రాష్ట్రంలోకి ‘కరోనా 2.0’
ABN , First Publish Date - 2020-12-30T07:54:10+05:30 IST
బ్రిటన్ నుంచి దేశానికి తిరిగివచ్చిన వారిలో ఆరుగురికి కొత్త కరోనా నిర్ధారణ అయింది.

బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కొత్త స్ట్రెయిన్.. దేశంలో మరో ఐదుగురికీ.
- రాజమహేంద్రవరంలో తొలి కేసు నమోదు
- వారం క్రితం ఢిల్లీకి, అక్కడి నుంచి ఏపీకి
- ఆమెతోపాటు వచ్చిన కుమారుడికి నెగెటివ్
- మరో 23 మంది ఫలితాల కోసం ఎదురుచూపు
- తూర్పులో మరో నాలుగు అనుమానిత కేసులు
- కేంద్ర మంత్రి అశ్విని చౌబే, ఇద్దరు తెలుగు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
- కరోనా కొత్త స్ట్రెయిన్‌తో బ్రిటన్‌లో ఆస్పత్రులు ఫుల్
- రోజురోజుకీ పెరుగుతున్న కేసులు
- ఒక్క రోజులో 41 వేల పాజిటివ్‌లు
అమరావతి, న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బ్రిటన్ నుంచి దేశానికి తిరిగివచ్చిన వారిలో ఆరుగురికి కొత్త కరోనా నిర్ధారణ అయింది. వీటిలో ఒక కేసు రాజమహేంద్రవరంలో నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ నెల 22 అర్ధరాత్రి వరకు వివిధ విమానాశ్రయాలకు చేరినవారిలో పాజిటివ్ వచ్చినవారి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా.. బెంగళూరు నిమ్‌హాన్స్‌లో ముగ్గురిలో, హైదరాబాద్ సీసీఎంబీలో ఇద్దరిలో, పుణె వైరాలజీ ల్యాబ్‌లో ఒకరిలో కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. సహ ప్రయాణికులు, కుటుంబంలో, ఇతర కాంటాక్టుల గుర్తింపు కొనసాగుతోందని కేంద్రం పేర్కొంది. ‘మిగతా పాజిటివ్‌ల జన్యు విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తూ.. మరింత పరిశీలన, కట్టడి, పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నాం’ అని వివరించింది. జన్యు విశ్లేషణకు ప్రత్యేకంగా నిర్దేశించిన ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఐఎన్‌ఎ్‌సఏసీవోజీ) ల్యాబ్‌లకు నమూనాలను పంపడంపై మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిపింది. కాగా, యూకే స్ట్రెయిన్ వెలుగులోకి రాకముందే దేశంలో 5వేల నమూనాల జన్యు విశ్లేషణ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. నవంబరు 25-డిసెంబరు 23 మధ్య యూకే నుంచి 33 వేల మంది దేశానికి తిరిగొచ్చారని కేంద్రం తెలిపింది. సోమవారం వరకు 114మందికి పాజిటివ్ వచ్చినట్లు వివరించింది. వీరి నమూనాలను జన్యు విశ్లేషణ కు పది ఐఎన్‌ఎ్‌సఏసీవోజీ ల్యాబ్‌లకు పంపామని పేర్కొంది.
యూకేకు విమానాల రద్దు పొడిగింపు
ఈ నెల 31 వరకు అమల్లో ఉన్న.. బ్రిటన్‌కు పౌర విమాన సర్వీసుల రద్దును మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి మంగళవారం తెలిపారు.
టీకా కొత్త స్ట్రెయిన్‌పైనా పనిచేస్తుంది
కరోనా కొత్త స్ట్రెయిన్‌లపైనా టీకాలు పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కె.విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు. రూపాంతరం చెందే స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే ఎక్కువ శాతం టీకాలు లక్ష్యంగా రూపొందుతాయని పేర్కొన్నారు. కాబట్టి.. కొత్త స్ట్రెయిన్‌పై టీకా పనిచేయదని చెప్పేందుకు ఆధారాలు లేవని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు పాజిటివ్
కేంద్ర మంత్రి అశ్వినీకుమార్ చౌబేకు కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, దేశంలో 187 రోజుల అత్యల్ప సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. జూన్ 25వ తేదీన 16,922 పాజిటివ్‌లు రాగా.. ఆ తర్వాత సోమవారం అతి తక్కువగా 16,432 మందికి వైరస్ నిర్ధారణ అయింది. తాజాగా 252 మంది మృతి చెందారు. మరోవైపు 24,900 మంది కోలుకున్నారు. దీంతో రికవరీలు 98.07 లక్షలకు చేరాయి. యాక్టివ్ కేసులు మరింత తగ్గి 2.68 లక్షలకు పరిమితమయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంతకుమార్ సతీమణి సంతోష్ శైలజ (83) కరోనాతో మృతి చెందారు. శంతకుమార్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి, భద్రతాధికారి, డ్రైవర్‌కు శుక్రవారం వైరస్ నిర్ధారణ అయింది.