మోదీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారా?..యోగా చేస్తున్నారా?: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-06-22T20:40:02+05:30 IST

మోదీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారా?..యోగా చేస్తున్నారా?: శైలజానాథ్

మోదీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారా?..యోగా చేస్తున్నారా?: శైలజానాథ్

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం‌ చేస్తున్నాయని ఏపీపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారా... కళ్లు మూసుకుని యోగా చేస్తున్నారా అని విమర్శించారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. ఆయిల్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. 


అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా...తమరు చెప్పిన నిబంధనల ప్రకారం ఇక్కడ ఎందుకు తగ్గడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో రోడ్డెక్కి ఆందోళన చేసిన వారు ఇప్పుడు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. మోదీ దయ వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు సమానం అయిపోయాయన్నారు. ఈ అధిక‌ ధరలను అదుపు చేసేలా ఎందుకు నియంత్రించరని అంతర్జాతీయ మార్కెట్‌కు సమానంగా పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సొంత వాహనాలే కాదు.. రవాణా రంగంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయన్నారు. పెట్రో ఉత్పత్తుల పై మోపే పన్నుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేయాలని సూచించారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి రాలేదని మోడీ చెబుతున్నారని... సైనిక శాఖ, కేంద్ర హోంమంత్రి మాత్రం.. చైనా సైనికులు చొరబడ్డారని అన్నారన్నారు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు.. అవరవీరులైన జవాన్ల త్యాగాలను అవమానించడమే అని తెలిపారు. మోదీ చెప్పింది నిజమైతే.. భారత జవాన్లు ప్రాణాలు ఎలా కోల్పోయారని శైలజానాథ్ ప్రశ్నించారు.


పరిపాలన అంటే లాభ, నష్టాల వ్యవహారం కాదు.. ప్రజల సంక్షేమం అని వ్యాఖ్యానించారు. ఏపీలో విద్యుత్ బిల్లులు‌ చూసి భయపడి పోతున్నారని...ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. మూడు నెలల కాలానికి ఒకే బిల్లుతో టారిఫ్ మార్చి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ బిల్లులు ఎలా పెరిగాయో ప్రభుత్వమే చెప్పాలని.. లేదా పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తుందన్నారు. కరోనాతో ప్రజలు యుద్ధం చేస్తుంటే... ప్రభుత్వాలు ఆదాయం కోసం పాకులాడుతున్నాయని మండిపడ్డారు. చైనా సరిహద్దులో అసలు ఏం జరిగిందో, జరుగుతుందో..‌ ప్రజలకు చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-06-22T20:40:02+05:30 IST