-
-
Home » Andhra Pradesh » Construction workers
-
‘భవన’ కార్మికుల కన్నెర్ర!
ABN , First Publish Date - 2020-12-15T09:55:11+05:30 IST
నవరత్నాల మాటున రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కొడిగట్టింది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం

కరోనా కల్లోలంలోనూ ఆదుకోని సర్కారు
సంక్షేమ బోర్డు నిధులూ
ఇతర అవసరాలకు మళ్లింపు
నేడు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): నవరత్నాల మాటున రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కొడిగట్టింది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలకూ చెక్ పెట్టింది. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేసిన 1శాతం సెస్ నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి కార్మికుల సంక్షేమానికి స్వస్తి పలికింది. రాష్ట్రంలో 22.63 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చట్ట విరుద్ధంగా బోర్డు నుంచి మళ్లించిన నిధులను బోర్డు అవసరాలకు వినియోగించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోర్డు నిధులను ఇతర అవసరాలకు వాడరాదని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బోర్డు నిర్వీర్యం..
ఒకప్పుడు కార్మికుల సంక్షేమానికి కల్పతరువుగా ఉన్న ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల మండలి బోర్డును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డుకు సంబంధించి ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడంతో కార్మికుల సంక్షేమం గాల్లో కలిసిపోయిందంటున్నారు. ఈ బోర్డుకు ప్రభుత్వం నుంచి నిధులివ్వాల్సిన అవసరం లేదు. 23 లక్షల మంది కార్మికులు నమోదైన ఈ బోర్డుకు ఏటా వందల కోట్ల రూపాయలు భవన నిర్మాణదారులు చెల్లించే సెస్ రూపంలో వస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి బోర్డులో రూ.2,900 కోట్లు నిధులున్నాయి. అప్పట్లో చంద్రన్న బీమా ప్రీమియం చెల్లించేందుకు బోర్డు నుంచి భారీగా అప్పు తీసుకున్నారు. బోర్డు నిధులను తిరిగి చెల్లించి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన కొత్త ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా మళ్లీ వైఎ్‌సఆర్ బీమా కోసం మొదటి విడతలో రూ.168 కోట్లు మళ్లించింది.
రెండో విడత కూడా మరికొన్ని నిధులు బోర్డు నుంచి మళ్లించింది. దీంతో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటీ అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కింద లాక్‌డౌన్‌లో ఉపశమనానికి రూ.198 కోట్ల ఖర్చుకు వెసులుబాటు కల్పించినా అవేమీ పట్టించుకోలేదు. పైగా కార్మికులకు బ్యాంకు అకౌంట్లు లేవని, అకౌంట్లు ఉన్నవారికి ఆధార్‌తో అనుసంధానం కాలేదని కేంద్రానికి ఇచ్చిన నివేదికల్లో పేర్కొంది. అవన్నీ సమీక్షించి కార్మికులకు చెల్లిస్తామని తెలిపింది. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలు కావాల్సిన ఏ పథకాన్నీ వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. క్లయిం కోసం ఏ దరఖాస్తునూ స్వీకరించలేదు. పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్పులు సైతం బోర్డు ఆపేసింది. బోర్డుకు సంబంధించి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు కాకుండా నిలిపేసింది.