సీఆర్డీయే, ఏడీసీ అధికారులు, ఉద్యోగులకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో శుక్రవారం మరో అయిదారుగురికి కొవిడ్‌ సోకినట్లు తేలిందని సమాచారం. 


ఉన్నతాధికారి కుటుంబానికి కరోనా 

గుంటూరు జిల్లాలో ఓ ఉన్నతాధికారి కుటుంబం కరోనా బారిన పడింది. అధికారితో పాటు ఆయన సతీమణి, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఆ మొత్తం కుటుంబాన్ని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారంరోజులుగా ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లాలో వైరస్‌ నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పాజిటివ్‌ రావడంతో మిగతా అధికారులు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2020-07-18T08:42:43+05:30 IST