కోరలు చాచిన మహమ్మారిపై.. ఒట్టి చేతులతో పోరాటమా!

ABN , First Publish Date - 2020-04-05T08:44:28+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. కేంద్రం భారీగా నిధులు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్తోంది. అయితే తాము ఒట్టి

కోరలు చాచిన మహమ్మారిపై.. ఒట్టి చేతులతో పోరాటమా!

  • బ్లీచింగ్‌, మాస్క్‌లకూ నోచని పంచాయతీలు
  • గ్రామాల్లో పారిశుధ్య పనులకు నిధులేవీ?
  • ఆర్థికసంఘం నిధులొచ్చినా సీఎఫ్‌ఎంఎస్‌లో ఆటంకాలు
  • భయాందోళనలో క్షేత్రస్థాయి సిబ్బంది


అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిపై పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. కేంద్రం భారీగా నిధులు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్తోంది. అయితే తాము ఒట్టి చేతులతో ఆయుధం లేని పోరాటం చేయాల్సి వస్తోందని గ్రామ సచివాలయాల సిబ్బంది వాపోతున్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీలకు పైసా కూడా ఇవ్వకుండా ఉచిత సలహాలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు రాక, ఇప్పటికే పనులు చేసిన మాజీ సర్పంచులు అప్పులపాలై ఉన్నారు. ఏవో కొన్ని మేజర్‌ పంచాయతీలకు తప్ప చిన్న పంచాయతీలకు ఆదాయాలు లేనందున జనరల్‌ ఫండ్‌ కింద నిధులు సమకూరే పరిస్థితి లేదు. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు కొంత జమయ్యాయి. అయితే సీఎ్‌ఫఎంఎ్‌సలో ఆటంకాల కారణంగా వాటిని డ్రా చేసుకునే పరిస్థితి లేదని కార్యదర్శులు వాపోతున్నారు.  సైడు కాలువల నిర్మాణం, డ్రైన్ల శుభ్రతకు మాత్రమే 14వ ఆర్థిక సంఘం నిధులను వాడుకోవాలని నిబంధనలు ఉన్నాయని, దీంతో పారిశుధ్యానికి ఆ నిధులు ఖర్చు చేసే వీలులేదంటున్నారు. కరోనాపై అవగాహన కల్పించాల్సిన పంచాయతీ సిబ్బంది మాస్క్‌లు, బ్లౌజ్‌లు కూడా లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. ఇటీవల ఒక్కో వలంటీర్‌కు ఒక్కో మాస్క్‌ ఇచ్చి,  మమ అనిపించారు. ప్రతి 5గంటలకు ఒక మాస్క్‌ మార్చాలని ఓ వైపు చెప్తున్న ప్రభుత్వమే, సిబ్బందికి మాస్క్‌లు సరఫరా చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థతో సిబ్బంది సంఖ్య పెరిగిందే తప్ప ప్రజలకు సౌకర్యాలు పెరగలేదన్న ఆరోపణలొస్తున్నాయి. నిధుల లేమితో కొన్ని గ్రామాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా చల్లే పరిస్థితి లేదంటున్నారు. కరోనా నేపథ్యంలో బ్లీచింగ్‌  బస్తా ధర కూడా రూ.1000కు పెరిగింది.


ఆయుధాలు లేకుండా కరోనాపై పోరాటం చేయాల్సి వస్తోందని పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు. 28వేల మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు రాష్ర్టానికి వచ్చారని ప్రభుత్వమే చెబుతోంది. వారిలో ఎక్కువమంది గ్రామాల నేపథ్యం ఉన్నవారే. వారిని కలిసిన అందరినీ సెల్ప్‌ క్వారంటైన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటివారిని కలవడానికి సిబ్బంది భయపడుతున్నారు. దీనివల్ల తమకూ ఆ మహమ్మారి సోకుతుందన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ కనీసం మాస్క్‌లు, గ్లౌజ్‌లు లేక నిస్సహాయ స్థితిలో పంచాయతీలున్నాయి. దీంతో వలంటీర్లు ఆ కుటుంబాలను సందర్శించే పరిస్థితి లేదని, అందువల్ల గ్రామాల నుంచి ప్రభుత్వానికి ఇచ్చే సమాచారంలో వాస్తవాలు ప్రతిబింభించే అవకాశం ఉండదని పలువురు అధికారులే పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి పకడ్బందీ ప్రణాళికలతో గ్రామ సచివాలయ సిబ్బందిని కరోనా వ్యాప్తి నివారణకు వినియోగించుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-04-05T08:44:28+05:30 IST