మదింపులో కుదింపు!

ABN , First Publish Date - 2020-12-28T08:48:31+05:30 IST

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్ని అతలాకుతలం చేసిన నివర్‌ తుఫాన్‌ పంట నష్టం అంచనాలు తారుమారయ్యాయి.

మదింపులో కుదింపు!

  • నివర్‌ తుఫాన్‌ తుది అంచనాల్లో తగ్గిన పంట నష్టం
  • ప్రాథమిక, తుది అంచనాలకు 5 లక్షల ఎకరాలు తేడా
  • ప్రాథమిక నష్టం 2,831 కోట్లు.. తుది అంచనా 1,948కోట్లు
  • పరిహారానికి జాబితాల్లో పేర్లు లేని రైతుల లబోదిబో
  • చాలా జిల్లాలో నష్టం 33 శాతం కంటే తక్కువని అంచనా


అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్ని అతలాకుతలం చేసిన నివర్‌ తుఫాన్‌ పంట నష్టం అంచనాలు తారుమారయ్యాయి. ప్రాథమిక అంచనాకు.. తుది అంచనాలకు మధ్య 5 లక్షల ఎకరాలకుపైనే కుదించుకుపోయాయి. తద్వారా రూ.883 కోట్ల పరిహారానికి కోత పడింది. నివర్‌ తుఫాన్‌ అనంతరం ఆయా జిల్లాల్లో పర్యటించిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 16.55 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ తుది అంచనాల్లో నష్టాన్ని 11.47లక్షల ఎకరాలుగానే గుర్తించారు. అంచనాల మదింపులో 5లక్షల ఎకరాలకుపైనే కుదింపు జరిగింది. ప్రాథమికంగా 16.55 లక్షల ఎకరాల్లో రూ.2,831కోట్ల విలువైన 12.99లక్షల మెట్రిక్‌ టన్నుల నష్టంగా అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. తుది అంచనాల్లో 11.47లక్షల ఎకరాల్లో పంటనష్టం వల్ల రూ.1,948కోట్ల విలువైన 8.57 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తి నష్టపోయినట్లు తేల్చారు. నివర్‌ కారణంగా దాదాపు 66 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. వాటిలో అత్యధికంగా 36వేల ఎకరాల్లో మిర్చికి నష్టం వాటిల్లింది. మొత్తంగా 50వేల మంది ఉద్యాన రైతులు రూ.335 కోట్లమేర నష్టపోగా, వారికి రూ.43.76కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 33శాతం కంటే ఎక్కువ దెబ్బతింటేనే నష్టంగా పరిగణించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే నివర్‌ తుఫాన్‌ కారణంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఈ నాలుగు జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ పంట నష్టం జరిగిందని రైతులు పేర్కొంటున్నారు. కానీ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ నష్టం చూపి, ఇతర జిల్లాల్లో నష్టాన్ని నామమాత్రమేనని అధికారులు తేల్చారు. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం సుమారు 12లక్షల ఎకరాల పంట నష్టానికి 8.34లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.646 కోట్లను ఈ నెల 30న వారి ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. 


33 శాతం కంటే తక్కువని..

వాస్తవంగా నివర్‌ తుఫాన్‌ సమయంలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోతకొచ్చిన వరి పైరు ముంపు బారిన పడింది. ఓదెలపై వరి పనలు మట్టికొట్టుకుపోయాయి. ధాన్యం తడిసి, మొలకలొచ్చాయి. కుప్పల్లో ధాన్యం రంగుమారాయి. వేలాది ఎకరాల్లో వరికి తీరని నష్టం జరగితే.. అధికారుల ప్రాథమిక అంచనాలకు, తుది అంచనాలకు పొంతన లేకుండా పోయిందని రైతులు విమర్శిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పత్తి పంట కూడా పాడైపోయింది. అప్పటివరకు ఉన్న పూత, పిందె రాలిపోయి, రైతులకు దిగుబడులు తగ్గాయి. సెప్టెంబరు నుంచి నవంబరు వరకు కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లాల్లో వేరుశనగ పంట 80 శాతం పైగా దెబ్బతింది. నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టం మరింత పెరిగింది. మినుము, పెసర, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ ఖరీఫ్‌ సీజన్‌లో సాగై, కోతకొచ్చిన పంటలు కాగా, రబీ సీజన్‌ ప్రారంభంలో వేసిన పైర్లు కూడా తుఫాన్‌కు దెబ్బతిన్నాయి. కానీ ఈ నష్టమంతా 33 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో 33 శాతం కంటే తక్కువ పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం అందే అవకాశం లేకుండా పోతోంది. కాగా రబీ పంట దెబ్బతిన్న రైతులకు 80శాతం రాయితీపై వ్యవసాయశాఖ చేపట్టిన విత్తనాల పంపిణీ కూడా నత్తనడకన సాగుతుండడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2020-12-28T08:48:31+05:30 IST