అంతా అరాచకమే!

ABN , First Publish Date - 2020-07-17T08:02:42+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, కోర్టు ధిక్కార నేరాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ

అంతా అరాచకమే!

  • రాష్ట్రపతికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు
  • 13 నెలల్లో విధ్వంసం, అవినీతి, అక్రమాలు
  • 65 నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టింది.. లక్ష్యం ప్రకారం విపక్ష నేతలపై కేసులు
  • ఇసుక, మద్యం, భూసేకరణలో అక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల భూకబ్జాలు
  • గిట్టని మీడియాకు బెదిరింపులు, నియంత్రణ.. 53 పేజీల్లో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు


న్యూఢిల్లీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం  ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, కోర్టు ధిక్కార నేరాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ తెలుగుదేశం ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌, కేశినేని నాని గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిశారు. జగన్‌ ప్రభుత్వ చర్యలపై సాక్ష్యాధారాలు జత చేసి 53 పేజీలతో కూడిన ఫిర్యాదును అందించారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలు భ్రష్టు పట్టాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తప్పుపట్టింది.


కోర్టు తీర్పులను కూడా జగన్‌ ప్రభుత్వం బేఖాతరు  చేస్తోంది’’ అని ఎంపీలు రాష్ట్రపతికి వివరించారు. దీనిపై రాష్ట్రపతి స్పందిస్తూ... ‘‘ఏపీలో జరుగుతున్న విషయాలన్నీ నాకు తెలుస్తున్నాయి. నా వద్ద   సమాచారం ఉంది. మీరు చేసిన ఆరోపణలపై విచారించి, తగు చర్యలు తీసుకుంటాం. ఇవే అంశాలను పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించండి. అలాగే, సంబంధిత మంత్రిత్వ శాఖలకు కూడా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారని ఎంపీలు మీడియాకు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు ఎవ్వరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వని రాష్ట్రపతి... తొలిసారి తమతోనే భేటీకి అనుమతించారని చెప్పారు. ఈ విషయాన్ని  ఆయనే తమతో చెప్పారని కూడా తెలిపారు. సుమారు 20 నిమిషాలపాటు తాము చెప్పిన అంశాలను ఆసక్తిగా విన్నారన్నారు.


అన్నీ అరాచకాలే... 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందని... అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ‘‘ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారు. రూల్‌ ఆఫ్‌ లా ను, రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందిన వారి తోటలు, బోర్లు ధ్వంసం చేస్తున్నారు. విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.


ఇటీవల సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేసి... ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జి చేయించి, అంబులెన్స్‌లో  జైలుకు తరలించారని రాష్ట్రపతికి తెలిపారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపైనా అక్రమంగా హత్యకేసు పెట్టారన్నారు. ‘‘జగన్‌ ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుని  విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.  మాజీ స్పీకర్‌ దివంగత డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌,  సీనియర్‌ నేతలు సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, నారాయణ,  పత్తిపాటి పుల్లారావు, బొండా ఉమామహేశ్వరరావు, గల్లా జయదేవ్‌ తదితరులపై రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు’’ అని తెలిపారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వ చర్యలను తప్పు పట్టిన ప్రజలపైనా కేసులు పెడుతున్నారని చెప్పారు.


ఫిర్యాదులోని ముఖ్యాంశాలు... 

  1. వైసీపీ సర్కారు గతప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. ప్రభుత్వ అధికారులను భయపెడుతున్నారు. రాజీనామాలు చేయాలంటూ వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
  2. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల అధికారిపై సీఎం, స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అసంబద్ధమైన విమర్శలు, ఆరోపణలతో దాడికి దిగారు. స్వయానా అధికార పార్టీకే చెందిన ఎంపీ కనుమూరి రామకృష్ణంరాజు కూడా తనకు కేంద్రమే భద్రత కల్పించాలని కోరారు.
  3. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చట్టవ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ 65 నిర్ణయాలను  హైకోర్టు తప్పుపట్టింది. సుప్రీం కూడా అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చింది. అయితే జడ్జిలకే దురుద్దేశాలను ఆపాదిస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. 
  4. ప్రభుత్వం మీడియాపైనా దాడికి దిగుతోంది. గిట్టని చానళ్ల ప్రసారాలను అనధికారికంగా నియంత్రిస్తున్నారు. ఎంఎ్‌సవోలను బెదిరించి ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్‌, మొదలైన చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా ఆయా  మీడియా సంస్థల ప్రతినిధులు, సంస్థలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 
  5. బడుగు, బలహీనవర్గాల హక్కులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. విపక్షాలకు చెందిన బలహీనవర్గాల నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు.
  6. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న అమరావతిని అడ్డుకున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. అమరావతి రాజధాని కొనసాగించాలన్న డిమాండ్‌తో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులనుభయపెడుతూ, తప్పుడు కేసులు పెడుతున్నారు. మహిళా రైతులపై దాడులకు తెగబడ్డారు.
  7. జగన్‌ ప్రభుత్వం భూములు, ఇసుక, గనులు, నీరు తదితర వనరులను లూటీ చేస్తోంది.  మద్యం, అంబులెన్స్‌ల వ్యవహారాలలో పెద్దఎత్తున కుంభకోణానికి పాల్పడింది.
  8. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన మనీ లాండరింగ్‌ కేసులో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లబ్ధిపొందింది. సీఎం జగన్‌, ఆయన సతీమణి షేర్‌హోల్డర్స్‌గా ఉన్న ఈ కంపెనీకి ఇప్పుడు కూడా అడ్డగోలుగా లబ్ధిచేకూర్చారు.
  9. రాష్ట్రంలో వైసీపీ నేతలు భూములు కబ్జా చేస్తున్నారు. విశాఖపట్నంలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారు. 
  10. గతంలో ఇళ్ల స్థలాలు, భూములు పొందిన నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల వారి నుంచి వాటిని వెనక్కి తీసుకుంటున్నారు.  
  11. మిషన్‌ బిల్డ్‌ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులు, భూముల అమ్మకానికి పెడుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు.  చివరికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి(టీటీడీ) ఆస్తులను కూడా  వేలం వేయాలని ప్రయత్నించారు.
  12. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 
  13. ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, ప్రతీకార చర్యలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడంలేదు.
  14. వైసీపీ కార్యకర్తలను ప్రభుత్వ వలంటీర్లుగా నియమించి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వారి ద్వారా పక్షపాతధోరణితో, పార్టీ పరంగా అమలు చేస్తున్నారు. 90శాతం మంది వలంటీర్లు వైసీపీ వర్కర్లే అని సాక్షాత్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
  15. ఏడాదిపాలనలోనే రాష్ట్రంలోనే 500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రుణమాఫీ పథ కం కింద రైతులకు నిధులు విడుదల చేయకపోవడంవల్ల రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.

Updated Date - 2020-07-17T08:02:42+05:30 IST