కరోనా @425

ABN , First Publish Date - 2020-06-19T09:19:49+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల

కరోనా @425

7496కు చేరిన పాజిటివ్‌లు.. సెంట్రల్‌ జైల్లో ఖైదీకి వైరస్‌ 

కృష్ణాలో మరో ఇద్దరు మృతి.. 92కు చేరిన కరోనా మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 425 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 299మంది రాష్ట్రంలోని వారే కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100మందికి, విదేశాల నుంచి వచ్చిన 26మందికి వ్యాధి సంక్రమించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 7,496కి పెరిగిపోయాయి. తాజాగా 77మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,983 మంది డిశ్చార్జి కాగా 2,779 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


గురువారం కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 92కు చేరాయి. కర్నూలు జిల్లాలో ఒక్కరోజే 74కేసులు నమోదయ్యాయి. ఇందులో జిల్లావాసులు 50మంది, ముంబై వలస కార్మికులు 23మంది, తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నారు. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 1194కు చేరింది. కొత్తగా ఆదోని మున్సిపాలిటీలో 35, ఆదోని రూరల్‌లో 6, కర్నూలులో 6 కేసులు వెలుగు చూశాయి.


అనంతపురం జిల్లాలో మరో 47మంది కరోనా బారినపడ్డారు. అనంతపురంలోని ఓ రెవెన్యూ ఉద్యోగికి, అనంతపురం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో పనిచేసే అధికారికి వైరస్‌ సోకినట్లు సమాచారం. కడప జిల్లాలో మరో 36 కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రొద్దుటూరులోని నడింపల్లె కంటైన్మెంట్‌ జోన్‌లో 16, నవాబుపేటలో 7, కడపలో 8 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మరో 30కేసులు నమోదయ్యాయి. విజయవాడలో 22, మచిలీపట్నం, ఉయ్యూరు, ఊటుకూరు తదితర ప్రాంతాల్లో మరో 8మందికి వ్యాధి సోకింది. శ్రీకాకుళం జిల్లా మందసలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోగా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది.


చిత్తూరు జిల్లాలో మరో 57 కేసులు నమోదయ్యాయి. తిరుపతి రూరల్‌ మండలంలో ఒకే కుటుంబంలో 13 కేసులు వెలుగు చూశాయి. విశాఖపట్నంలో 25 కొత్త కేసులు వచ్చాయి. మరో 4కేసులు నిర్ధారించాల్సి ఉంది. మూలపాలెం ప్రాంతంలో మరో 18మందికి పాజిటివ్‌ అని తేలింది. సీతమ్మధార ప్రాంతంలో యువ దంపతులకు కరోనా వచ్చింది. సిరిపురంలో వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో ఒకరికి వైరస్‌ సోకింది. విజయనగరం జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. చింతలవలస ఐదో బెటాలియన్‌కు చెందిన ఒక పోలీసు ఉద్యోగికి కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలో 38, పశ్చిమ గోదావరి జిల్లాలో 64 కొత్త కేసులు నమోదయ్యాయి. 


తూర్పున కలకలం

తూర్పుగోదావరి జిల్లాలో మరో 25మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 18మంది రాయవరం మండలం చెల్లూరుకు చెందినవారు. జి.మామిడాడ లింకులతోనే వీరికి వైరస్‌ సంక్రమించినట్టు నిర్ధారణకు వచ్చారు. మే 13న ఈ గ్రామం నుంచి 15మంది జి.మామిడాడలో ఓ వివాహానికి హాజరయ్యారు. వీరికి పరీక్షలు చేయగా ఇద్దరికి వైరస్‌ సోకినట్లు తేలింది. వారి కాంటాక్టుల కింద ఇప్పుడు 18మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈ చిన్న గ్రామంలో కేసుల సంఖ్య 58కి చేరింది. హైదరాబాద్‌ నుంచి వచ్చి క్వారంటైన్‌కు రాజమహేంద్రవరం వెళ్లి అక్కడినుంచి పారిపోయి వచ్చిన సామర్లకోట వాసికి వ్యాధి నిర్ధారణయింది. ఇటీవల విజయవాడలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకి తరలించగా అతడికి పాజిటివ్‌గా తేలింది. కాగా, రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళ(55) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు వైరస్‌ నిర్ధారణ అయింది. 


పలమనేరు యువతికి రెండోసారి కరోనా 

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతికి రెండోసారి కరోనా సోకింది. డిశ్చార్జి అయిన వ్యక్తికి రెండోసారి వైరస్‌ సోకడం జిల్లాలో ఇదే మొదటిసారి. పలమనేరుకు చెందిన ఓ యువతి ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. గతనెల 17న పలమనేరుకు చేరుకున్న ఆమెకు కరోనా వచ్చింది. కొవిడ్‌ ఆస్పత్రిలో 17 రోజులపాటు చికిత్స అందించి, కోలుకున్నాక ఈ నెల 3న డిశ్చార్జి చేశారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. జూన్‌ 17తో క్వారంటైన్‌ గడువు ముగియడంతో మరోసారి నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను హోం ఐసొలేషన్‌లో ఉంచారు. ‘రెండోసారి వచ్చే వైరస్‌ అంత ప్రమాదకరం కాదు. ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఆమెను హోం ఐసొలేషన్‌లో ఉంచాం’ అని కలెక్టర్‌ భరత్‌గుప్తా చెప్పారు. 


కోతి తెచ్చిన తంటా!

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని క్వారంటైన్‌ కేంద్రంలో గురువారం ఓ కోతి హల్‌చల్‌ చేసింది. సాయంత్రం టీ విరామ సమయంలో రెండో అంతస్తులో సేదతీరుతున్న వలస కూలీలపై కోతి దాడి చేసింది. దీంతో వారంతా ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఎర్రయ్య అనే వ్యక్తి భయంతో కిందకు గెంతడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న తహసీల్దారు ప్రవల్లిక ప్రియ హుటాహుటిన అక్కడకు చేరుకొని, క్షతగాత్రుడ్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. 


మాస్కు వేసుకోలేదని క్వారంటైన్‌కు!

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఓ మద్యం దుకాణం వద్ద మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపించిన ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు. మాస్కు ఽలేకున్నా, భౌతిక దూరం పాటించకున్నా క్వారంటైన్‌కు పంపుతామని ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు. కేసులు తగ్గే వరకు ఈ చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2020-06-19T09:19:49+05:30 IST