‘పంచాయతీ’పై కరోనా అస్త్రం!

ABN , First Publish Date - 2020-12-13T08:32:39+05:30 IST

ప్రజలకు ప్రాణాంతక వైరస్‌ సోకుతుందన్న ఆందోళనతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను గత మార్చిలో వాయిదా వేశారు.

‘పంచాయతీ’పై  కరోనా అస్త్రం!

తేదీలు వేసి మరీ ఇచ్చిన వైద్య నిపుణులు

జనవరి 15-మార్చి 15 మధ్య రావొచ్చని హెచ్చరిక

సరిగ్గా పంచాయతీ ఎన్నికల సమయంలోనే!

క్రిస్‌మస్‌ నాడు యథావిధిగా పట్టాల పంపిణీ

మర్నాటి నుంచే కట్టడి ఆంక్షలకు శ్రీకారం

ఎస్‌ఈసీకి కూడా నివేదిక పంపిన సర్కారు

వైరస్‌ నిజంగా విజృంభిస్తే ఎన్నికలు పెడతారా?

దారులన్నీ బంద్‌ అవడంతోనే తాజా ఎత్తుగడ

రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ


ప్రజలకు ప్రాణాంతక వైరస్‌ సోకుతుందన్న ఆందోళనతో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను గత మార్చిలో వాయిదా వేశారు. జగన్‌ ప్రభుత్వం ఆయన చర్యను ఆనాడు తీవ్రంగా వ్యతిరేకించి.. సుప్రీంకోర్టు దాకా వెళ్లి చతికిలపడింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన వేళ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ జారీచేస్తే.. కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పుందంటూ.. నిర్వహించడానికి వీల్లేదని మొండికేస్తోంది. దీనిపై హైకోర్టులో చుక్కెదురవుతుందన్న అనుమానంతో.. ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసింది. సరిగ్గా పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో సెకండ్‌ వేవ్‌ ముప్పుందంటూ వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని.. ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేకుండా.. కట్టడి ఆంక్షలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికే ప్రభుత్వం కరోనా సెకండ్‌ వేవ్‌పై నివేదికను తయారుచేయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే ప్రొసీడింగ్స్‌ జారీ చేయడం.. దీనిపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం, ప్రొసీడింగ్స్‌ నిలుపుదలకు న్యాయస్థానం నిరాకరించడం.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉండగా.. ఎలాంటి ఎన్నికలూ జరిపేది లేదని జగన్‌ ప్రభుత్వం పట్టుదలతో ఉన్న విషయం విదితమే. అయితే కరోనా ముప్పు సాకును ఎవరూ విశ్వసించే పరిస్థితి లేకపోవడం, అన్ని దారులూ మూసుకుపోవడం వల్లే చిట్టచివరి ప్రయత్నంగా వైద్య నిపుణుల నివేదికను తయారు చేయించిందని రాజకీయ వర్గాల్లోనే గాక.. అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కచ్చితంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలోనే అంటే.. జనవరి 15-మార్చి 15 మధ్య సెకండ్‌ వేవ్‌ ఉంటుందని సర్కారు అభీష్టానుసారమే నిపుణులు తేదీలు వేసి నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.


అంతేకాదు.. ఈ నెల 25వ తేదీన క్రిస్‌మస్‌ నాడు జగన్‌ సర్కారు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. కొత్త ఇళ్ల నిర్మాణానికి కూడా అదే రోజు శ్రీకారం చుట్టనుంది. ఆ మర్నాటి నుంచే సెకండ్‌ వేవ్‌ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతోంది. అంటే ఎన్నికల కోడ్‌, ఆంక్షల్లో ఈ వ్యవహారం చుట్టుకోకుండా ముందస్తు ఎత్తుగడతోనే 25వ తేదీన పట్టాలు పంపిణీ చేయబోతున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. 


దారులు మూసుకుపోయినట్లేనా?

కరోనా కారణంగా గత మార్చిలో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదావేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి.. కమిషనర్‌పై కులం పేరిట కూడా విమర్శలు చేశారు. సీఎం కంటే విచక్షణాధికారం ఎవరికి ఉంటుంది.. తమకు 151 స్థానాలు ఉన్నాయని హుంకరించారు. కానీ ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. కాకపోతే ఎన్నికల కోడ్‌ను ఎత్తేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. కాగా.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక దశలో వరుసగా 20 రోజులపాటు పది వేల కేసులు నమోదు కాగా.. ఇప్పుడు రోజుకు 300 నుంచి 500 వరకే వస్తున్నాయి. ఈ తరుణంలో అధికారులతో చర్చించాకే.. రాజకీయాలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ సమాయత్తమయ్యారు. ఫిబ్రవరిలో జరిపేందుకు ప్రొసీడింగ్స్‌ జారీచేశారు. ఇందుకు రాష్ట్రప్రభుత్వం ససేమిరా అంది.


సెకండ్‌ వేవ్‌ ముప్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కుదరదంటూ సీఎస్‌ నీలం సాహ్ని ఆయనకు లేఖ రాశారు. ప్రొసీడింగ్స్‌ నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. కరోనా తీవ్రంగా ఉన్న రాజస్థాన్‌, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో సైతం స్థానిక ఎన్నికలు, శాసనమండలి ఎలక్షన్లు జరుగుతున్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను, వివిధ రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ దిగ్విజయంగా నిర్వహించింది. ఎస్‌ఈసీ వీటన్నిటినీ కోర్టులో ప్రస్తావించింది. ఎన్నికలను అడ్డుకునే దారులన్నీ మూసుకుపోయిన  దరిమిలా.. ఆఖరి అస్త్రంగా నిపుణుల నివేదికను ప్రభుత్వం వాడుకుంటోందని అధికార వర్గాలు అంటున్నాయి. నిజానికి సెకండ్‌ వేవ్‌ ముప్పు ఉంటే కచ్చితంగా వైద్య నిపుణులు అంచనా వేస్తారని.. ఆ పరిస్థితులు వేరేగా ఉండేవని.. కానీ వైరస్‌ తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ వ్యవహారాన్ని రాజకీయ లబ్ధికి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నాడు పారసిటమల్‌ చాలన్నారు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో.. అది మామూలు జ్వరమేనని.. పారసిటమల్‌ వేసుకుంటే చాలని.. వీధుల్లో బ్లీచింగ్‌ చల్లితే సరిపోతుందన్నవారు.. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ బూచిచూపి స్థానిక ఎన్నికలను అడ్డుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొవిడ్‌-19పై వైద్య నిపుణుల నివేదికను రాజకీయ స్వార్థానికి ఉపయోగించడం దారుణమని చెబుతున్నాయి. ఈ నివేదికను ఎస్‌ఈసీకి కూడా పంపినట్లు తెలిసింది. వాస్తవానికి కరోనా విజృంభించనుందని.. ఆ సమయంలో ఎన్నికలు జరిగితే జననష్టం తీవ్రంగా ఉంటుందని కమిషనర్‌ నిమ్మగడ్డ ముందుగానే ఊహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి సమాచారం తీసుకుని.. ఇతర రాష్ట్రాల్లోని తోటి ఎస్‌ఈసీలతో మాట్లాడి..


రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదావేశారు. అలాంటప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తే ఆయన ఎన్నికలు నిర్వహిస్తానని మొండికేస్తారా..? అలా చేస్తే కేంద్రం గానీ, కోర్టులు గానీ ఊరుకుంటాయా..? అన్నిటికీ మించి తమ ప్రాణాలతో చెలగాటమాడడాన్ని ప్రజలు అంగీకరిస్తారా..? తిరగబడరా.. అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు నిర్వహించారాదన్న మొండిపట్టుదలతో ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి.

Updated Date - 2020-12-13T08:32:39+05:30 IST